జననేత బాటలో జనం కదులుతున్నారు. సమైక్యం కోసం ఉద్యమిస్తున్నారు. రాష్ట్రంలో ఇరు ప్రాంతాలకూ సమన్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు సంఘీభావం వెల్లువెత్తుతోంది. మేము సైతం అంటూ జగన్ దీక్షకు మద్దతుగా జిల్లాలో 14 మంది ఆమరణదీక్షలకు దిగారు.
సాక్షి, విజయవాడ : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సమన్యాయం కోసం జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు జిల్లాలో ప్రజల మద్దతు పెరుగుతోంది. జగన్ దీక్షకు సంఘీభావంగా ఇప్పటికే జిల్లాలో ఐదుగురు ఆమరణదీక్షకు దిగగా, మంగళవారం మరో తొమ్మిది మంది దీక్షలు చేపట్టారు. మరో వందమందికి పైగా రిలేదీక్షల్లో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, యువజన నేత జ్యేష్ఠ శ్రీనాధ్ మైలవరంలో చేస్తున్న ఆమరణ దీక్షలు మంగళవారం మూడోరోజుకు చేరుకున్నాయి. వీరికి పెద్ద సంఖ్యలో మద్దతు లభిస్తోంది. పెడన సమన్వయకర్త ఉప్పాల రాము చేపట్టిన నిరాహార దీక్ష రెండోరోజుకు చేరింది. ఆయనకు పార్టీ నేతలు కె.నాగేశ్వరరావు, ఉప్పాల రాంప్రసాద్, వాకా వాసుదేవరావు తదితరులు సంఘీభావం ప్రకటించారు.
విజయవాడలో మాజీ కార్పొరేటర్ జవ్వాది సూర్యనారాయణ (రుద్రయ్య), జయంతికి చెందిన గుంజి సుందరరావు చేపట్టిన నిరాహార దీక్షలు రెండోరోజుకు చేరాయి. మంగళవారం కొత్తగా తిరువూరులో శీలం నాగ నర్సిరెడ్డి, కలికొండ రవికుమార్, ఆలపాటి శ్రీనివాసరావు, కంటిపూడి రమేష్, షేక్ జకీర్, పిడపర్తి లక్ష్మికుమారి, గుడివాడ టౌన్ కన్వీనర్ మరీదు కృష్ణమూర్తి, నూజివీడులో లాకా వెంగళరావు యాదవ్, పెనుగంచిప్రోలు వూట్ల నాగేశ్వరరావు ఆమరణదీక్షలు ప్రారంభించారు. వూట్ల నాగేశ్వరరావు దీక్షా శిబిరాన్ని జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ప్రారంభించారు. పెడన సమన్వయకర్త వాకా వాసుదేవరావు బుధవారం ఆమరణదీక్ష ప్రారంభించనున్నారు.
ఉదయభాను నేతృత్వంలో జలదీక్ష..
జగన్ దీక్షకు మద్దతుగా పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను నేతృత్వంలో విజయవాడ కృష్ణానదిలో జలదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన, పార్టీ జిల్లా ప్రచార కన్వీనర్ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నేతలు బట్టలు ఉతికి నిరసన తెలిపారు. విజయవాడ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో జగన్ మాస్క్‌లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ సమన్వయకర్త పి.గౌతంరెడ్డి తన అనుచరులతో బీఆర్‌టీఎస్ రోడ్డుపై ఉదయం నుంచి సాయంత్రం వరకు సైకిల్ తొక్కి నిరసన తెలిపారు. నందివాడ మండలంలో మండల కన్వీనర్ పెయ్యల ఆదాం నేతృత్వంలో 9 మంది రిలే దీక్షలు చేపట్టారు. పామర్రు సెంటర్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. నూజివీడులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా ప్రతాప్ ఆధ్వర్యంలో రిలేదీక్షలు ప్రారంభించారు. పది మంది కార్యకర్తలు దీక్షల్లో కూర్చున్నారు.
కైకలూరులో పార్టీ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రిలేదీక్షలు మూడోరోజుకు చేరాయి. లోకుమూడి సర్పంచ్ మాడపాటి లక్ష్మణరావు ఆధ్వర్యంలో 30 మంది రిలే దీక్షల్లో కూర్చున్నారు. సాయంత్రం జగన్ మాస్క్‌లు ధరించి డీఎన్నార్ ఆధ్వర్యంలో వినూత్న ప్రదర్శన జరిగింది. వత్సవాయిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించి మానవహారాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. గన్నవరంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు, వంటావార్పు, రహదారుల దిగ్బంధం కార్యక్రమాలను నిర్వహించారు. వత్సవాయిలో పార్టీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. హనుమాన్‌జంక్షన్ ఎస్‌బీఐ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు నాలుగోరోజుకు చేరాయి. వైఎస్సార్‌సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు పార్టీ కండువాలను కార్యకర్తలకు కప్పి దీక్షలను ప్రారంభించారు.
నందిగామ పట్టణంలో జగన్ మాస్కులు ధరించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. వైఎస్సార్‌సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయ కర్తలు, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ తాతినేని పద్మావతి, బీసీ విభాగం జిల్లా కన్వీనర్ పడమట సురేష్‌బాబు ఆధ్వర్యంలో కంకిపాడులో నిరసన ప్రదర్శన, ధర్నా, మానవహారం చేపట్టారు. పెడన పార్టీ కార్యాలయంలో వీవీఆర్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. చాట్రాయిలో రిలే నిరాహారదీక్షలను పార్టీ సమన్వయకర్త మేకా ప్రతాప్ ప్రారంభించారు. మోపిదేవిలో ఆ పార్టీ జిల్లా స్టీరింగ్‌కమిటీ సభ్యుడు కోసూరు రామాంజనేయులు, మెరకనపల్లి పంచాయతీ పాలకవర్గ సభ్యులు రాయన నాంచారయ్య నిరాహారదీక్ష చేశారు. కోడూరు మండల పరిధిలోని సాలెంపాలెంలో పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో రైతులు, నాయకులు దీక్ష చేపట్టారు. విస్సన్నపేటలో రిలేదీక్షా శిబిరంలో చెవులు, కళ్లు, నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు.
విభజనతో సీమాంధ్ర ఎడారే : భాను
రాష్ట్ర విభజనతో సీమాంధ్ర జిల్లాలు ఎడారిగా మారతాయని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను అన్నారు. తెలుగు ప్రజలందరూ కలిసి ఉన్నప్పుడే సీమాంధ్ర జిల్లాల్లోని కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాలను కాపాడుకోగలుగుతామని ఆయన స్పష్టం చేశారు. జగన్ దీక్షకు మద్దతుగా ఆ పార్టీ ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కృష్ణానదిలో జలదీక్ష కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, కృష్ణాజలాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంత ప్రజానీకం విభజన జరిగితే రానున్న రోజుల్లో కృష్ణమ్మ ఎడారిగా దర్శనమిస్తుందన్నారు. కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఆయా నదీ జలాలు అందకుండా తెలంగాణావాదులు అడ్డుతగులుతారని చెప్పారు. మరోవైపు హైదరాబాద్ చుట్టూ సీమాంధ్ర జిల్లాలకు చెందిన విద్యార్థుల విద్యా ఉపాధి అంశాలు ముడిపడి ఉన్నాయన్నారు. పామర్రు సమన్వయకర్త ఉప్పులేటి కల్పన పాల్గొన్నారు.
జగన్ బాటలో...మేము సైతం
Published Wed, Aug 28 2013 3:06 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement