ఒంగోలు టూటౌన్ : పొగాకు బోర్డు, వ్యాపారులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సాయి గార్డెన్ సమావేశం హాలులో ఆదివారం నిర్వహించిన పొగాకు రైతుల సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సుకు ఏపీ రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపినాథ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ టుబాకో బోర్డు చైర్మన్‌పై మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పలుమార్లు బోర్డు చైర్మన్‌తో మాట్లాడానని..అయినా ధరల్లో ఎలాంటి మార్పులు రాలేదన్నారు.
ఎన్నడూ లేనిది బోర్డు పుణ్యమాని జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిమెంట్ ప్రకారం వ్యాపారులు గానీ, బోర్డు గానీ కొనుగోలు చేయాల్సింది పోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తారా అని టుబాకో బోర్డును ప్రశ్నించారు. ఇటీవల విజయవాడలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో జరిగిన సమావేశంలో నిర్ణయించిన ధరలు కూడా నేటికీ అమలు కాలేదని రైతు నాయకులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు.
దీంతో ఎంపీ ఆగ్రహంతో ఊగిపోయారు. మంత్రి ఒప్పందమే అమలు కాలేదు... తక్కువ ధరలకు కొనుగోలు చేయడమేంటి అంటూ మండిపడ్డారు. నాలుగు నెలలుగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా.. ఒప్పందం ప్రకారం వ్యాపారుల చేత కొనుగోలు చేయించకుండా రైతులను గాలికొదిలేశారన్నారు. ఉద్యమానికి ప్రణాళిక రూపొందించండి..తాను ఏ కార్యక్రమానికైనా సిద్ధమేనని ఎంపీ ప్రకటించారు.
రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం:
రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం సాగిస్తుందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు అన్నారు. రైతుల సదస్సుకు అధికారపార్టీకి చెందిన రైతులు, రైతు నాయకులు రాకపోవడం దురదృష్టకరమన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నిర్లక్ష్యంపై సంఘటితంగా పోరాటానికి సిద్ధమవ్వాలన్నారు. వ్యాపారులందరూ వేలం కేంద్రాల్లో పాల్గొనేలా సీఎం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు సంఘాలతో కమిటీ వేసి, ఆ కమిటీని కేంద్రం వద్దకు తీసుకెళ్లి ఒత్తిడి తేవాలన్నారు. పొగాకు రైతుల ఉద్యమానికి పార్టీలకతీతంగా సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇంకా కార్యక్రమంలో పాల్గోన్న వివిధ సంఘాల రైతు నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా గిట్టుబాటు ధర సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, ప్రతిపక్షంలో మరొక మాట అంటూ తీవ్రంగా దుయ్యబట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ మారెడ్డి సుబ్బారెడ్డి, జిల్లా సెక్రటరీ మండవ సుబ్బారావు, సీపీఐ ఎంఎల్ రాష్ర్ట నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, కిసాన్ మోర్చ సంఘం రాష్ర్ట అధ్యక్షులు రావి వెంకటేశ్వర్లు, ఆచార్య రంగా కిసాన్ సంస్థ జిల్లా కార్యదర్శి చుంచు శేషయ్య, సీపీఐ ఏపీ రైతు సంఘం నాయకులు కె.వి.వి.ప్రసాద్, హనుమారెడ్డి, వేలం కేంద్రాల నాయకులు మాదాల రమణయ్య, గురవారెడ్డి, అఖిలభారత రైతు కూలీసంఘం నాయకులు (వెల్లంపల్లి వేలం కేంద్రం), పలు వేలం కేంద్రాల రైతు సంఘం నాయకులు పాల్గొని ప్రసంగించారు.
సమావేశంలో తీర్మానాలు:
పొగాకు బోర్డుని వెంటనే రంగంలోకి దించి కొనుగోళ్లు వెంటనే జరిపించాలి
లోగ్రేడ్ పొగాకును రూ.75, మిడిల్ గ్రేడ్ పొగాకును రూ.110 చొప్పున కొనుగోలు చేయాలి.
పొగాకు పంట నుంచి స్వచ్ఛందంగా వైదొలిగిన రైతుకు ప్రత్యామ్నాయ సాగు చేసుకోవడానికి, బ్యారన్‌కు నష్టపరిహారం కింద రూ.10 లక్షలు ఇవ్వాలి.
అలాగే టుబాకో బోర్డుకి ఇండెంట్ ఇచ్చిన వ్యాపారులు, వేలంలో పాల్గొనని వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి.
వచ్చే నెల 5వ తేదిన ఢిల్లీ వెళ్లాలని పొగాకు రైతు సదస్సు నిర్ణయించింది.
రైతులను లూటీ చేస్తున్నారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను లూటీ చేస్తున్నాయి. పొగాకు రైతుల వద్ద పెనాల్టీల రూపంలో వసూలు చేసిన సొమ్ముతో కొనుగోలు చేసేందుకు ట్రేడ్‌వింగ్‌ని రంగంలోకి దించాల్సిందిపోయి కేంద్రం చోద్యం చూస్తోంది. పొగాకు పట్ల అవగాహన లేనివాళ్లని బోర్డులో సభ్యులుగా నిర్ణయించి, రైతుల జీవితాలతో పాలకులు చెలగాటమాడుతున్నారు.
-పూనాటి ఆంజనేయులు, సీపీఎం జిల్లా కార్యదర్శి
పొగాకు బోర్డు చైర్మన్ నిరంకుశంగా పోతున్నారు
పొగాకు బోర్డు చైర్మన్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. వ్యాపారుల కోసం పనిచేస్తున్నారా..? రైతుల కోసం పనిచేస్తున్నారా? రైతుల్ని దోషులుగా చిత్రీకరించడం ఏమిటి.
-మారెళ్ల బంగారుబాబు, టుబాకో బోర్డు మాజీ సభ్యుడు
పార్టీలకు అతీతంగా పోరాడదాం
Published Mon, Jul 27 2015 2:24 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement