late y s rajasekhar reddy
-
సామాజిక బాధ్యతలో కృష్ణపట్నం పోర్టు
ముత్తుకూరు, కృష్ణపట్నం గ్రామాల దత్తత ముత్తుకూరు : ఆసియాలోనే అతిపెద్ద ఓడరేవుగా ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు (కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్బిలిటి) సామాజిక బాధ్యత కింద చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ఇటీవల పెద్ద పీట వేసింది. మండలంలో వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ పోర్టు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అంది పుచ్చుకొంటూ 42 బెర్తుల నిర్మాణ లక్ష్యంతో అడుగులు వేస్తోంది. 2007లో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, దివంగత సీఎం డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన నాటి నుంచి అభివృద్ధి-పర్యావరణం-సామాజిక బాధ్యతలే ఊపిరిగా ప్రభావిత గ్రామాలతో పెనవేసుకుపోయింది. పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషిలో భాగంగా పోర్టుకు ‘భారత పరిశ్రమల సమాఖ్య’ దక్ష ణాది రీజియన్ తాజాగా ‘3 స్టార్’ రేటింగ్‌ను ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణకు కృషిచేసినందుకు 130 పరిశ్రమలతో పోటీపడి ఈ అవార్డు దక్కించుకొంది. 2020 నాటికి కాలుష్య రహిత పోర్టుగా తీర్చిదిద్దేందుకు లక్ష్యాలను రూపొందించుకొంది. ముత్తుకూరు, కృష్ణపట్నం గ్రామాలను దత్తత తీసుకొని రూ.లక్షలు వెచ్చించి సిమెంటు రోడ్ల నిర్మించారు. సీవీఆర్ ట్రస్టు తరపున మత్స్యకార గ్రామాల్లో ఆర్వో ప్లాంటు ఏర్పాటు ద్వారా ఉచితంగా మినరల్ వాటర్ అందిస్తున్నారు. పోర్టు పరిసరాల్లో ఖాళీ ఉన్న చోటే కాకుండా, రోడ్లకు ఇరువైపులా మొక్కలు పెంపకం చేపట్టారు. పునరావాస కాలనీలోని మత్స్యకార కుటుంబాల పిల్లలను విద్యావంతుల్ని చేసేందుకు అన్ని సౌకర్యాలతో ఇంగ్లీషు మీడియం స్కూల్ ఏర్పాటుచేశారు. భక్తి భావం నింపేందుకు ఆలయాలు నిర్మించారు. ఉచిత వైద్య శాల ఏర్పాటు ద్వారా వైద్య నిపుణులతో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, ఉచితంగా మందులు అందచేస్తున్నారు. అంబులెన్సులు సైతం అందుబాటులో ఉంచారు. అగ్నిప్రమాదాలు సంభవిస్తే తక్షణం మంటలు అదుపు చేసేందుకు ఫైరింజన్లు సమకూర్చారు. వృథా నీటి వనరులతో గ్రీన్ బెల్టు అభివృద్ధి చేసే ప్రక్రియకు నడుంకట్టారు. మడ అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకొన్నారు. ప్రమాదాలు అదుపు చేయడంలో భాగంగా రవాణా వ్యవస్థలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఆధునిక సాంకేతిక యంత్రాల ద్వారా దుమ్ము వ్యాపించకుండా రోడ్లను శుభ్ర పరిచే కార్యక్రమం కొనసాగిస్తున్నారు. -
మహానేతను మరువలేం..
చేవెళ్ల రూరల్, న్యూస్‌లైన్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నా చేవెళ్లనే ఎంచుకునేవారు. వైఎస్‌కు చేవెళ్ల ఓ సెంటిమెంట్. అధికారం దరిచేరక ముందునుంచే ఇక్కడి నాయకులతో, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానిక సమస్యలకు వైఎస్ తిరుగులేని పరిష్కారం చూపారు. అలా ఇక్కడి ప్రజలకు చేరువయ్యారు. అందుకే ఆయన దూరమై నాలుగేళ్లయినా మరవలేకపోతున్నామంటున్నారు చేవెళ్ల ప్రజానీకం. సోమవారం ఆయన నాలుగో వర్ధంతి. ఈ సందర్భంగా చేవెళ్లతో వైఎస్‌కున్న అనుబంధంపై కథనం... వైఎస్సార్ ప్రతిపక్షనేతగా, ముఖ్యమంత్రిగా ఏ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టాలనుకున్నా చేవెళ్లనుంచే ప్రారంభించారు. 2003లో చేవెళ్ల నుంచి మహాపాదయాత్ర ప్రారంభించిన ఆయనకు అన్నివిధాలా కలిసొచ్చింది. చేవెళ్ల సెంటిమెంట్‌గా మారడానికి కూడా ఈ మహాపాదయాత్రే కారణం. అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మట్టికరిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వైఎస్ విశేష కృషిచేశారు. చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టుకు నవంబర్ 19, 2008లో శంకుస్థాపన కూడా చేశారు. 2009 ఏప్రిల్‌లో జరిగిన సాధారణ శాసనసభ ఎన్నికలకు సైతం చేవెళ్ల నుంచి ప్రచారం ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా విజయఢంకా మోగించి తద్వారా రెండోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మహానేత మరణించి నాలుగేళ్లు అవుతున్నా ఆయన జ్ఞాపకాలు మాత్రం ప్రజల్లోంచి పోలేదు. చేవెళ్లకు రాష్ట్రంలోనే కాదు జాతీయస్థాయిలో గుర్తింపుతెచ్చారు వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇదీ చేవెళ్ల నియోజకవర్గంతో వైఎస్సార్ బంధం.. 