=అటవీ సిబ్బంది కోసం కొనుగోలుకు సిద్ధం
=క్షేత్ర స్థాయి సిబ్బందికి 12 రకం బోర్ తుపాకులు
=రేంజ్ స్థాయి అధికారులకు రివాల్వర్లు
=ఆత్మరక్షణే లక్ష్యం
కొయ్యూరు, న్యూస్‌లైన్: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు అటవీ అధికారులపై ఘాతుకమైన దాడి చేయడంతో కదిలిన అటవీ శాఖ ఇప్పుడు ఆయుధాల సమీకరణ ధ్యేయంగా అడుగులు వేస్తోంది. అడవుల్లో విలువైన కలపను రక్షించడానికి క్షేత్ర స్థాయిలో గస్తీ తిరిగే అటవీ సిబ్బందికి రక్షణ కల్పించడానికి ఆయుధాలు సమకూర్చడమే మార్గమని నిర్ణయానికి వచ్చిన అటవీ శాఖ ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో నర్సీపట్నం అటవీ డివిజన్‌కు సంబంధించి ఏడు రేంజ్‌లలో నాలుగు రేంజ్‌లు సమస్యాత్మకమైనవి. ఈ ప్రాంతంలో కలప చోరులు తక్కువ సంఖ్యలో ఉన్న సిబ్బందిపై దాడులు చేసే అవకాశం ఉంది. అలాగే తూర్పు కనుమల్లో రంగురాళ్లు కూడా విరివిగా ఉన్నాయి. క్వారీల వద్ద నిత్యం వందలాది మంది తవ్వకాలు జరుపుతారు.అలాంటి చోట్లకు ఆయుధాలు లేకుండా వెళ్తే దాడులు జరిగే అవకాశం ఉంది. దీంతో సాధ్యమైనంత వేగమే ఆయుధాలు అందించే ఏర్పాట్లలో ఉన్నతాధికారులు ఉన్నారు.
దట్టమైన అడవులకు పేరుపడ్డ మధ్యప్రదేశ్‌లో కొన్ని చోట్ల అటవీ సిబ్బంది ఆయుధాలతో పని చేస్తున్నారు. అక్కడ సిబ్బంది అమెరికాలో తయారైన ఆయుధాలను వాడుతున్నారు. మన రాష్ట్రంలో కూడా ఇటువంటి విధానం అనుసరించే వీలుందని ఉన్నతాధికారి ఒకరు తెలియజేశారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే వారికి 12 రకం బోర్ తుపాకులు, అధికారులకు రివాల్వర్లు అందజేయాలన్న లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. అయితే ఎవరు ఆయుదాలను కొనుగోలు చేయాలన్న దానిపై కొంత సందిగ్దత ఉందన్నారు. మరో మూడు నుంచి నాలుగు నె లలలోపు అటవీ సిబ్బందికి ఆయుధాలు సరఫరా జరిగే అవకాశం ఉందని ఆ శాఖ అధికారి తెలిపారు.
ఆత్మ రక్షణ ముఖ్యం : అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇస్తున్నది దాడుల కోసం కాదని,ఆపదలో ఉన్నప్పుడు ఆత్మరక్షణ కోసం వాటిని వాడాల్సి ఉంటుందని ఆ శాఖ అధికారులు అంటున్నారు. నర్సీపట్నం డివిజన్ పరిధిలో ఏడు రేంజ్‌లో ఏడు బేస్ క్యాంప్‌లు, ఏడు స్ట్రైకింగ్ ఫోర్స్‌లు ఉన్నాయి. 2010 నుంచి అమలులోకి వచ్చిన కంపా పథకం ద్వారా వాటి నిర్వాహణకు నిధులు వస్తున్నాయి. ఈ డివిజన్‌లో దట్టమైన అడవి ప్రాంతంగా ఉన్న మర్రిపాకలు, సీలేరు రేంజ్‌లలో ఉన్న విలువైన కలపను రక్షించాల్సిన బాధ్యత ఉంది.మరోవైపు రంగురాళ్ల తవ్వకాల నిరోధానికి ప్రతిపాదించిన రెండు పోలీసు బృందాలను కూడా ప్రభుత్వం పంపించే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు అంటున్నారు.
మూడు నెలల్లో ఆయుధాలు
Published Wed, Dec 18 2013 1:44 AM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM
Advertisement
Advertisement