ముత్తుకూరు, కృష్ణపట్నం గ్రామాల దత్తత
ముత్తుకూరు : ఆసియాలోనే అతిపెద్ద ఓడరేవుగా ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు (కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్‌బిలిటి) సామాజిక బాధ్యత కింద చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ఇటీవల పెద్ద పీట వేసింది. మండలంలో వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ పోర్టు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అంది పుచ్చుకొంటూ 42 బెర్తుల నిర్మాణ లక్ష్యంతో అడుగులు వేస్తోంది. 2007లో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, దివంగత సీఎం డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన నాటి నుంచి అభివృద్ధి-పర్యావరణం-సామాజిక బాధ్యతలే ఊపిరిగా ప్రభావిత గ్రామాలతో పెనవేసుకుపోయింది.
పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషిలో భాగంగా పోర్టుకు ‘భారత పరిశ్రమల సమాఖ్య’ దక్ష ణాది రీజియన్ తాజాగా ‘3 స్టార్’ రేటింగ్‌ను ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణకు కృషిచేసినందుకు 130 పరిశ్రమలతో పోటీపడి ఈ అవార్డు దక్కించుకొంది. 2020 నాటికి కాలుష్య రహిత పోర్టుగా తీర్చిదిద్దేందుకు లక్ష్యాలను రూపొందించుకొంది.
ముత్తుకూరు, కృష్ణపట్నం గ్రామాలను దత్తత తీసుకొని రూ.లక్షలు వెచ్చించి సిమెంటు రోడ్ల నిర్మించారు. సీవీఆర్ ట్రస్టు తరపున మత్స్యకార గ్రామాల్లో ఆర్వో ప్లాంటు ఏర్పాటు ద్వారా ఉచితంగా మినరల్ వాటర్ అందిస్తున్నారు. పోర్టు పరిసరాల్లో ఖాళీ ఉన్న చోటే కాకుండా, రోడ్లకు ఇరువైపులా మొక్కలు పెంపకం చేపట్టారు. పునరావాస కాలనీలోని మత్స్యకార కుటుంబాల పిల్లలను విద్యావంతుల్ని చేసేందుకు అన్ని సౌకర్యాలతో ఇంగ్లీషు మీడియం స్కూల్ ఏర్పాటుచేశారు.
భక్తి భావం నింపేందుకు ఆలయాలు నిర్మించారు. ఉచిత వైద్య శాల ఏర్పాటు ద్వారా వైద్య నిపుణులతో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, ఉచితంగా మందులు అందచేస్తున్నారు. అంబులెన్సులు సైతం అందుబాటులో ఉంచారు. అగ్నిప్రమాదాలు సంభవిస్తే తక్షణం మంటలు అదుపు చేసేందుకు ఫైరింజన్లు సమకూర్చారు.
వృథా నీటి వనరులతో గ్రీన్ బెల్టు అభివృద్ధి చేసే ప్రక్రియకు నడుంకట్టారు. మడ అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకొన్నారు. ప్రమాదాలు అదుపు చేయడంలో భాగంగా రవాణా వ్యవస్థలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఆధునిక సాంకేతిక యంత్రాల ద్వారా దుమ్ము వ్యాపించకుండా రోడ్లను శుభ్ర పరిచే కార్యక్రమం కొనసాగిస్తున్నారు.
సామాజిక బాధ్యతలో కృష్ణపట్నం పోర్టు
Published Fri, Apr 3 2015 3:07 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement