రైతుల గుండెల్లో... వెబ్‌ల్యాండ్‌ దడ! | Web Land Policy Becomming Problem To Farmers | Sakshi
Sakshi News home page

రైతుల గుండెల్లో... వెబ్‌ల్యాండ్‌ దడ!

Published Sat, Jun 22 2019 8:39 AM | Last Updated on Sat, Jun 22 2019 8:39 AM

Web Land Policy Becomming Problem To Farmers  - Sakshi

సాక్షి , శ్రీకాకుళం : జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజనులో 2.13 లక్షల హెక్టార్లలో వరిసాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇందుకు దాదాపు 1.55 లక్షల క్విం టాళ్ల వరి విత్తనాలు అవసరం. వాటిలో సుమారుగా 50 వేల క్వింటాళ్ల వరకూ రైతులు ఏటా సొంతంగా విత్తన తయారీ చేసుకుంటారని వ్యవసాయాధికారులు అంచనా వేస్తూ వస్తున్నారు. అవిగాక ఇంకా 1.05 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం. ఈసారి జిల్లాకు 75,900 క్వింటాళ్ల వరి విత్తనాలను ప్రభుత్వం కేటాయించింది.

ఇప్పటివరకూ దాదాపు 50 వేల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా అయ్యాయి. వీటిని వ్యవసాయ శాఖ అధికారులు బయోమెట్రిక్‌ విధానంలో రైతులకు విక్రయించాలని నిర్ణయించారు. ఇది విత్తనాలు పక్కదారి పట్టకుండా నిరోధించడానికే అయినప్పటికీ పలు సాంకేతిక లోపాల కారణాల వల్ల పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో డిమాండును బట్టి ప్రైవేట్‌ విత్తన వ్యాపారులు విత్తనాల ధరలు పెంచేశారు. ఎక్కువ ధరకు కొనుగోలు చేసినా అవి మొలకెత్తే శాతం, పంట దిగుబడి శాతానికి ఎలాంటి భరోసా ఉండట్లేదు. అవి నాణ్యమైనవి కాకపోతే ఆ మేరకు రైతులు పంట నష్టపోవాల్సిందే. 

తగ్గుతున్న సొంత తయారీ...
వాస్తవానికి పూర్వం నుంచి రైతాంగం సొంతంగా విత్తనాల తయారీపై ఆధారపడేవారు. కానీ గత కొన్నేళ్లుగా ఆ పద్ధతి విరమించుకుంటున్నారు. సొంత తయారీ విత్తనాల్లో కేళీలు పెరగడం, అతివృష్టి, అనావృష్టి, మంచు, దోమపోటు తదితర పరిస్థితుల వల్ల విత్తన తయారీలో ఇబ్బందులు ఏర్పడుతుండటంతోపాటు మరోవైపు కొత్త వంగడాలతో అధిక దిగుబడి రావడం అందుకు కారణమే. దీంతో ప్రభుత్వం రాయితీపై సరఫరా చేసే విత్తనాలపైనే రైతులు ఆధారపడుతున్నారు. అవేమాత్రం సకాలంలో రాకపోయినా, సాంకేతిక లోపాల వల్ల పంపిణీలో ఇబ్బందులొచ్చినా విత్తన పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరక తప్పట్లేదు. లేదంటే ప్రైవేట్‌ విత్తన వ్యాపారులపై ఆధారపడాల్సిన పరిస్థితి. 

ఆన్‌లైన్‌ అగచాట్లు!
రైతులు తమ భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌బుక్, భూయాజమాన్య హక్కు పుస్తకం (టైటిల్‌ డీడ్‌) చాలా కీలకంగా భావిస్తారు. గత టీడీపీ ప్రభుత్వం మూడేళ్ల క్రితం వాటికి చెల్లుచీటి చెప్పేసింది. రైతులు తమ భూమి క్రయవిక్రయాలు చేసుకోవాలన్నా, ఏటా రాయితీపై విత్తనాలు పొందాలన్నా, చివరకు బ్యాంకు నుంచి పంట రుణాలు పొందాలన్నా... అన్నింటికీ ఆధారం ఆన్‌లైన్‌లోని ‘మీ భూమి’ పోర్టలేనంటూ కొత్త వ్యవస్థను తెచ్చింది! అవినీతికి, అలసత్వానికి ఆస్కారం లేకుండా చూడటానికే వెబ్‌ల్యాండ్‌ విధానం తెచ్చామని చెప్పుకొచ్చారు.

