మేదరమెట్ల, న్యూస్‌లైన్: వర్షాధారంగా పంటలు పండించుకుంటున్న కొరిశపాడు మండల రైతుల బాధలను గట్టెక్కించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టిన యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి.
177 కోట్లతో చేపట్టిన ఈ పథ క నిర్మాణం 2008లో ప్రారంభించినా ఇప్పటికీ పూర్తికాలేదు. పథకం పూర్తయితే మండలంలోని కొరిశపాడు, దైవాలరావూరు, రావినూతల, బొడ్డువానిపాలెం, రాచపూడి, పమిడిపాడు, ప్రాసంగులపాడుతో పాటుగా నాగులుప్పలపాడు మండలం పోతవరం, బీ నిడమానూరు, కే తక్కెళ్లపాడు, కళ్లగుంట గ్రామాల పరిధిలోని 20 వేల ఎకరాల భూములకు సూక్ష్మ సేద్యం ద్వారా సాగు నీరందించేందుకు వీలు కలుగుతుంది. పథకం నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటి వరకు * 77 కోట్లు ఖర్చు చేసింది. 55 శాతం మేర పనులు జరిగాయి. 2010 నాటికే పథక నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా.. అప్పట్లో సంభవించిన లైలా, జల్ తుఫాన్ల వల్ల పనులకు కొంతమేర ఆటంకాలు కలిగాయి. విపత్తుల దృష్ట్యా 2011 డిసెంబర్ 31వ తేదీ వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది. అప్పటికీ పనులు పూర్తికాకపోవడంతో మళ్లీ 2013 డిసెంబర్ వరకు గడువిచ్చింది.
భూసేకరణే పెద్ద అడ్డంకి..
చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తిచేసేందుకు భూ సేకరణే ప్రధాన అడ్డంకిగా మారింది. పథకానికి సంబంధించిన నీటిని నిల్వ చేసేందుకు రెండు రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉండగా కొరిశపాడులో మాత్రమే రిజర్వాయర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరొక రిజర్వాయరు పనులు నేటికీ ప్రారంభం కాలేదు. కొరిశపాడు రిజర్వాయర్ నుంచి బొల్లవరప్పాడులో నిర్మించాల్సిన రెండో రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేసేందుకు సుమారు 8.5 కిలోమీటర్ల మేర కాలువలు తవ్వేందుకు భూ సేకరణ చేయాల్సి ఉంది. అలాగే బొల్లవరప్పాడు రిజర్వాయర్ నిర్మాణం కోసం సుమారు 350 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రభుత్వం ఇస్తామన్న నష్టపరిహారానికి రైతులు అంగీకరించకపోవడంతో భూసేకరణలో జాప్యం జరుగుతోంది. తమ్మవరం వద్ద పంప్ హౌస్ నిర్మాణం మాత్రమే పూర్తయింది. కానీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పథకం నిర్మాణం సకాలంలో పూర్తిచేసేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
భూ సేకరణ చేస్తే..పనుల్లో పురోగతి పీ చంగారావు, ఇరిగేషన్ ఏఈఈ
భూసేకరణలో జాప్యం వల్లే పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం ఇస్తామన్న నష్టపరిహారానికి, రైతులు కోరుతున్న దానికి వ్యత్యాసం ఉండటంతో భూసేకరణ జరగలేదు. రైతులతో చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది.
ఎత్తిపోతలకు గ్రహణం
Published Mon, Aug 26 2013 6:04 AM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM
Advertisement
Advertisement