madana palle
-
హత్యాయత్నానికి దారి తీసిన విగ్రహ తయారీ
సాక్షి, మదనపల్లె(చిత్తూరు) : ప్రతీకారంతోనే ఆటో డ్రైవర్ కాయల ఈశ్వర్ (38)పై ప్రత్యర్థులు హత్యాయత్నానికి పాల్పడ్డారని వన్ టౌన్ సీఐ తమీమ్ అహమ్మద్ బుధవారం విలేకరులకు తెలిపారు. ఈ నెల 8 రాత్రి బుగ్గకాలువలోని యాహల్లి లేఔట్ సమీపంలో కాయల ఈశ్వర్‌పై బుగ్గకాలువలో ఉంటున్న మల్లెల ఆనంద్ కుమార్ వర్గీయులు ఏడుగురు వేట కొడవళ్లతో దాడిచేసి హతమార్చేందుకు యత్నించారని, అనంతరం పారిపోయిన ఏడుగురు నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు చెప్పారు. మరొకరిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఇరువర్గాల నడుమ ఆధిపత్య పోరే హత్యాయత్నానికి దారితీసిందని పేర్కొన్నారు. గత ఏడాది వీధిలో వినాయకుని విగ్రహం ఏర్పాటుచేసే విషయమై ఈశ్వర్ వర్గానికి, మల్లెల ఆనంద్ కుమార్ వర్గానికి ఘర్షణ చోటుచేసుకుందని, అప్పటి నుంచి ఒకరిపై మరొకరు కక్ష పెంచుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక యాహల్లి లేఔట్ సమీపంలో ఈశ్వర్ ఒంటరిగా మద్యం తాగుతున్నాడని తెలుసుకుని ఆనంద్ కుమార్ అనుచరులు బుగ్గకాలువకు చెందిన వనపర్తి వినోద్ కుమార్, వనపర్తి మంజునాథ, గుర్రాల లోకేశ్వర్, ప్రకాశం వీధికి చెందిన మల్లెల సందీప్, కోసువారి పల్లెకు చెందిన మల్లెల శాంతరాజ్, రాంనగర్‌కు చెందిన కుందన రామకృష్ణ కర్రలు, వేటకొడవళ్లతో ఈశ్వర్‌పై దాడి చేశారన్నారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడి తప్పించుకుని జనావాసాల మధ్యకు వచ్చి పడిన బాధితుడిని గమనించిన అక్కడి ప్రజలు వెంటనే సమాచారం ఇవ్వడంతో తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని ప్రాణాపాయస్థితిలో ఉన్న ఈశ్వర్‌ను పోలీస్ వాహనంలోనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం డాక్టర్లు సూచన మేరకు అతన్ని స్విమ్స్‌కు తరలించగా ప్రస్తుతం కోలుకుంటున్నాడని తెలిపారు. హత్య కేసులో నిందితులను పట్టుకోవడానికి శ్రమించిన ఎస్ఐలు, సిబ్బందిని సీఐ అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
మదనపల్లి: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతిచెందిన సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానిక ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఆకాశ్(20) బైక్ పై కళాశాలకు వస్తుండగా.. ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆకాశ్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు వైఎస్సార్ కడప జిల్లా రాయచోటికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. -
మదనపల్లెలో చైన్‌స్నాచింగ్
మదనపల్లె : చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. మంగళవారం ఉదయం రోడ్డుపై వెళ్తున్న మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లారు. వివరాలు... ఎస్బీఐ కాలనీకి చెందిన కవిత(25) ఉదయం దుకాణం తెరిచేందుకు ఇంటి నుంచి వెళుతుండగా పల్సర్ బైక్‌లో వచ్చిన ఇద్దరు యువకులు ఆమెను అడ్డగించి మెడలోఉన్న 30 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేనూ నీ వెంటే...
వివాహమైనప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా మెలిగారు. ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేశారు. ముదిమి వయసులో ఒకరికొకరు తోడునీడగా బతికారు. అనారోగ్యంతో భర్త మృతి చెందడాన్ని ఆమె తట్టుకోలేక పోరుుంది. ఎక్కిళ్లు పెట్టేలా విలపించడంతో గుండాగి కన్నుమూసింది. కుటుంబ సభ్యులను దు:ఖ సాగరంలో ముంచిన ఈ సంఘటన మదనపల్లె పట్టణం అప్పారావుతోటలో మంగళవారం చోటు చేసుకుంది. మదనపల్లెక్రైం,న్యూస్‌లైన్: పట్టణంలోని అప్పారావుతోటకు చెందిన రంగన్న(80) మంగళవారం అనారోగ్యంతో మృతి చెం దాడు. ఈయనకు భార్య నాగరత్నమ్మ(68), కుమారుడు హరిప్రసాద్, కుమార్తె పద్మావతి ఉన్నారు. ఇంటిలోనే హోటల్ నడుపుతూ పిల్లలకు పెళ్లిళ్లు చేశారు. కొంతకాలంగా ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు. రంగన్న బీపీ, షుగర్, కీళ్లనొప్పులు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాడు. నాగరత్నమ్మ పిల్లల్ని ఆశించకుండా భర్తను కాపాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. పలు వైద్యశాలల్లో చికిత్సలు చేయించినా ఆరోగ్యం మెరుగుపడలేదు. మంగళవారం ఉదయం రంగన్న మృతి చెందాడు. భర్త మృతిని జీర్ణించుకోలేక ‘అయ్యా వెళ్లిపోయావా..’ అంటూ నాగరత్నమ్మ బోరున విలపించింది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. మరో అరగంటకే నాగరత్నమ్మ కుప్పకూలి పడిపోరుుంది. ఎంతసేపు పిలిచినా పలకకపోవడంతో కుటుంబ సభ్యులు వైద్యుడిని పిలిపించారు. గుండె ఆగి చనిపోయిందని వైద్యుడు నిర్ధారించారు. కుటుంబ పెద్దలిద్దరూ ఒకేసారి కన్నుమూయడంతో ఇంట్లో పెను విషదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం దంపతులిద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. -
కొనలేం..తినలేం..
