భారతి సిమెంట్స్ తరఫున బాలాజీని అనుమతించలేం: సీబీఐ కోర్టు
Published Tue, Sep 3 2013 3:23 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో దాల్మియా సిమెంట్స్ పెట్టుబడులకు సంబంధించిన కేసులో నిందితుల జాబితాలోనున్న భారతి సిమెంట్స్ (రఘురామ్స్) తరఫున ఆ కంపెనీ ఫైనాన్షియల్ డెరైక్టర్ బాలాజీ కోర్టు విచారణకు హాజరయ్యేందుకు అనుమతించలేమని సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. భారతి సిమెంట్స్ అధినేత హోదాలో వైఎస్ జగన్‌ను సీబీఐ నిందితునిగా చేర్చింది. అయితే ఇతర చార్జిషీట్లలో భారతి సిమెంట్స్ ఫైనాన్షియల్ డెరైక్టర్ బాలాజీ హాజరుకు ఇదే కోర్టు అనుమతించిందని, ఈ నేపథ్యంలో ఈ చార్జిషీట్‌లోనూ కోర్టు విచారణకు బాలాజీ హాజరుకు అనుమతించాలని భారతి సిమెంట్స్ న్యాయవాది విన్నవించారు. ఇందుకు సీబీఐ అభ్యంతరం తెలిపింది. బాలాజీ తమ తరఫున సాక్షిగా ఉన్న నేపథ్యంలో భారతి సిమెంట్స్ ప్రతినిధిగా ఆయన హాజరుకు అనుమతించరాదని కోర్టును కోరింది. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు... భారతి సిమెంట్స్ తరఫున బాలాజీ హాజరుకు అనుమతించలేమని స్పష్టం చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
Advertisement