నిర్లక్ష్య తాండవం
- గేట్లు మూసుకోక ముఠా ఆనకట్ట నీరు వృథా
- మరమ్మతులు జరిపినా దక్కని ఫలితం
- సాగునీరందక రైతుల్లో ఆందోళన
పాయకరావుపేట: తాండవ నదిపై ఉన్న ముఠా ఆనకట్ట నుంచి మంగవరం కాలువ ద్వారా ఆరట్లకోట, గుంటప ల్లి, మంగవరం, గోపాలపట్నం, సత్యవరం, మాసాహెబ్‌పేట పరిధిలోని సాగుభూములకు, కుడి కాలువ ద్వా రా రామభద్రపురం, రాంపురం, కేశవరంతోపాటు తుని మండలంలోని కొన్ని ప్రాంతాలకు సాగునీరు అందుతుంది. ఇటీవల కురిసిన వర్షాలకు నదిలో మోస్తరుగా నీరుంది. కానీ ఆనకట్ట కుడివైపు గేట్లు మూసుకోక పోవడంతో వచ్చిన నీరు వచ్చినట్లే నదిలోకి వృథాగా పోతోం ది. అది అలాగే వెళ్లి సముద్రంలో కలిసిపోతోంది.
సమస్యను గుర్తించిన అధికారులు కొద్దిరోజుల క్రితం గేట్లు సరి చేసే నిపుణులను తీసుకువచ్చి పనులు చేయించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. నీటి వృథా ఆగలేదు. దీంతో కాలువలోకి అరకొరగానే నీరు పారి శివారు భూములకు నీరందడం లేదు. నిర్మాణ లోపంతోపాటు గతంలో వచ్చిన తుఫాన్ వరదలకు ఆనకట్టకు ఎడమవైపున ఉన్న మూడు గేట్లు పూర్తిగా వంగిపోయాయి. నీటిపారుదల శాఖ అధికారులు అప్పట్లో తాత్కాలిక మరమ్మతులు జరిపి నీటిసరఫరా అయ్యిందనిపించేవారు. తాండవ నదిలోకి భారీగా నీరు వస్తే తప్ప కాలువల్లోకి నీరు రాని పరిస్థితి మొదటి నుంచీ ఉంది. కాని సమస్య శాశ్వత పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం నదిలో నీటి ఉధృతి లేకపోవడంతో కాలువల్లోకి పూర్తిస్థాయిలో నీరు వెళ్లడం లేదు. కాలువ నీరు అందుతుందన్న ఆశతో రైతులు నాట్లుకు సిద్ధమయ్యారు. తీరా పరిస్థితి ఇలా ఉండడంతో వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.
నిర్మాణమప్పుడే లోపం
ఈ సమస్య ఇప్పటిది కాదు. ఆనకట్ట నిర్మాణ సమయంలోనే గేట్ల ఏర్పాటులో లోపాలుండడంతో ఏటా సీజన్‌లో సమస్యవుతోంది. నీటి వృథాను పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నాం. నదిలో నీరు తగ్గితే గేట్లు మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం.
- సత్యనారాయణదొర, ఇరిగేషన్ ఏఈ