ఆలంపల్లి, న్యూస్‌లైన్: పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాను కల్పించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.విఠల్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ వసతి గృహంలో విలేకరులతో మాట్లాడారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు.
తెలంగాణ ఉద్యమం చేస్తున్న సమయంలో సీమాంధ్రులు అవహేళన చేశారని, దేశ ద్రోహులంటూ కేసులు పెట్టారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్ల పంపకాల్లో తేడాలు వస్తాయని, తెలంగాణ ప్రజలే నష్టపోతారని సీమాంధ్ర నాయకులు అర్థంలేని ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. సోనియాగాంధీ భిక్షతో సీఎం అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి అధిష్టానానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుని తప్పు చేశారన్నారు. తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించిన తర్వాతే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారన్నారు.
ఉప ముఖ్యమంత్రికి కూడా సంప్రదించకుండా సీఎం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆంధ్రాపాలకుల వల్లే వెయ్యేళ్ల తెలంగాణ చరిత్ర కనుమరుగైందన్నారు. తెలంగాణ చరిత్రపై ప్రత్యేక పుస్తకాన్ని తయారుచేసి భవిష్యత్ తరాలకు అందిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతోపాటు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు తీర్మానం చేస్తామన్నారు. వికారాబాద్ మరో హైటెక్ సిటీగా ఆవిర్భవిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సత్తయ్య, జిల్లా జేఏసీ నాయకులు తుల్జారాం, జిల్లా జేఏసీ సలహాదారు రమేష్‌కుమార్, జేఏసీ నాయకులు శ్రీనివాస్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
ఎత్తిపోతలకు జాతీయ హోదా కల్పించాలి
Published Sat, Feb 1 2014 5:33 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement