చేవెళ్ల రూరల్, న్యూస్‌లైన్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నా చేవెళ్లనే ఎంచుకునేవారు. వైఎస్‌కు చేవెళ్ల ఓ సెంటిమెంట్. అధికారం దరిచేరక ముందునుంచే ఇక్కడి నాయకులతో, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానిక సమస్యలకు వైఎస్ తిరుగులేని పరిష్కారం చూపారు. అలా ఇక్కడి ప్రజలకు చేరువయ్యారు. అందుకే ఆయన దూరమై నాలుగేళ్లయినా మరవలేకపోతున్నామంటున్నారు చేవెళ్ల ప్రజానీకం. సోమవారం ఆయన నాలుగో వర్ధంతి. ఈ సందర్భంగా చేవెళ్లతో వైఎస్‌కున్న అనుబంధంపై కథనం...
వైఎస్సార్ ప్రతిపక్షనేతగా, ముఖ్యమంత్రిగా ఏ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టాలనుకున్నా చేవెళ్లనుంచే ప్రారంభించారు. 2003లో చేవెళ్ల నుంచి మహాపాదయాత్ర ప్రారంభించిన ఆయనకు అన్నివిధాలా కలిసొచ్చింది. చేవెళ్ల సెంటిమెంట్‌గా మారడానికి కూడా ఈ మహాపాదయాత్రే కారణం. అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మట్టికరిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వైఎస్ విశేష కృషిచేశారు. చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టుకు నవంబర్ 19, 2008లో శంకుస్థాపన కూడా చేశారు. 2009 ఏప్రిల్‌లో జరిగిన సాధారణ శాసనసభ ఎన్నికలకు సైతం చేవెళ్ల నుంచి ప్రచారం ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా విజయఢంకా మోగించి తద్వారా రెండోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మహానేత మరణించి నాలుగేళ్లు అవుతున్నా ఆయన జ్ఞాపకాలు మాత్రం ప్రజల్లోంచి పోలేదు. చేవెళ్లకు రాష్ట్రంలోనే కాదు జాతీయస్థాయిలో గుర్తింపుతెచ్చారు వైఎస్ రాజశేఖరరెడ్డి.
ఇదీ చేవెళ్ల నియోజకవర్గంతో వైఎస్సార్ బంధం..
2001: ఎంపీపీ, జెడ్పీటీసీల ఎన్నికల ప్రచార సభకు ప్రతిపక్షనేతగా చేవెళ్లకు విచ్చేశారు
2003: ఏప్రిల్ 9న ప్రజాప్రస్థానం పేరుతో చేవెళ్ల నుంచి పాదయాత్రకు శ్రీకారం
2004: జూన్ 13న చేవెళ్లలో పల్లెబాట ప్రారంభం
2004: నవంబర్ 19న చేవెళ్ల మండలం ఆలూరులో జాతీయ ఉపాధి హామీ పథకం పనుల ప్రారంభానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కలిసి వచ్చారు
2005: శంకర్‌పల్లి మండలం కొత్తపల్లిలో రైతు సదస్సు ప్రారంభం
2006: చేవెళ్లలోని దుద్దాగులో ప్రజాపథం కార్యక్రమాన్ని ప్రారంభించారు
2006: మే 7న షాబాద్ మండలం బోడంపహాడ్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభ కార్యక్రమానికి వచ్చారు
2007: డిసెంబర్7న మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్ వద్ద ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభం
2008: మే నెలలో వికారాబాద్ ఉపఎన్నికల ప్రచారం చేవెళ్ల నుంచి ప్రారంభం
2008: నవంబర్ 19న చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టుకు శంకుస్థాపన
2009: మార్చి 25న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి జైత్రయాత్రను చేవెళ్ల నుంచి ప్రారంబించారు
2009: ఆగస్టు 8న చేవెళ్ల మండలంలోని ఊరెళ్ల వద్దగల ఎస్‌వీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించారు
మహానేతను మరువలేం..
Published Mon, Sep 2 2013 1:21 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement