సమన్యాయం లేదు కాబట్టే సమైక్యం కోరుతున్నాం
సాక్షి, కడప: ‘రాష్ట్ర విభజన విషయంలో రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయమన్నాం. కేంద్రం చేయలేకపోయింది. అందుకే సమైక్యంగా ఉంచాలంటున్నాం. ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉద్యమం చేస్తున్న ఏకైక రాజకీయపార్టీ వైఎస్సార్ కాంగ్రెస్. తక్కిన పార్టీలు పార్టీలో ఒకలా, ప్రజలతో మరోలా డ్రామాలు ఆడుతున్నాయి. వీటిని కట్టిపెట్టి నిష్కల్మషంగా ఉద్యమిస్తే సోనియా దిగివస్తుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి అన్నారు.
పోలీసులు దీక్ష భగ్నం చేయడానికి ముందు ఆదివారం మధ్యాహ్నం కడపలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ రెడ్డిలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇటలీ నుంచి వచ్చిన సోనియా విభజన నిర్ణయాన్ని ప్రకటించడంతో పాటు హైదరాబాద్‌లో పదేళ్లు ఉండండి అని సీమాంధ్రులకు సలహా ఇస్తోందని? అసలు అలా చెప్పడానికి సోనియా ఎవరని మండిపడ్డారు. అన్నిప్రాంతాల సమష్టి కృషితో రాష్ట్రంతో పాటు రాజధాని అభివృద్ధి అయిం దని, ఇప్పుడు వెళ్లిపోవాలంటే రాజధానిలో ఉన్నవాళ్లు అభద్ర తకు లోనవుతున్నారన్నారు. రాష్ట్రం విడగొడితే తమకేమీ అభ్యంతరం లేదని చంద్రబాబు కేంద్రానికి లేఖరాశారని, ఇప్పుడేమో ఆపార్టీ నేతలు పార్లమెంట్‌లో డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. రాజంపేటలో ఆకేపాటి, రైల్వేకోడూరులో కొరముట్ల చేస్తున్న ఆమరణ దీక్ష శిబిరాలను కూడా మైసూరారెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు.