'క్షమాపణ చెప్పేందుకు అభ్యంతరం లేదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడింది. అంతకుముందు టీడీపీ సభలో ప్రవేశ పెట్టిన సభా హక్కుల ఉల్లంఘనపై గురువారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభలో పార్టీ సభ్యులు స్పీకర్ కోడెల శివప్రసాద్కి క్షమాపణలు తెలిపారు. ఈ సందర్భంగా తండ్రిలాంటి మీకు క్షమాపణ చెప్పేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. అలాగే అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ... మీరన్నా, అధ్యక్ష స్థానమన్నా గౌరవం ఉందని ఆయన స్పష్టం చేశారు. నా వ్యాఖ్యాల వల్ల మీరు బాధపడి ఉంటే సదరు వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కొడాలి నాని వెల్లడించారు.
అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పీకర్ను ఉద్దేశించి మాట్లాడారు... తప్పు చేస్తే సారి చెప్పడానికి తమకు నమోషీ లేదన్నారు. అటూ ఇటూ మాట్లాడటం చేతగాదన్నారు. తాము ఏది మాట్లాడిన ముక్కసూటిగా మాట్లాడతామని వైఎస్ జగన్... స్పీకర్ ఎదుట కుండబద్దలు కొట్టారు. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందించి... మాట్లాడారు. ఆ తర్వాత సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.