
అటవీ సిబ్బందికి ఆయుధాలు
సాక్షి, హైదరాబాద్: స్మగ్లర్ల దాడులను ఎదుర్కొనేందుకు అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అటవీ సంపద పరిరక్షణ కోసం పాటుపడుతున్న సిబ్బందిపై స్మగ్లర్ల దాడులు పెరిగిపోతున్నాయని, ఈ నేపథ్యంలో అటవీ సిబ్బందికి ఆయుధాలు సమకూర్చాలని, సాయుధ పోలీసు బృందాలను సహాయంగా పంపాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ జంతు ప్రదర్శన శాల స్వర్ణోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మీరాలం చెరువు శుద్ధి, అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, అటవీ దళాల అధిపతి బీఎస్‌ఎస్ రెడ్డి తదితరులు ప్రసంగించారు. జూ పార్క్ ప్రవేశద్వారం వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహాన్ని, జూ స్వర్ణోత్సవ స్తూపాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. స్క్విరెల్ మంకీ, తెల్ల, నల్ల హంసల ప్రదర్శనశాలలను ప్రారంభించారు. పోస్టల్ శాఖ రూపొందించిన జూ స్వర్ణోత్సవ ప్రత్యేక కవర్, జూ సావనీర్‌లను విడుదల చేశారు. జూ సిబ్బందికి ప్రోత్సాహకాలు, 59వ వన్యప్రాణి సప్తాహం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. పులులను దత్తత తీసుకున్న ఎస్‌బీహెచ్ తరఫున బ్యాంకు అధికారి భగవంతరావు రూ.15 లక్షల చెక్కును జూకు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మోజం అలీఖాన్, ఎమ్మెల్సీ రంగారెడ్డి, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శామ్యూల్, వన్యప్రాణి సంరక్షణ విభాగం అధిపతి జోసెఫ్, జంతు ప్రదర్శనశాలల డెరైక్టర్ మల్లికార్జునరావు, పోస్ట్‌మాస్టర్ జనరల్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.