కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్ :అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించేదాకా పోరాటం ఆగదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం నగరంలోని సీఐటీయూ కార్యాలయం నుంచి అంగన్‌వాడీ సెంటర్ల పుస్తకాలను తలపై పెట్టుకొని ద్వారకానగర్‌లోని మంత్రి అహ్మదుల్లా ఇంటి వరకు ర్యాలీగా వచ్చి ముట్టడించారు. మంత్రి అహ్మదుల్లా ఇంటి నుంచి బయటకు రావాలని నినాదాలు చేశారు. దీంతో మంత్రి బయటకు వచ్చి మీ సమస్యలను సంబంధిత మంత్రి సునీతా లక్ష్మారెడ్డితో మాట్లాడతామని చెప్పారు. అయినా సీఐటీయూ అధ్యక్షుడు ఆంజనేయులు, అంగన్‌వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాళ్లు ససేమీరా అంటూ ఇప్పుడు మంత్రితో మాట్లాడి తగు న్యాయం చేయాలని పట్టుబట్టారు.
దీంతో చేసేదేమీలేక మంత్రి అహ్మదుల్లా ఫోన్‌లో మంత్రి సునీతా లక్ష్మారెడ్డితోనూ, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డితోనూ మాట్లాడి వెంటనే వేతనాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రితో కూడా మాట్లాడతానని మంత్రి అహ్మదుల్లా చెప్పడంతో ముట్టడి కార్యక్రమాన్ని విరమించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజకుళాయమ్మ, కార్యదర్శి లక్ష్మిదేవి, అధ్యక్షురాలు బంగారుపాప పాల్గొని మాట్లాడారు.