యాడ చూసినా 3+7=100 సందడే.. | Wedding Celebration in Sravana Masam | Sakshi
Sakshi News home page

యాడ చూసినా 3+7=100 సందడే..

Published Fri, Aug 15 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM

యాడ చూసినా 3+7=100 సందడే..

యాడ చూసినా 3+7=100 సందడే..

 జిల్లాలో ఏ ఊళ్లో చూసినా ‘మూడు+ఏడు= నూరు’ సందడే. అవును.. మూడు ముళ్లతో ముడిపడి, ఏడడుగులతో బలపడి‘నూరేళ్ల పంట’కు సాగే ఏరువాకే పెళ్లంటే. అలాంటి నూరేళ్ల పంటను పండించుకోవడానికి.. గురువారం రాత్రి వేల జంటలు శ్రీకారం చుట్టాయి. మంచి ముహూర్తం కుదరడంతో జిల్లావ్యాప్తంగా వేలాది పెళ్లిళ్లు జరిగాయి. అన్నవరంలో సత్యదేవుని సన్నిధిలోనే 600 పైగా జంటలు కల్యాణబంధాన్ని పెనవేసుకున్నాయి.  
 
 అన్నవరం :శ్రావణమాసంలోనే అత్యంత విశేషమైన వివాహ ముహూర్తాలు గల గురువారం రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిలో సుమారు 600 జంటలు వివాహబంధంతో ఒక్కటయ్యాయి. రాత్రి 7.54 గంటలు, రాత్రి 12.23 గంటలు, తెల్లవారుజామున 3.21 గంటలకు ఈ వివాహాలు జరిగాయి. గురువారం సాయంత్రం నుంచే రత్నగిరికి వివాహబృందాల రాక ప్రారంభమైంది. రాత్రి 7.54 గంటల ముహూర్తంలో  స్వామివారి సన్నిధిలో వివాహాలు చేసుకునేందుకు వచ్చినవారు, వాటికి హాజరైన బంధుమిత్రగణంతో రత్నగిరిపై ఎటు చూసినా పెళ్లిసందడే కనిపించింది. ఆలయ ప్రాంగణం, స్వామివారి ప్రధానాలయం చుట్టూ గల ఆవరణ, సీతారామ సత్రం, ప్రకాష్ సదన్, సత్యగిరిపై హరిహరసదన్, విష్ణుసదన్ తదితర ప్రదేశాలలో వివాహాలు జరిగాయి. పెళ్లిబృందాలను తీసుకువచ్చే వాహనాలను కొండదిగువన కాలేజీ మైదానంలోను, దాని పక్కన గల ఖాళీ స్థలంలోను  నిలిపివేశారు. టాక్సీ, వ్యాన్, ఆటోలను మాత్రమే రత్నగిరి మీదకు అనుమతించారు. ఆటోలను కూడా ఘాట్‌రోడ్డు వై జంక్షన్ వరకే అనుమతించారు. దాంతో రత్నగిరి ఘాట్‌రోడ్‌లో కొంతవరకూ ట్రాఫిక్ క్లియర్ అయింది.
 
 గురువారం మిగిలిన రూవ్‌ులు 30
 వీఐపీల సందేశాల మేరకు వారికోసం రిజర్వు చేసిన సత్రం గదులు సుమారు 30 వరకు గురువారం కూడా మిగిలి పోయాయి. బుధవారం రాత్రి సత్రాల్లో సుమారు 120 గదులు ఖాళీగా ఉండి పోయిన విషయం ‘సాక్షి’ దినపత్రికలో రావడంతో గురువారం ఆపొరపాటు జరగ కుండా అధికారులుసరిదిద్దుకున్నారు. రాత్రి పదిగంటల తర్వాత ఖాళీగా ఉన్న గదులను అప్పటికప్పుడుపెళ్లిబృందాలకుఅద్దెకిచ్చారు.  
 