ఆశయం బాగానే ఉన్నా అమల్లో లోపాలు సరిచేయకపోవడంతో ఇప్పుడు రైతులకు చుక్కలు చూపిస్తోంది. అడంగల్, ఒన్‌–బీలో తప్పులు సరిదిద్దించుకోవడానికి పదేపదే దరఖాస్తు చేసుకుంటూ వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. కొంతమంది రెవెన్యూ సిబ్బంది మామూళ్ల కోసం వారిని ముప్పతిప్పలు పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూసమస్యల పరిష్కారం కోసం మీ–సేవ కేంద్రాల్లో రైతులు దాఖలు చేసుకుంటున్న ఫిర్యాదులు దాదాపు 42 వేలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో ఎక్కువ మ్యూటేషన్, కరెక్షన్‌ కోసం దాఖలు చేసినవే. ఇవి పరిష్కారం గాకపోవడంతో బ్యాంకు రుణాలకే గాకుండా రాయితీపై ఇచ్చే విత్తనాలు, ఎరువులు తీసుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు.

రెవెన్యూ అధికారుల చొరవ ఉంటే...
వాస్తవానికి రైతులకు ఎంత భూమి ఉందో, అదే కౌలు రైతులైతే ఎంత భూమి సాగు చేస్తున్నారో ఆయా గ్రామాల్లోని రెవెన్యూ అధికారులు (వీఆర్‌వోలు) ధ్రువీకరణ పత్రం ఇచ్చే వీలుంటుంది. ఆ పత్రాల ఆధారంగా ఎంతమేర వరి విత్తనాలు ఇవ్వాలో వ్యవసాయశాఖ అధికారులు సర్టిఫై చేసి ఇస్తే సరిపోతుంది. ఈ వెసులుబాటును అధికారులు సద్వినియోగం చేసుంటే బయోమెట్రిక్‌ వల్ల ఎదురవుతున్న సమస్యల నుంచి రైతులకు ఊరట లభిస్తుంది. 

1001 నిషేధంతో ప్రభావం...
జిల్లాలో చిన్న, సన్నకార రైతులతో పాటు కౌలు రైతులు సుమారు 5 లక్షల మంది వరకూ ఉన్నారు. వారికి ఏటా దిగుబడి ఎకరానికి కనీసం 28 బస్తాల వరకూ ధాన్యం దిగుబడి వస్తే తప్ప గిట్టుబాటు కాదు. ఈ చిన్న రైతులు కూడా తమకున్న ఒకటీ రెండు ఎకరాల భూమితోపాటు మరో కొంత భూమి కౌలుకు తీసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎకరాకు 12 బస్తాల చొప్పున కౌలు చెల్లించాల్సి వస్తోంది. గతంలో 1001 (విజేత) రకం విత్తనాలతో 25 నుంచి 28 బస్తాల వరకూ దిగుబడి వచ్చేది. పైగా చీడపీడల బెడద తక్కువ, ప్రకృతి విపత్తులను తట్టుకోవడంతో రైతుల్లో దాదాపు 60 శాతం మంది వాటి సాగుకు ఆసక్తి చూపించేవారు.

అయితే లెవీకి వెళ్తున్న 1001 వంటి ముతక రకాల బియ్యం సన్న రకాల్లో కల్తీ అవుతోందనే కారణంతో ఈ ఏడాది నుంచి ప్రభుత్వం నుంచి 1001 రకం వరి సాగును నిషేధించింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1156 (తరంగణి), ఎంటీయూ 1061 (ఇంద్ర), ఎంటీయూ 1075 (పుష్యమి), ఎంటీయూ 1064 (అమర), ఎంటీయూ 1121 (శ్రీధ్రుతి), ఎన్‌ఎల్‌ఆర్‌ 34449 (నెల్లూరు సన్నాలు) విత్తనాలను ఈసారి రైతులకు పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. అయితే డిమాండుకు తగిన స్థాయిలో ఈ విత్తనాలు సరఫరా గాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement