సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ భూముల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం నడుంబిగించింది. ఆక్రమణలతో విలువైన స్థలాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో వాటిని రక్షించుకునేందుకు రెవెన్యూ యంత్రాంగం చేపట్టిన ప్రక్రియ వేగంగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో సర్కారు జాగాల గుర్తింపుపై రెండు నెలలుగా కసరత్తు చేసిన రెవెన్యూ యంత్రాంగం ఎట్టకేలకు భూముల చిట్టాను రూపొందించింది. కోర్టు కేసులు, ఇతర వివాదాల్లో చిక్కుకున్న జాగాల జోలికి వెళ్లకుండా ప్రభుత్వానివేనని స్పష్టంగా తేలిన భూములను ముందుగా కాపాడేందుకు చర్యలకు ఉపక్రమించింది. తాజాగా గుర్తించిన ప్రభుత్వ స్థలాలకు ప్రహరీలు, హద్దురాళ్లు, ముళ్ల కంచె లను వెంటనే నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వ భూముల రక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
212 ప్రాంతాలు.. 1,014 ఎకరాలు
రెవెన్యూ యంత్రాంగం జరిపిన క్షేత్రస్థాయి సర్వేలో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో 84 ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను కనుగొన్నాం. శేరిలింగంపల్లి, ఉప్పల్, బాలానగర్, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, మల్కాజ్‌గిరి, కీసర, కుత్బుల్లాపూర్ మండలాల్లో సుమారు 494 ఎకరాలను గుర్తించాం.
వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.6,728 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే నగరీకరణ శరవేగంగా సాగుతున్న సెమీ అర్బన్ మండలాల్లోని 128 ప్రాంతాల్లో 520 ఎకరాల భూములను గుర్తించాం. ఈ భూములు దాదాపు వంద కోట్ల విలువ చేస్తాయి. వీటిని రక్షించేందుకు పకడ్బందీ విధానాన్ని అవలంబిస్తున్నాం. ముఖ్యంగా ఈ స్థలాల చుట్టూ ఫెన్సింగ్, ప్రహరీలు నిర్మిస్తున్నాం.
భూముల రక్షణకు రూ.10 కోట్లు
విలువైన భూములను కాపాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూముల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడంతో శివార్లలో కోట్లాది రూపాయల విలువచేసే స్థలాలు అక్రమార్కుల గుప్పిట్లోకి వెళ్లాయి. వాటిని స్వాధీనం చేసుకోవడంలో న్యాయపరమైన అవరోధాలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పరిరక్షణ చర్యలకు దిగింది. ఇప్పటివరకు గుర్తించిన జాగాల రక్షణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఇప్పటికే రూ.రెండు కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం మరో రూ.8 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. వీటితో స్థలాలకు ప్రహరీలు, ఫెన్సింగ్‌లు చేస్తున్నాం. హద్దురాళ్లను నాటుతున్నాం. వాటిని సర్కారీ భూములుగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం.
చురుగ్గా పనులు..
భూములకు ప్రహరీలు, ముళ్ల కంచెలు, ఇతర నిర్మాణాల బాధ్యతను రెండు ప్రభుత్వ శాఖలకు అప్పగించాం. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంలో భాగంగా గృహనిర్మాణ, సాంఘిక సంక్షేమశాఖ ఇంజినీరింగ్ విభాగాలకు ఈ పనులు ఇచ్చాం. ఇప్పటివరకు ఈ రెండు శాఖలు సుమారు రూ.3.30 కోట్ల వ్యయంతో 18 స్థలాల చుట్టూ ప్రహరీలు నిర్మించాయి. నిధులు ఇచ్చేందుకు సీసీఎల్‌ఏ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మిగతా చోట్ల కూడా నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించాం.
ఏడో దశలో 1,106 ఎకరాల భూ పంపిణీ
ఏడో దశ భూపంపిణీలో 1,106 ఎకరాలను ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా 666 మంది లబ్ధిదారులను కూడా ఎంపిక చేశాం. ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. నగర పరిసరాల్లో భూ కేటాయింపులపై ఆంక్షలు ఉన్నందున పూర్తిగా పశ్చిమ ప్రాంతంలోనే ఈ పంపిణీ చేపడుతున్నాం. ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేయగానే భూ పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తాం.
సర్కారు భూములను పరిరక్షిస్తాం
Published Thu, Sep 26 2013 11:43 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement