'80 శాతం విద్యుత్ సరఫరా పునరుద్ధరించాం'
హుదూద్ తుపాను సమయంలో అధికారులు, మంత్రులు అంతా కలిసి పని చేయడం ఓ రికార్డుగా భావిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శుక్రవారం విశాఖపట్నంలో వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన ఏ దేశంలో కూడా ఇలా జరగలేదని అన్నారు. దీనంతటికి సీఎం చంద్రబాబు స్పూర్తితోనే సాధ్యమైందని తెలిపారు. అధికారులు, మంత్రులు అంతాకలసి చాలా తక్కువ సమయంలో తుపాను ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలు ద్వారా మాములు స్థితికి తీసుకువచ్చామని పల్లె వివరించారు.
ఉత్తరాంధ్రలో దాదాపు 80 శాతం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని.... మిగిలిన విద్యుత్ సరఫరా కూడా సాధ్యమైనంత త్వరగా చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అలాగే వ్యవసాయ కనెక్షన్లను కూడా సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరిస్తామని చెప్పారు. తుపాను నష్టం వల్ల ఐటీ కంపెనీలకు రాయితీలు ఇస్తామని పల్లె ప్రకటించారు.