ఉల్లిలేని కూర, టమాట లేని చారును ప్రజలు ఊహించడం కష్టమే. అందుకే వాటి వినియోగం భారీ స్థాయిలో ఉంటుంది. అదే స్థాయిలో వాటి ధరలు కొండెక్కుతున్నాయి. ఇటీవల వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో వీటి ధరలు తారాజువ్వల్లా దూసుకుపోతున్నాయి. వీటిని తినాలనే కోరిక ఉన్నా ధర చూసి జనం జడుసుకుంటున్నారు. నోరు కట్టేసుకుని పచ్చడి మెతుకులతో సరిపెట్టుకుంటున్నారు.
మదనపల్లె, న్యూస్‌లైన్:
జిల్లాలో టమాట పంటకు మదనపల్లె పెట్టింది పేరు. ఇక్కడ టమాట పంట అత్యధికంగా పండించి, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు మారిపోయాయి. పంట చివరి దశకు చేరింది. దీనికితోడు వరుస వర్షాలు పంటను సర్వనాశనం చేస్తున్నాయి. చేలల్లో నీళ్లు నిలబడిపోవడంతో టమాట మొక్కలు చనిపోతున్నాయి. కాయలు మచ్చలు ఏర్పడి కుళ్లిపోతున్నాయి. ఫలితంగా దిగుబడి తగ్గిపోయింది. గతంలో స్థానిక మార్కెట్‌కు రోజుకు సగటున 400 టన్నుల వరకు వచ్చేది. ఇప్పుడు 120 టన్నులకు పడిపోయింది. ధరలు రోజురోజుకూ రెట్టింపవుతున్నాయి. వారం రోజులుగా సగటున కిలో రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతోంది. వర్షాలు ఇలాగే కురిస్తే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
ఘాటెక్కిన ఉల్లి
జిల్లాలో ఉల్లి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మేలు రకం ఉల్లి కిలో రూ.70 నుంచి రూ.80 వరకు లభిస్తోంది. నాసిరకం ఉల్లి రూ.60కి దొరుకుతోంది. అధికరేటు వెచ్చిం చినా నాసిరకం ఉల్లి ఘాటు లేకపోవడంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాకు బెంగళూరు నుంచి ఉల్లి దిగుమతి అయ్యేది. పై-లీన్ కారణంగా అక్కడ దిగుబడి తగ్గిపోవడంతో దిగుమతి పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇదిలావుండగా మార్కెట్‌కు వచ్చే అరకొర పంటను వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి, బయట మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించడం రివాజుగా మారుతోంది. ఆదివారం రైతుల వద్ద నుంచి టమాట పంటను రూ.39కి కొనుగోలు చేశారు. బయట మార్కెట్‌లో రూ.45 నుంచి రూ.50 వరకు విక్రయించడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది
కొనలేం..తినలేం..
Published Mon, Oct 28 2013 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM
Advertisement
Advertisement