కౌన్సెలింగ్ కేంద్రంలోనే వెబ్ ఆప్షన్లు
విజయనగరం టౌన్ : ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి ఈ నెల 17 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిర్వహించేందుకు ఆదేశాలు వచ్చాయని కౌన్సెలింగ్ అధికారులు టీఆర్‌ఎస్ లక్ష్మి, ఆర్.భాస్కరరావు, సత్యనారాయణ గురువారం తెలిపారు. వెబ్ ఆప్షన్ల కోసం కౌన్సెలింగ్ కేంద్రాలపైనే ఆధారపడాలని సూచించారు. వన్‌టైమ్ పాస్ వర్డ్ విధానం ద్వారా దళారుల బారి నుంచి తప్పించుకోవచ్చన్నారు. ప్రైవేట్ ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా ఆప్షన్లు ఇస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో వెబ్ ఆప్షన్లలో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు చెప్పారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు ప్రత్యేక విభాగాన్ని సిద్ధం చేశామన్నారు.
అభ్యర్థులకు ఎటువంటి సందేహాలున్నా.. నేరుగా నివృత్తి చేసుకోవడంతో పాటు తప్పొప్పులు సరిదిద్దుకోవచ్చన్నారు. ఈ నెల 30న సీట్ల కేటాయింపు, సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభానికి రంగం సిద్ధమైందన్నారు. గురువారం 75 వేల ఒకటో ర్యాంకు నుంచి 90 వేల ర్యాంకు వరకూ కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. ఇందులో 181 మంది అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేయించుకున్నారని చెప్పారు. శనివారం 90 వేల ఒకటో ర్యాంకు నుంచి లక్షా 5 వేల ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ నెల 23వ ధ్రువీకరణ పత్రాల పరిశీలన కొనసాగుతుందని చెప్పారు.