 వ్రతాలాచరించిన 800 నూతన జంటలు
 సత్యదేవుని సన్నిధిలో బుధవారం రాత్రి జరిగిన వివాహాలలో 500 జంటలు ఒక్కటయ్యాయి.  వీరితో బాటు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి మరో 300 కొత్త జంటలు గురువారం ఆలయానికి విచ్చేసి స్వామివారి వ్రతాలాచరించి సత్యదేవుని దర్శించుకున్నాయి.  శ్రీ గోకులంలోని ఆవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద దీపాలు వెలిగించారు. గురువారం 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. స్వామివారి వ్రతాలు 2,572, కల్యాణాలు తొమ్మిది నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.14 లక్షల ఆదాయం సమకూరింది.
 
 శుక్రవారం 500 వివాహాలు
 ఇదిలా ఉండగా రత్నగిరిపై శుక్రవారం ఉదయం 7.24, రాత్రి 9.40, 12.27, తెల్లవారుజామున 3.15 గంటల ముహూర్తాలలో సుమారు 500 వివాహాలు జరుగనున్నాయి.
 
 కల్యాణ వైభోగమే
 అమలాపురం టౌన్ : ‘పెళ్లి కళ వచ్చేసింది బాలా...’ అనే సినిమా పాటకు పేరడీగా ‘పెళ్లి కళ వచ్చేసిందే జిల్లా...’అని పాడుకునేలా జిల్లా అంతటా గురువారం పెళ్లిళ్ల సందడి నెలకొంది. జిల్లాలోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని చాలా ఇళ్లు పెళ్లిళ్ల లోగిళ్లుగా మారిపోయాయి. ఈనెలలో 13,14,15 తేదీల్లో వివాహాలకు మంచి ముహూర్తాలు ఉండగా గురువారం మరీ బలమైన ముహూర్తాలు ఉండడంతో ఈ ఒక్క రోజే జిల్లాలో దాదాపు ఆరు వేల పెళ్లిళ్లు జరిగినట్టు ఓ అంచనా. 13వ తేదీన జిల్లాలో సుమారు రెండు వేలకు పైగా పెళ్లిళ్లు జరగ్గా 15వ  తేదీన మరో రెండు వేలకు పైగా పెళ్లిళ్లు జరగనున్నాయి.
 
 దేవాలయాలు వేదికగా...
 జిల్లాలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లోనూ గురువారం వేలాది పెళ్లిళ్లు జరిగాయి. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో గురువారం ఒక్క రోజే దాదాపు 600 పెళ్లిళ్లు జరిగాయి. బుధవారం అక్కడ దాదాపు 500కు పైగా పెళ్లిళ్లు జరగగా శుక్రవారం మరో 500 పెళ్లిళ్లు జరగనున్నాయి. అలాగే అంతర్వేది, మురమళ్ల, వాడపల్లి, అమలాపురంలలోని ఆలయాల్లో వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయి. గురువారం ఒక్కరోజే జిల్లాలోని పలు ప్రమఖ దేవాలయాలు, సాధారణ దేవాలయాల్లో దాదాపు రెండు వేలకు పైగా వివాహాలు జరిగాయి. ఇక ఇళ్ల వద్ద... కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లలో సుమారు నాలుగు వేల వరకూ వివాహాలు జరిగాయి. ఆయా దేవాలయాలు పెళ్లి జనంతో కిటకిటలాడాయి. బస్సులు, ఆటోలు, రోడ్లు జనంతో కిక్కిరిశాయి.
 
 సినిమా సెట్టింగ్‌లను తలపించే వివాహ వేదికలు
 రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, పిఠాపురం, పెద్దాపురం, రామచంద్రపురం, తుని, సామర్లకోట, మండపేట, రావులపాలెం, అనపర్తి, రాజోలు, ముమ్మిడివరం తదితర ప్రాంతాల్లో కొన్ని చోట్ల వివాహ వేదికలు సినిమా సెట్టింగ్‌లను తలపించాయి. అమలాపురం పట్టణంలోనే గురువారం దాదాపు 200కి పైగా వివాహాలు జరిగాయి. ఇక అమలాపురంలోని కల్యాణ వెంకన్న పేరుగాంచిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో దాదాపు 60 వివాహాలు జరిగాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement