
భూములు కొనుగోలుపై సీబీఐ విచారణకు సిద్ధమా: అంబటి
హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజధాని పరిసర ప్రాంతాల్లో ఎవరెవరు ఎన్ని భూములు కొన్నారో సీబీఐ విచారణకు సిద్ధమా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. ఆయన శనివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాబు తాబేదార్లు కొన్న భూములపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ డిమాండ్ చేశారు.
రాజధాని నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అంబటి స్పష్టం చేశారు. అయితే రాజధాని నిర్మాణానికి భూములివ్వడానికి రైతులు సుముఖంగా లేరన్నారు. భూముల సమీకరణపై రైతాంగం తీవ్ర ఒత్తిడి, భయాందోళనలకు లోనవుతోందన్నారు. రైతులకున్న అనుమానాలు తీర్చటంలో ప్రభుత్వం విఫలమైందని అంబటి అన్నారు.
టీడీపీ, బీజేపీ ప్రజా ప్రతినిధులు వందల ఎకరాలు భూములు కొన్నట్లు అక్కడి ప్రజలు పేర్లతో సహా చెబుతున్నారని....ఇది వాస్తవం కాదా? అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. చంద్రబాబు ఇతరులపై నిందలు వేయటం సరికాదని, వాస్తవ దృక్పధంతో ఆలోచించాలని సూచించారు. రైతుల్లో నమ్మకం కలిగిస్తే వారే స్వచ్ఛందంగా భూములిస్తారని, పంట భూముల్లో కాకుండా నిరూపయోగంగా ఉన్నభూముల్లో రాజధాని నిర్మాణం జరగాలని అంబటి అన్నారు.