యూటీకీ ఒప్పుకోం
హైదరాబాద్, సాక్షి: సీమాంధ్రుల ఒత్తిడికి తలొగ్గి హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తామంటే సహించేది లేదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. యూటీ అంటే యుద్ధం తప్పదన్నారు. మాదిగ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వద్ద నిర్వహించిన ‘తెలంగాణ విద్యార్థి యుద్ధ భేరి’లో ఆయన మాట్లాడారు. చిన్న రాష్ట్రాలతోనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమన్న అంబేద్కర్ మాటలకు కట్టుబడే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా 2001లో ఎమ్మార్పీఎస్ నిర్ణయం తీసుకుందని చెప్పారు.
భవిష్యత్తులో ఉత్తరాంధ్ర, రాయలసీమ రాష్ట్రాల ఏర్పాటు ప్రతిపాదనలు వచ్చినా వాటికి తమ పూర్తి మద్దతుంటుందన్నారు. ‘‘తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్రలోని బడుగు బలహీన వర్గాల వారెవరూ వ్యతిరేకం కాదు. కొందరు పెట్టుబడిదారులే అడ్డు తగులుతున్నారు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను అక్టోబర్ 6న గుంటూరులో సభ ద్వారా అక్కడి ప్రజలకు వివరిస్తాం’’ అని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం ఇప్పటికే జరిగిపోయిందని, వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. సీమాంధ్రుల భద్రతపై తాము పూర్తి భరోసా ఇస్తున్నామని, అవసరమైతే ప్రాణాలు పణంగా పెట్టయినా వారిని కాపాడుకుంటామని చెప్పారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రతిపాదనకు కూడా బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సీమాంధ్ర ఉద్యమానికి సీఎం క్యాంపు కార్యాలయం అడ్డాగా మారిందని ఆరోపించారు. సీఎంగా కొనసాగే అర్హత కిరణ్‌కుమార్‌రెడ్డికి లేదన్నారు. కిరణ్ తెలంగాణ ద్రోహి అని ఎంపీ జి.వివేక్ దుయ్యబట్టారు. అయన్ను తెలంగాణ నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, విమలక్క, సీమాంధ్రకు చెందిన సీనియర్ న్యాయవాది వై.కోటేశ్వరరావు, మహోజ్వల బహుజన సంఘం నాయకుడు పల్నాటి శ్రీరాములు, ఉద్యోగుల సంఘం నేతలు శ్రీనివాస్ గౌడ్, విఠల్, రసమయి బాలకిషన్, వేదకుమార్, అద్దంకి దయాకర్, పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.