నిర్మల్: రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 24 గంటలపాటు ఉచిత కరెంటును కానుకగా అందిస్తోంది. ఇక సాగునీటికీ ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జిల్లాలోని ఆరు ఎత్తిపోతల పథకాలకు పునరుజ్జీవం పోసేందుకు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం రూ.కోటి 74లక్షల 40వేలు మంజూరు చేస్తూ జీవో జారీచేసింది. వివిధ రకాల మరమ్మతులతో మూలన పడిన బన్సపల్లి(దిలావర్‌పూర్), తిర్పెల్లి(లక్ష్మణచాంద), కొత్తూర్(మామడ), ముజ్గి సాంగ్వి(దిలావర్‌పూర్), సిద్ధులకుంట(సోన్), సుద్దవాగు(కుంటాల) ఎత్తిపోతల పథకాలకు ఈ నిధులు మంజూరు చేసింది. ఈ పథకాల పునరుద్ధరణ పూర్తయితే మొత్తం 4,885 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. తాము పంపిన ప్రతిపాదనల మేరకు నిధులు మంజూరైనందున త్వరలో మరమ్మతులు చేపట్టి ఖరీఫ్ నాటికి పూర్తిస్థాయిలో నీరందేలా చూస్తామని నీటిపారుదల అభివృద్ధి సంస్థ జిల్లా అధికారులు చెబుతున్నారు.
ఒక్కో పథకానికి ఎంత...
జిల్లాలోని మొత్తం 21 పథకాలు కొనసాగుతుండగా ఇందులో మరమ్మతులు, పునరుద్ధరణ కోసం ఇటీవల ఆరు పథకాలకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపించారు. దీనిపై జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. టీఎస్‌ఐడీసీ చై ర్మన్, ఎండీలతో చర్చించి త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా కృషిచేశారు. ఇందులో భాగంగా దిలావర్‌పూర్ మండలంలోని బన్సపల్లి పథకానికి రూ.3లక్షల50వేలు, ఇదే మండలంలోని సాంగ్వి(ముజ్గి) పథకా నికి రూ.30లక్షలు, లక్ష్మణచాంద మండలంలోని తిర్పెల్లి పథకానికి రూ.19లక్షలు, మామడ మండలంలోని కొత్తూరు ఎతిపోతలకు రూ.39లక్షల 40వేలు, సోన్ మండలంలోని సిద్ధులకుంట ఎత్తిపోతల పథకానికి రూ.14లక్షలు, కుంటాల మండలం అ ర్లి చెక్క వద్ద గల సుద్ధవాగు ఎత్తిపోతలకు రూ.68లక్ష ల 50వేలు మంజూరయ్యాయి. మొత్తం ఆరు పథకా లకు గానూ రూ. కోటీ 74లక్షల 40వేలు మంజూరు చేశారు.
పునరుద్ధరణ, పునరుజ్జీవం..
ఎప్పుడో ఏళ్ల క్రితం నిర్మించిన ఎత్తిపోతల పథకాలు సరైన నిర్వహణ లేకపోవడంతో ఉత్తగా మిగిలిపోయాయి. ఆయకట్టు ఉన్నా.. నీళ్లు అందుబాటులో ఉన్నా ఎత్తిపోసే పథకం మూలన పడటంతో రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. చాలాసార్లు పాలకుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లారు. ఈ క్రమంలో స్పందించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆయా పథకాలను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఇందులో ఒక బన్సపల్లి పథకానికి మాత్రమే పునరుద్ధరణ చేయాల్సి ఉండగా.. మిగిలి ఐదు పథకాలకూ పునరుజ్జీవం పోయాల్సిందే. ఈ దిశగా త్వరలోనే మరమ్మతులను చేపడతామని అధికారులు వెల్లడించారు.
ఖరీఫ్‌నాటికి అందుబాటులోకి..
జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టులతో పాటు పక్కనే ఉన్న శ్రీరాంసాగర్ నుంచి సరస్వతీ కాలువ సాగుకు అండగా నిలుస్తున్నాయి. ప్రధానంగా జిల్లా సరిహద్దుగా సాగుతోన్న గోదావరి నదిపై శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్‌లోనే ఎత్తిపోతల పథకాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో చాలా పథకాలకు నీరందుతున్నా మరమ్మతులకు నోచుకోక ఎత్తిపోయడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం వీటిపై దృష్టిపెట్టి నిధులు మంజూరు చేస్తుండటంతో పథకాలకు పునరుజ్జీవం పోసినట్లేనని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో త్వరలోనే టెండర్లు చేపట్టి పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ పనులు పూర్తయితే ఖరీఫ్ నాటికి సాగుకు నీళ్లందే అవకాశాలు ఉన్నాయి.
మరో రెండింటికి ప్రతిపాదనలు
జిల్లా నీటిపారుదల అభివృద్ధి సంస్థ పరిధిలో మరో రెండు కొత్త ఎత్తిపోతల పథకాలకు అధికారులు ప్రతిపాదనలను పంపించారు. ఇందులో ఒకటి లోకేశ్వరం మండలం పిప్రి కాగా, మరొకటి జిల్లాకు సరిహద్దుగా ఉన్న జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలంలో గోదావరిని ఆనుకుని ఉన్న బోర్నపల్లి–2 పథ కం. మొత్తం 4200 ఎకరాల ఆయకట్టుతో పిప్రి పథకానికి రూ.58 కోట్లతో ప్రతిపాదనలను పంపించారు. బోర్నపల్లి–2 పథకం పక్కజిల్లాలో ఉన్నప్పటికీ గోదా వరిని ఆనుకుని జిల్లావాసుల భూములు ఉండటంతో నిర్మల్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఈ పథకం పనులు చేపట్టనుంది. బోర్నపల్లి–2 పథకానికి 113ఎకరాల ఆయకట్టును పేర్కొంటూ రూ.60లక్షలతో ప్రతిపాదనలు పంపించారు.
ఆరు ఎత్తిపోతలకు నిధులు
జిల్లాలోని ఆరు ఎత్తిపోతల పథకాలకు పంపించిన ప్రతిపాదనల మేరకు గురువారం రూ.కోటి 74లక్షల 40వేలు మంజూరయ్యాయి. ఇందులో బన్సపల్లి పథకం పునరుద్ధరణ చేయడంతో పాటు మిగిలిన ఐదు పథకాలకు పూర్తిస్థాయి మరమ్మతులు చేయాల్సి ఉంది. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చొరవ తీసుకోవడం వల్ల త్వరితగతిన నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు పనులు చేపట్టి వచ్చే ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీరందించేలా చర్యలు తీసుకుంటాం. – వి.హంజనాయక్, జిల్లా నీటిపారుదల అభివృద్ధి సంస్థ అధికారి
లబ్ధి పొందే ‘ఎత్తిపోత’లివే..
1. బన్సపల్లి(దిలావర్‌పూర్)
2. తిర్పెల్లి(లక్ష్మణచాంద)
3. కొత్తూర్(మామడ)
4. ముజ్గి సాంగ్వి(దిలావర్‌పూర్)
5. సిద్ధులకుంట(సోన్)
6. సుద్దవాగు(కుంటాల)
Comments
Please login to add a commentAdd a comment