2001: ఎంపీపీ, జెడ్పీటీసీల ఎన్నికల ప్రచార సభకు ప్రతిపక్షనేతగా చేవెళ్లకు విచ్చేశారు 2003: ఏప్రిల్ 9న ప్రజాప్రస్థానం పేరుతో చేవెళ్ల నుంచి పాదయాత్రకు శ్రీకారం 2004: జూన్ 13న చేవెళ్లలో పల్లెబాట ప్రారంభం 2004: నవంబర్ 19న చేవెళ్ల మండలం ఆలూరులో జాతీయ ఉపాధి హామీ పథకం పనుల ప్రారంభానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కలిసి వచ్చారు 2005: శంకర్పల్లి మండలం కొత్తపల్లిలో రైతు సదస్సు ప్రారంభం 2006: చేవెళ్లలోని దుద్దాగులో ప్రజాపథం కార్యక్రమాన్ని ప్రారంభించారు 2006: మే 7న షాబాద్ మండలం బోడంపహాడ్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభ కార్యక్రమానికి వచ్చారు 2007: డిసెంబర్7న మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్ వద్ద ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభం 2008: మే నెలలో వికారాబాద్ ఉపఎన్నికల ప్రచారం చేవెళ్ల నుంచి ప్రారంభం 2008: నవంబర్ 19న చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టుకు శంకుస్థాపన 2009: మార్చి 25న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి జైత్రయాత్రను చేవెళ్ల నుంచి ప్రారంబించారు 2009: ఆగస్టు 8న చేవెళ్ల మండలంలోని ఊరెళ్ల వద్దగల ఎస్‌వీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించారు -
ఎత్తిపోతలకు గ్రహణం
మేదరమెట్ల, న్యూస్‌లైన్: వర్షాధారంగా పంటలు పండించుకుంటున్న కొరిశపాడు మండల రైతుల బాధలను గట్టెక్కించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టిన యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. 177 కోట్లతో చేపట్టిన ఈ పథ క నిర్మాణం 2008లో ప్రారంభించినా ఇప్పటికీ పూర్తికాలేదు. పథకం పూర్తయితే మండలంలోని కొరిశపాడు, దైవాలరావూరు, రావినూతల, బొడ్డువానిపాలెం, రాచపూడి, పమిడిపాడు, ప్రాసంగులపాడుతో పాటుగా నాగులుప్పలపాడు మండలం పోతవరం, బీ నిడమానూరు, కే తక్కెళ్లపాడు, కళ్లగుంట గ్రామాల పరిధిలోని 20 వేల ఎకరాల భూములకు సూక్ష్మ సేద్యం ద్వారా సాగు నీరందించేందుకు వీలు కలుగుతుంది. పథకం నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటి వరకు * 77 కోట్లు ఖర్చు చేసింది. 55 శాతం మేర పనులు జరిగాయి. 2010 నాటికే పథక నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా.. అప్పట్లో సంభవించిన లైలా, జల్ తుఫాన్ల వల్ల పనులకు కొంతమేర ఆటంకాలు కలిగాయి. విపత్తుల దృష్ట్యా 2011 డిసెంబర్ 31వ తేదీ వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది. అప్పటికీ పనులు పూర్తికాకపోవడంతో మళ్లీ 2013 డిసెంబర్ వరకు గడువిచ్చింది. భూసేకరణే పెద్ద అడ్డంకి.. చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తిచేసేందుకు భూ సేకరణే ప్రధాన అడ్డంకిగా మారింది. పథకానికి సంబంధించిన నీటిని నిల్వ చేసేందుకు రెండు రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉండగా కొరిశపాడులో మాత్రమే రిజర్వాయర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరొక రిజర్వాయరు పనులు నేటికీ ప్రారంభం కాలేదు. కొరిశపాడు రిజర్వాయర్ నుంచి బొల్లవరప్పాడులో నిర్మించాల్సిన రెండో రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేసేందుకు సుమారు 8.5 కిలోమీటర్ల మేర కాలువలు తవ్వేందుకు భూ సేకరణ చేయాల్సి ఉంది. అలాగే బొల్లవరప్పాడు రిజర్వాయర్ నిర్మాణం కోసం సుమారు 350 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రభుత్వం ఇస్తామన్న నష్టపరిహారానికి రైతులు అంగీకరించకపోవడంతో భూసేకరణలో జాప్యం జరుగుతోంది. తమ్మవరం వద్ద పంప్ హౌస్ నిర్మాణం మాత్రమే పూర్తయింది. కానీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పథకం నిర్మాణం సకాలంలో పూర్తిచేసేలా చూడాలని రైతులు కోరుతున్నారు. భూ సేకరణ చేస్తే..పనుల్లో పురోగతి పీ చంగారావు, ఇరిగేషన్ ఏఈఈ భూసేకరణలో జాప్యం వల్లే పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం ఇస్తామన్న నష్టపరిహారానికి, రైతులు కోరుతున్న దానికి వ్యత్యాసం ఉండటంతో భూసేకరణ జరగలేదు. రైతులతో చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది.