షరతులు లేని ‘తెలంగాణ’ సాధించుకోవాలి | we want without conditions of telangana | Sakshi
Sakshi News home page

షరతులు లేని ‘తెలంగాణ’ సాధించుకోవాలి

Published Sun, Nov 24 2013 12:10 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

we want without conditions of telangana

పరిగి, న్యూస్‌లైన్:   షరతులులేని తెలంగాణ సాధించుకోవాలని లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బిల్యానాయక్ అన్నారు. పరిగి చిల్లింగ్ సెంటర్ గెస్ట్‌హౌస్‌లో శనివారం ఆయా పార్టీలు, ప్రజాసంఘాల నాయకులతో తెలంగాణ డెమొక్రటిక్  ఫ్రంట్ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బిల్యానాయక్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు న్యాయం జరిగేలా తెలంగాణను నిర్మించుకోవటం ఇప్పుడు మన ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. నాడు తెలంగాణ సాధనలో అడ్డుతగిలిన వారే నేడు వారి పదవులు, ప్రయోజనాల కోసం ముందు వరుసలో ఉంటున్నారని విమర్శించారు.   టీఆర్‌ఎస్ ఏర్పాటు కాకముందే తెలంగాణ సాధనకోసం 2,500 సమావేశాలు జరిగాయన్నారు.

పేదల ఆకాంక్షలను నెరవేర్చే తెలంగాణను నిర్మించుకోవటంకోసం తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ ఉద్యమిస్తుందన్నారు. ఎన్నడూ తెలంగాణ గురించి మాట్లాడని జైపాల్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు సమావేశాలు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ముస్లిం జేఏసీ ఉపాధ్యక్షుడు ఎంఏ బాసిద్ మాట్లాడుతూ.. ఆంగ్లేయులను పారద్రోలి స్వాతంత్య్రం తెచ్చుకుంటే ఆంధ్రావాళ్లు వచ్చి నెత్తిన కూర్చున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశామని అనటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రసిద్ధిగాంచిన చార్మినార్, హైకోర్టు, సాలార్జంగ్ మ్యూజియం, ఉస్మానియా యూనివర్సిటీ, అసెంబ్లీ, సచివాలయం, గవర్నర్ భవన్ మీరే కట్టారా అని ప్రశ్నించారు. వందల ఎకరాల ఈ ప్రాంత భూములు కబ్జా చేయటం తప్ప చేసేందేమీ లేదన్నారు.

కార్యక్రమంలో గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, ప్రొఫెసర్ రవీంద్రాచారి, సమతాసైనిక్‌దళ్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగ్‌రావ్, ఉపాధ్యక్షుడు రత్నయ్య, అడ్వకేట్ ఆనంద్‌గౌడ్, టీఆర్‌ఎస్ మహిళా విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి సునందబుగ్గన్నయాదవ్, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు యాదయ్యయాదవ్, విద్యార్థి జేఏసీ నియోజకవర్గ చైర్మన్ రవికుమార్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీర్‌మహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement