వాషింగ్టన్: ఓవైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న క్రమంలోనే మరో మహమ్మారి ఆందోళన కలిగిస్తోంది. పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో మంకీపాక్స్‌ను సైతం ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితిగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. వైరస్ సోకిన వారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వారికి ఇది సోకుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే.. ప్రస్తుతం మంకీపాక్స్ ఇతర పద్ధతుల్లోనూ ఇతరులకు సోకుతోందని డబ్ల్యూహెచ్‌ఓ అధికారులు పేర్కొన్నారు. తాజాగా ఒకే వ్యక్తిలో కరోనా వైరస్, మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ అయింది. అమెరికాకు చెందిన వ్యక్తిలో రెండు వైరస్‌లను శనివారం గుర్తించారు. ఇలా ఒకే వ్యక్తిలో రెండు వైరస్‌లు గుర్తించటం తొలిసారిగా అగ్రరాజ్యం అధికారులు తెలిపారు.
కాలిఫోర్నియాకు చెందిన మిట్కో థాంప్సన్ కు జూన్‌లో కరోనా వైరస్ సోకింది. ఆ తర్వాత కొన్ని రోజులకు వీపు, కాళ్లు, చేతులు, మెడపై ఎర్రటి బొబ్బలు కనిపించాయి. పరీక్షలు నిర్వహించగా అది మంకీపాక్స్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. ‘నాకు మంకీపాక్స్, కరోనా వైరస్ రెండూ ఉన్నాయని వైద్యులు కచ్చితంగా చెప్పారు.’ అని ఓ ఛానల్‌కు తెలిపారు మిట్కో థాంప్సన్. ఇన్‌ఫ్లూయెంజా కేసుగా మారిందని, జ్వరం, శ‍్వాస తీసుకోలేకపోవటం, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపించాయి.
అమెరికాలో ఇప్పటి వరకు 2,400 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఇద్దరు పిల్లల్లో మంకీపాక్స్ నిర్ధరణ అయింది. ఈ వైరస్ సన్నిహితంగా మెలిగిన వారికి సోకుతుంది. ఫ్లూ, శరీరంపై బొబ్బల వంటి లక్షణాలు కనిపిస్తాయి. అమెరికాలో ఇప్పటికే కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. బీఏ5 వేరియంట్ వేగంగా విజృభిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. జులై 19న అత్యధికంగా ఒక్క రోజే 1.7 లక్షల కేసులు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment