డంపింగ్‌యార్డులా కృష్ణానది
హైదరాబాద్: కృష్ణానదిలో కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఘాటు లేఖ రాశారు. ఏపీలో కృష్ణానది డంపింగ్‌యార్డులో మారిందని తన లేఖలో పేర్కొన్నారు. కృష్ణానది పరిరక్షణను ఏపీ ప్రభుత్వం అసలేమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
కర్నూలు నుంచి వస్తున్న మురుగునంతా కృష్ణానదిలో కలుపుతున్నారని పేర్కొన్నారు. కృష్ణాతీరంలో భారీ భవనాలకు అనుమతి ఇచ్చారని, తీరంలో బహుళ అంతస్తుల నిర్మాణం అక్రమమని ప్రభుత్వానికి తెలిసి కూడా ఇలా చేస్తున్నారని విమర్శించారు. కృష్ణా తీరంలోని ఎంపీ టీజీ వెంకటేశ్ ఇంటి సమీపంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. మురుగు వ్యవస్థను పట్టించుకోకపోవడంతో నీళ్లు పూర్తిగా కలుషితమయ్యాయని చెప్పారు. పాలకులారా ఇప్పటికైనా కళ్లు తెరువండి, కృష్ణా, తుంగభద్ర నదులను కాపాడాండి అంటూ రాజేంద్రసింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ నదుల పరిరక్షణను పట్టించుకోకపోతే.. వచ్చే ఏడాది జరగనున్న తుంగభద్ర పుష్కరాలను బహిష్కరించాలని పిలుపునిస్తామని రాజేంద్రసింగ్ పేర్కొన్నారు.