ఉల్లిలేని కూర, టమాట లేని చారును ప్రజలు ఊహించడం కష్టమే. అందుకే వాటి వినియోగం భారీ స్థాయిలో ఉంటుంది. అదే స్థాయిలో వాటి ధరలు కొండెక్కుతున్నాయి. ఇటీవల వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో వీటి ధరలు తారాజువ్వల్లా దూసుకుపోతున్నాయి. వీటిని తినాలనే కోరిక ఉన్నా ధర చూసి జనం జడుసుకుంటున్నారు. నోరు కట్టేసుకుని పచ్చడి మెతుకులతో సరిపెట్టుకుంటున్నారు. మదనపల్లె, న్యూస్‌లైన్: జిల్లాలో టమాట పంటకు మదనపల్లె పెట్టింది పేరు. ఇక్కడ టమాట పంట అత్యధికంగా పండించి, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు మారిపోయాయి. పంట చివరి దశకు చేరింది. దీనికితోడు వరుస వర్షాలు పంటను సర్వనాశనం చేస్తున్నాయి. చేలల్లో నీళ్లు నిలబడిపోవడంతో టమాట మొక్కలు చనిపోతున్నాయి. కాయలు మచ్చలు ఏర్పడి కుళ్లిపోతున్నాయి. ఫలితంగా దిగుబడి తగ్గిపోయింది. గతంలో స్థానిక మార్కెట్‌కు రోజుకు సగటున 400 టన్నుల వరకు వచ్చేది. ఇప్పుడు 120 టన్నులకు పడిపోయింది. ధరలు రోజురోజుకూ రెట్టింపవుతున్నాయి. వారం రోజులుగా సగటున కిలో రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతోంది. వర్షాలు ఇలాగే కురిస్తే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఘాటెక్కిన ఉల్లి జిల్లాలో ఉల్లి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మేలు రకం ఉల్లి కిలో రూ.70 నుంచి రూ.80 వరకు లభిస్తోంది. నాసిరకం ఉల్లి రూ.60కి దొరుకుతోంది. అధికరేటు వెచ్చిం చినా నాసిరకం ఉల్లి ఘాటు లేకపోవడంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాకు బెంగళూరు నుంచి ఉల్లి దిగుమతి అయ్యేది. పై-లీన్ కారణంగా అక్కడ దిగుబడి తగ్గిపోవడంతో దిగుమతి పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇదిలావుండగా మార్కెట్‌కు వచ్చే అరకొర పంటను వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి, బయట మార్కెట్లో అధిక ధరలకు విక్రయించడం రివాజుగా మారుతోంది. ఆదివారం రైతుల వద్ద నుంచి టమాట పంటను రూ.39కి కొనుగోలు చేశారు. బయట మార్కెట్లో రూ.45 నుంచి రూ.50 వరకు విక్రయించడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది -
విషపుకాయలు తిని నలుగురు చిన్నారులకు అస్వస్థత
మదనపల్లె క్రైం, న్యూస్‌లైన్: పెళ్లింట విషాదం అలముకుంది. అప్పటివరకు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారులు విషపూరితమైన కాయలుతిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన గురువారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. చిన్నారుల తల్లిదండ్రుల కథనం మేరకు వివరాలు... గౌనిగారిపల్లెలో గురువారం ఓ ఇంట్లో వివాహం జరుగుతోంది. అదే సమయంలో ఇరుగుపొరుగుకు చెందిన వెంకటేష్ కుమారుడు బ్రహ్మ(5), ఆనంద్ కుమారుడు మధు(7), నాగరాజు కుమారుడు వినయ్‌కుమార్(5), రెడ్డినారాయణ కుమారుడు భాస్కర్‌బాబు(5) పెళ్లింట ఆడుకుంటున్నారు. ఆ ఇంటివద్ద ఉన్న యర్రాముదం(జెట్రోఫా) చెట్టు కింద కాయలు పడి ఉన్నాయి. ఆ కాయలు నిమ్మకాయల సైజులో ఉండడంతో తినే కాయలని భావించి నలుగురు చిన్నారులు తిన్నారు. కొద్దిసేపటికే ఆ నలుగురు తీవ్ర వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పెళ్లిభోజనం ఏమైనా విషాహారంగా మారిందేమోనని కంగారు పడ్డారు. చిన్నారులను అడగడంతో తాము పెళ్లి భోజనం ఇంకా తినలేదని, ఆ కాయలను తిన్నామని చూపించారు. దీంతో వెంటనే చిన్నారులను 108లో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పిల్లలను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కంగారు పడాల్సిన పనిలేదని, త్వరగానే పిల్లలు కోలుకుంటారని చిన్నపిల్లల డాక్టర్ మధుసూదనాచారి తెలిపారు.