Kharif Action plan
-
ఖరీఫ్ సాగు లక్ష్యం ..93.91 లక్షల ఎకరాలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్–2022 కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. ఖరీఫ్ సీజన్లో పంటల సాగు కోసం సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను వైఎస్సార్ ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా వ్యవసాయ శాఖ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. పంటలు ప్రకృతి వైపరీత్యాల బారినపడకుండా ముందస్తు ఖరీఫ్‌కు వెళ్లేలా రైతులను సమాయత్తం చేయాలని అధికారులు నిర్ణయించారు. నిర్దేశించిన గడువులోగా సాగు నీటిని విడుదల చేయడం ద్వారా జూన్ మొదటి వారంలోనే నాట్లు పడేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖరీఫ్–2022లో 93.91 లక్షల ఎకరాల్లో పంటల్ని సాగు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ప్రధానంగా 40.34 లక్షల ఎకరాల్లో వరి, 18.40 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.82 లక్షల ఎకరాల్లో పత్తి, 6.62 లక్షల ఎకరాల్లో కందులు, 3.71 లక్షల ఎకరాల్లో చెరకు, 2.72 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతాయని అంచనా. ఆర్బీకేల ద్వారా విత్తనాల పంపిణీ రానున్న సీజన్లో రూ.196.70 కోట్ల విలువైన 6.84 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై అందించాలని అధికారులు నిర్ణయించారు. తొలిసారి వాణిజ్య పంటలైన పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తనాల (నాన్ సబ్సిడీ)ను కూడా ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేయబోతున్నారు. వేరుశనగ విత్తన పంపిణీ మే మూడో వారం నుంచి, వరి విత్తనాలను జూన్ మొదటి వారం నుంచి పంపిణీ చేయనున్నారు. గిరిజన మండలాల్లో మాత్రం వేరుశనగ, వరి విత్తనాలను మే 3వ వారం నుంచే పంపిణీ చేస్తారు. మరోవైపు 19.02 లక్షల టన్నుల ఎరువులు కేటాయించారు. వీటిని ల్యాబ్‌లలో సర్టిఫై చేసిన తర్వాతే పంపిణీ చేయబోతున్నారు. కనీసం 1.50 లక్షల టన్నుల ఎరువులను ఆర్బీకేల వద్ద ముందస్తుగా నిల్వ చేస్తున్నారు. ఈసారి మొత్తం వినియోగంలో కనీసం 30 శాతం ఎరువులు, 10 శాతం పురుగుల మందులను ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సీజన్లో రూ.92,687 కోట్ల మేర వ్యవసాయ రుణాలివ్వాలని నిర్దేశించారు. రైతు ముంగిటకే అన్నిసేవలు ఖరీఫ్‌లో ప్రతి రైతుకు వారి గ్రామాల్లోనే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు వంటి వాటిని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాం. సేంద్రియ సాగును ప్రోత్సహించేలా ఆర్బీకేల ద్వారా రైతులకు పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పకడ్బందీ ఏర్పాట్లు పంటలు వైపరీత్యాల బారిన పడకుండా సాధ్యమైనంత త్వరగా సీజన్ ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నాం. సీజన్‌కు ముందుగానే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి వాటిని అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నాం. 8,508 పొలం బడులు నిర్వహించడం ద్వారా ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే రైతులకు జీఏపీ సర్టిఫికేషన్ జారీకి శ్రీకారం చుడుతున్నాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ (చదవండి: రూ.390 సిమెంట్ బస్తా రూ.235కే!) -
రైతుల గుండెల్లో... వెబ్‌ల్యాండ్ దడ!
సాక్షి , శ్రీకాకుళం : జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజనులో 2.13 లక్షల హెక్టార్లలో వరిసాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇందుకు దాదాపు 1.55 లక్షల క్విం టాళ్ల వరి విత్తనాలు అవసరం. వాటిలో సుమారుగా 50 వేల క్వింటాళ్ల వరకూ రైతులు ఏటా సొంతంగా విత్తన తయారీ చేసుకుంటారని వ్యవసాయాధికారులు అంచనా వేస్తూ వస్తున్నారు. అవిగాక ఇంకా 1.05 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం. ఈసారి జిల్లాకు 75,900 క్వింటాళ్ల వరి విత్తనాలను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటివరకూ దాదాపు 50 వేల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా అయ్యాయి. వీటిని వ్యవసాయ శాఖ అధికారులు బయోమెట్రిక్ విధానంలో రైతులకు విక్రయించాలని నిర్ణయించారు. ఇది విత్తనాలు పక్కదారి పట్టకుండా నిరోధించడానికే అయినప్పటికీ పలు సాంకేతిక లోపాల కారణాల వల్ల పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో డిమాండును బట్టి ప్రైవేట్ విత్తన వ్యాపారులు విత్తనాల ధరలు పెంచేశారు. ఎక్కువ ధరకు కొనుగోలు చేసినా అవి మొలకెత్తే శాతం, పంట దిగుబడి శాతానికి ఎలాంటి భరోసా ఉండట్లేదు. అవి నాణ్యమైనవి కాకపోతే ఆ మేరకు రైతులు పంట నష్టపోవాల్సిందే. తగ్గుతున్న సొంత తయారీ... వాస్తవానికి పూర్వం నుంచి రైతాంగం సొంతంగా విత్తనాల తయారీపై ఆధారపడేవారు. కానీ గత కొన్నేళ్లుగా ఆ పద్ధతి విరమించుకుంటున్నారు. సొంత తయారీ విత్తనాల్లో కేళీలు పెరగడం, అతివృష్టి, అనావృష్టి, మంచు, దోమపోటు తదితర పరిస్థితుల వల్ల విత్తన తయారీలో ఇబ్బందులు ఏర్పడుతుండటంతోపాటు మరోవైపు కొత్త వంగడాలతో అధిక దిగుబడి రావడం అందుకు కారణమే. దీంతో ప్రభుత్వం రాయితీపై సరఫరా చేసే విత్తనాలపైనే రైతులు ఆధారపడుతున్నారు. అవేమాత్రం సకాలంలో రాకపోయినా, సాంకేతిక లోపాల వల్ల పంపిణీలో ఇబ్బందులొచ్చినా విత్తన పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరక తప్పట్లేదు. లేదంటే ప్రైవేట్ విత్తన వ్యాపారులపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఆన్లైన్ అగచాట్లు! రైతులు తమ భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌బుక్, భూయాజమాన్య హక్కు పుస్తకం (టైటిల్ డీడ్) చాలా కీలకంగా భావిస్తారు. గత టీడీపీ ప్రభుత్వం మూడేళ్ల క్రితం వాటికి చెల్లుచీటి చెప్పేసింది. రైతులు తమ భూమి క్రయవిక్రయాలు చేసుకోవాలన్నా, ఏటా రాయితీపై విత్తనాలు పొందాలన్నా, చివరకు బ్యాంకు నుంచి పంట రుణాలు పొందాలన్నా... అన్నింటికీ ఆధారం ఆన్లైన్లోని ‘మీ భూమి’ పోర్టలేనంటూ కొత్త వ్యవస్థను తెచ్చింది! అవినీతికి, అలసత్వానికి ఆస్కారం లేకుండా చూడటానికే వెబ్‌ల్యాండ్ విధానం తెచ్చామని చెప్పుకొచ్చారు. ఆశయం బాగానే ఉన్నా అమల్లో లోపాలు సరిచేయకపోవడంతో ఇప్పుడు రైతులకు చుక్కలు చూపిస్తోంది. అడంగల్, ఒన్–బీలో తప్పులు సరిదిద్దించుకోవడానికి పదేపదే దరఖాస్తు చేసుకుంటూ వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. కొంతమంది రెవెన్యూ సిబ్బంది మామూళ్ల కోసం వారిని ముప్పతిప్పలు పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూసమస్యల పరిష్కారం కోసం మీ–సేవ కేంద్రాల్లో రైతులు దాఖలు చేసుకుంటున్న ఫిర్యాదులు దాదాపు 42 వేలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో ఎక్కువ మ్యూటేషన్, కరెక్షన్ కోసం దాఖలు చేసినవే. ఇవి పరిష్కారం గాకపోవడంతో బ్యాంకు రుణాలకే గాకుండా రాయితీపై ఇచ్చే విత్తనాలు, ఎరువులు తీసుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. రెవెన్యూ అధికారుల చొరవ ఉంటే... వాస్తవానికి రైతులకు ఎంత భూమి ఉందో, అదే కౌలు రైతులైతే ఎంత భూమి సాగు చేస్తున్నారో ఆయా గ్రామాల్లోని రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు) ధ్రువీకరణ పత్రం ఇచ్చే వీలుంటుంది. ఆ పత్రాల ఆధారంగా ఎంతమేర వరి విత్తనాలు ఇవ్వాలో వ్యవసాయశాఖ అధికారులు సర్టిఫై చేసి ఇస్తే సరిపోతుంది. ఈ వెసులుబాటును అధికారులు సద్వినియోగం చేసుంటే బయోమెట్రిక్ వల్ల ఎదురవుతున్న సమస్యల నుంచి రైతులకు ఊరట లభిస్తుంది. 1001 నిషేధంతో ప్రభావం... జిల్లాలో చిన్న, సన్నకార రైతులతో పాటు కౌలు రైతులు సుమారు 5 లక్షల మంది వరకూ ఉన్నారు. వారికి ఏటా దిగుబడి ఎకరానికి కనీసం 28 బస్తాల వరకూ ధాన్యం దిగుబడి వస్తే తప్ప గిట్టుబాటు కాదు. ఈ చిన్న రైతులు కూడా తమకున్న ఒకటీ రెండు ఎకరాల భూమితోపాటు మరో కొంత భూమి కౌలుకు తీసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎకరాకు 12 బస్తాల చొప్పున కౌలు చెల్లించాల్సి వస్తోంది. గతంలో 1001 (విజేత) రకం విత్తనాలతో 25 నుంచి 28 బస్తాల వరకూ దిగుబడి వచ్చేది. పైగా చీడపీడల బెడద తక్కువ, ప్రకృతి విపత్తులను తట్టుకోవడంతో రైతుల్లో దాదాపు 60 శాతం మంది వాటి సాగుకు ఆసక్తి చూపించేవారు. అయితే లెవీకి వెళ్తున్న 1001 వంటి ముతక రకాల బియ్యం సన్న రకాల్లో కల్తీ అవుతోందనే కారణంతో ఈ ఏడాది నుంచి ప్రభుత్వం నుంచి 1001 రకం వరి సాగును నిషేధించింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1156 (తరంగణి), ఎంటీయూ 1061 (ఇంద్ర), ఎంటీయూ 1075 (పుష్యమి), ఎంటీయూ 1064 (అమర), ఎంటీయూ 1121 (శ్రీధ్రుతి), ఎన్‌ఎల్‌ఆర్ 34449 (నెల్లూరు సన్నాలు) విత్తనాలను ఈసారి రైతులకు పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. అయితే డిమాండుకు తగిన స్థాయిలో ఈ విత్తనాలు సరఫరా గాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. -
సర్వం సన్నద్ధం...
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : 2013-14 ఖరీప్ యాక్షన్ ప్లాన్ ప్రకారం జిల్లాలో 52,016 వేల హెక్టార్లలో వరి సాగవుతుందని భావించారు. అయితే నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డివిజన్లకు చెందిన 42 మండలాల్లో 46,228 హెక్టార్లలో వరి పంటలు వేశారు. పరిస్థితులు అనుకూలిస్తే ఈ మేరకు 2.31 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆశించిన మేరకు దిగుబడి రాకపోయినా.. దిగుబడిలో 25 శాతం అవసరాలు, ఇతర కారణాలతో విక్రయించే అవకాశం లేదని భావిస్తున్నారు. ఈ క్రమంలో 1.61 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు 124 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐకేపీ సంఘాల ద్వారా కనీసం లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యమైనా కొనుగోలు చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఒక్కో కేంద్రంలో 20 టార్పాలిన్లు, ఆ మేరకు గన్నీ సంచుల కోసం ఇండెంట్ ఇచ్చారు. ఐకేపీ సంఘాలకు రూ.3.36 కోట్ల కమీషన్.. డీఆర్డీఏ, ఐటీడీఏల పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేసే ఐకేపీ సంఘాలకు రూ.3.36 కోట్ల కమీషన్ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనాకొచ్చారు. మహిళా సంఘాలకు గతంలో ధాన్యం కొనుగోలుపై రూ.100కు రూ.1.50 చెల్లించిన ప్రభుత్వం గతేడాది నుంచి రూ.2.50కు పెంచింది. గత ఖరీఫ్‌లో 66,385 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిన స్వయం సహాయక సంఘాలు రూ.2.10 కోట్ల కమీషన్ పొందాయి. గత రబీ సీజన్లో సైతం 30,510 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.97 లక్షల కమీషన్ తీసుకున్నారు. ఈసారి స్వయం సహాయక సంఘాల ద్వారా కనీసం లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున.. రూ.3.36 కోట్ల మేరకు కమీషన్ పొందే అవకాశం ఉందని అధికారుల లెక్కలు చెప్తున్నాయి. కాగా గ్రేడ్-ఏ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1,345, కామన్‌కు రూ.1.310 మద్దతు ధరపై నిబంధనల ప్రకారం కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రేడ్-ఏ, కామన్ రకాల ధాన్యంలో రా రైసుమిల్లుకు విరుగుడు 25 శాతం, బాయిల్డ్కైతే 16 మించకుండా చూడాలి. ధాన్యంలో తేమ 14 శాతం దాటితే కొనుగోలు చేయకూడదన్న నిబంధనలు కూడా ఉన్నాయి. కాగా ఈ సారి ప్రభుత్వం పెంచిన మద్దతు ధర కంటి తుడుపుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈనెల 25 నుంచి ధాన్యం కొనుగోళ్లు.. డీఆర్డీఏ ఐకేపీల ద్వారా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొనుగోలు చేసే ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్ గోదాములతోపాటు రైసుమిల్లుల్లో నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేశాము. ఈ నెల 25 నుంచి 124 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయి. ఇప్పటికే కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు సంబంధిత అధికారులు, సిబ్బందితో పలుమార్లు సమీక్షించారు. 21న నిర్మల్, 22న మంచిర్యాల ఆర్డీవో కార్యాలయాల్లో కొనుగోళ్లను పర్యవేక్షించే, పాల్గొనే అధికారులు, సిబ్బందికి అవగాహన సదస్సులు కూడా ఉన్నాయి. నాణ్యతా ప్రమాణాలను పాటించి రైతులు కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధర పొందాలని కోరుతున్నాము. - పి.వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రాజెక్టు డెరైక్టర్, డీఆర్డీఏ