సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన చంద్రన్న పెళ్లి కానుకకు ఆంక్షలు గుదిబండగా మారాయి. పథకం ప్రకటన సమయంలో పెళ్లి చేసుకునే ప్రతి జంటకు కానుక అందుతుందనే ఆశలు కల్పించారు, తీరా దరఖాస్తు చేసుకున్న వారిలో పదోవంతుకు కూడా కానుక అందుతుందనే నమ్మకం లేకోయింది.
చంద్రన్న పెళ్లి కానుక పథకం ఈ నెల 11వ తేదీన అమలులోకి వచ్చింది. ఇందుకోసం ప్రతి మండలానికి డ్వాక్రా సంఘాల నుంచి ముగ్గురు వివాహ మిత్రలను నియమించారు. వీరికి ఆ మండల పరిధిలో జరిగే వివాహాలను బట్టి కమిషన్ చెల్లించేలా నియమించారు. పుట్టిన తేదీ ధ్రువీకరించే పదో రగతి సర్టిఫికెట్ లేదా మీ సేవా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్, దివ్యాంగులైతే వైకల్య నిర్థారణ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ కోసం తెల్లకార్డు లేదా మీసేవ ద్వారా తీసుకునే ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్, వధువు బ్యాంకు ఖాతా, ఇరువురి ఆధార్ కార్డులు ఇలా అన్ని వివరాలు ప్రత్యేకంగా రూపొందించే యాప్ ద్వారా అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత వివాహ మిత్రలు వారి ఇళ్లకు వెళ్లి చుట్టుపక్కల వార్ని నిర్ధారించుకొని ఆన్‌లైన్‌లో పొందుపర్చిన వివరాలన్ని సరిపోల్చుకున్న తర్వాత అన్ని అర్హతలుంటే పెళ్లి రోజున 20 శాతం, ఆ తర్వాత వారం రోజుల్లో మిగిలిన 80 శాతం పెళ్లి కుమార్తె ఖాతాకు ఆ మొత్తం జమవుతుంది.
అందుబాటులోకి రాని యాప్
రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన యాప్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో 1100కు కాల్ చేసి వివాహ తేదీ, వివరాలు తెలియజేస్తే వివాహమిత్రలు వారి ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. వాటిని గతేడాది జరిగిన ప్రజాసాధికారిత సర్వేలో ఉన్న వివరాలతో అనుసంధానిస్తారు. నిన్న..మొన్నటి వరకు రేషన్ కార్డు కావాలన్నా..పింఛన్ కావాలన్నా పల్స్ (ప్రజా సాధికార) సర్వేయే ఆధారం. లంతేనా: ఆ సర్వే ఆధారంగా సంక్షేమ పథకాలకు అర్హత కోసం నిర్దేశించిన 13 అంశాల ప్రాతిపదికన అర్హతను నిర్ధారిస్తారు. వాటిలో ఏ ఒక్కటి ఉన్నా కానుకకు దూరమైనట్టే.
819 జంటల్లో 239 మందికే..
ఈ నెల 11వ తేదీ నుంచి ఇప్పటివరకు జిల్లాలో అల్పాదాయ వర్గాలకు చెందిన 819 జంటలకు వివాహాలు జరగగా వారంతా 1100 ద్వారా ఆన్‌లైన్‌లో పెళ్లికానుక కోసం దరఖాస్తు చేసుకున్నారు. 109 మంది పెళ్లికుమార్తెలు, 171 మంది పెళ్లి కుమారులను సర్వేలో పేర్కొన్న పుట్టిన రోజు తేదీ, ఆధార్‌లో పేర్కొన్న తేదీ వేర్వేరుగా ఉందన్న సాకుతో తిరస్కరించారు. అలాగే 120 మంది పెళ్లి కుమార్తెలు, 200 మంది పెళ్లి కుమారులకు ఇదే రీతిలో సర్వేలోనూ, ఆధార్‌లోనూ, ఇతర రికార్డుల్లో ఉన్న కుల ధ్రువీకరణ పత్రాల్లో తేడాలున్నాయన్న కారణంతో తిరస్కరిం చారు. ఈ విధంగా మొత్తం 680 జంటలు కానుకకు దూరమయ్యాయి. కేవలం 239 జంటలను అర్హులుగా తేల్చారు. వారికి మాత్రమే ఇప్పటి వరకు పెళ్లి కానుక అందజేశారు. మొత్తమ్మీద పల్స్ సర్వే పింఛన్, రేషన్‌కేకాదు కానుకకు గండంగానే మారింది.
పథకం ఇదీ..చంద్రన్న పెళ్లి కానుక
ఎస్సీ, ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.75వేలు, బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.50వేలు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైతే ఎస్సీలకు రూ.40వేలు, ఎస్టీలైతే రూ.50వేలు, బీసీలైతే రూ. 35వేలు, ముస్లీంలకు 50వేలు ఇస్తారు. విభిన్న ప్రతిభావంతులైతే ఏ సామాజిక వర్గానికి చెందిన వారికైనా రూ.లక్ష వరకు ఇస్తారు.
త్వరలోనే యాప్
మే 5వ తేదీన పెళ్లి కానుక యాప్ రానుంది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పెళ్లి చేసుకునే జంట వివరాలను అప్‌లోడ్ చేయాలి. పల్స్ సర్వేలో నమోదై ఉండి అర్హత గల వారికి మాత్రమే కానుకలు మంజూరవుతాయి. అవకతవకలకు, అవినీతికి ఆస్కారం లేని రీతిలో చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. – సత్యసాయి శ్రీనివాస్,పీడీ, డీఆర్‌డీఎ
Comments
Please login to add a commentAdd a comment