
చంద్రబాబు నాయుడు
హైదరాబాద్: హుద్హుద్ తుపాను సమయంలో టీవీ దగ్గర కూర్చొని అందరం మానిటరింగ్ చేశామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆదివారం అయినా అందరం పనిచేశామన్నారు. హుద్హుద్ తుపాను అంశంపై ఈ రోజు శాసనసభలో ఆయన మాట్లాడారు.
సంక్షిప్తంగా చంద్రబాబు ప్రసంగం:
తుపానుపై ముందు జాగ్రత్తగా హెచ్చరికలు చేశాం. బలవంతంగా బాధితులను పునరావాస శిబిరాలకు తరలించాం. ఏర్పాట్లన్నిటినీ నిరంతరం పర్యవేక్షించాం. ముందు రోజే విద్యుత్ని నిలిపివేశారు. ట్రాఫిక్ కూడా నిలిపివేశారు. కేంద్రం కూడా పరిస్థితులను సమీక్ష చేసింది. తుపాను హెచ్చరికల కేంద్రంలో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నట్లు హఠాత్తుగా మాకు సమాచారం వచ్చింది. మచిలీపట్నం రాడార్ నుంచి సమాచారం తెలుసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అరగంటపాటు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కైలాసగిరి వద్ద తుపాను తీరం దాటిందని నేవీ నుంచి సమాచారం వచ్చింది. 160 నుంచి 170 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఊహిస్తే, 220 కిలోమీటర్ల వేగంతో తుపాను వచ్చింది.
ఆ రోజే నేను బయలుదేరాను. విజయవాడ చేరుకున్నాను. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి చేరుకున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ కూడా నాతో మాట్లాడారు. తుపాను తీరం దాటిన రెండవ రోజే ఆయన విశాఖ వచ్చారు. ప్రజలు ఇబ్బందులలో ఉన్నప్పుడు మేం బాధ్యతగా ప్రవర్తించాం. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఉత్తరాఖండ్ వరదలు సంభవించినప్పుడు విమానాలు పెట్టి బాధితులను సురక్షితంగా తీసుకువచ్చాం.