సాక్షి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై తెలంగాణవాదులు భగ్గుమన్నారు. సోమవారం కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్, జిల్లా అధ్యక్షుడు వేణు ఆధ్వర్యంలో నారా, నల్లారిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. సీమాంధ్ర నేతలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రాన్ని సాధించుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వరంగల్ జిల్లా కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు.
రాష్ట్రాన్ని విభజిస్తే సమస్యలు వస్తాయంటూ ముఖ్యమంత్రి విషప్రచారం చేస్తున్నారని, దానిని తిప్పికొట్టాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు సహోదర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబరీషరావు, ఉపాధ్యక్షుడు గునిగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో సీఎం, సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మను పాడెకు కట్టి శవయాత్ర నిర్వహించారు. అనంతరం ములుగురోడ్ జంక్షన్‌లో దహనం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని తెలంగాణచౌక్‌లో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సీమాంధ్ర నాయకుల ఫ్లెక్సీలను దహనం చేశారు. సీమాంధ్ర నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జన్నారం మండల కేంద్రంలో టీజీవీపీ, ఏబీవీపీ అధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి తెలంగాణ విగ్రహం సమీపంలో దహనం చేశారు.
సీఎం కన్పించడం లేదంటూ ఫిర్యాదు
సీడబ్ల్యూసీ తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేసిన నాటినుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మతిస్థిమితం తప్పి కన్పించకుండా పోయాడని అతని ఆచూకీ చెప్పాలంటూ టీఆర్‌ఎస్ నాయకులు నిజామాబాద్ ఒకటో పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి యెండల సుజీత్ మాట్లాడుతూ గత నెల 30న ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన నాటినుంచి ముఖ్యమంత్రికి మతిస్థిమితం కోల్పోయాడన్నారు. తెలంగాణ ఏర్పాటుకు, ఇక్కడి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని విమర్శించారు.
కుట్రలపై కన్నెర్ర.. చంద్రబాబు, కిరణ్ దిష్టిబొమ్మల దహనం
Published Tue, Aug 13 2013 4:12 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement