సాక్షి, నెట్‌వర్క్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, ఆయనకు వత్తాసు పలికే నేతలపై మొదలైన తెలంగాణ లడాయి జిల్లాలో ఇంకా కొనసాగుతోంది. రాష్ట్ర విభజనపై సీఎం చేసిన వ్యాఖ్యలపై రగిలిన తెలంగాణవాదులు ఆయన దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మల దహనకాండ ఆదివారం కూడ జిల్లాలో కొనసాగింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, ముథోల్, బెల్లంపల్లి తదితర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆదిలాబాద్‌లో టీయూటీఎఫ్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. పలుచోట్ల సీఎం దిష్టిబొమ్మలను దహనం చేసిన తెలంగాణవాదులు, అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వాఖ్యలకు నిరసనగా అదివారం టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షులు సోహెల్‌ఖాన్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు సాధనబోయిన కష్ణలు చెన్నూర్ పోలీసు స్టేషన్‌లో సీఎం పై ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సీఐ భద్రయ్యను సంప్రదించగా టీఆర్‌ఎస్వీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లాలో...
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేస్తున్న అసత్య ప్రకటనలపై అధికారపార్టీ నాయకులు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలపై విషం చిమ్ముతూ రెచ్చగొట్టే ప్రకటనలు చేసినందుకు నిరసనగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మేయర్ డి.శంకర్ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న కశ్మీర్‌గడ్డ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్‌లోని ఉమెన్స్ డిగ్రీ కళాశాల నుంచి తెలంగాణ చౌక్ వరకు సీఎం దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సరిళ్ల నిఖిల్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
మెదక్ జిల్లాలో సీఎంపై దళితసేన ఫిర్యాదు
తెలంగాణ ప్రాంత ప్రజలను అవమానించిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దళితసేన నేతలు ఆదివారం మెదక్ జిల్లా కొండపాక మండలం కుకునూర్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దళితసేన జిల్లా అధ్యక్షుడు దేవి రవీందర్, జిల్లా కార్యదర్శి దబ్బెట కృష్ణ, నాయకులు కనకరాజు, స్వామి, గోనె శ్రీనివాస్, రాజు, నరేశ్ తదితరులు ఎస్‌ఐ యాదిరెడ్డికి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. రాజ్యాంగ బద్ధంగా రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తానని ప్రమాణం చేసిన కిరణ్ ఇప్పుడు మాటమార్చి ఒక ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు ఆ ఫిర్యాదులో ఆరోపించారు.
సీఎం కిరణ్‌పై నిరసనల వెల్లువ
Published Mon, Aug 12 2013 4:48 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement