నెల్లూరు(బారకాసు): ఫొటో, వీడియో ఆల్బమ్.. ప్రతిఒక్కరి జీవితంలో వాటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మధురమైన జ్ఞాపకాలుగా భద్రపరుచుకుంటారు. పుట్టినప్పటి నుంచి తనువు చాలించేంత వరకు మనకు ఎన్నో సందర్భాల్లో తీపిగుర్తులుగా మిగిలేవి ఫొటోలు, వీడియోలు. ఫొటోగ్రఫీ రంగాన్ని నమ్ముకుని జీవితాన్ని కొనసాగిస్తున్న వారు కరోనా వైరస్ కారణంగా ఉపాధి లేకఅవస్థలు పడుతున్నారు.
♦ ఫొటోలు ఎన్నో సంఘటనలకు సాక్ష్యాలుగా, ప్రతి వ్యక్తికి ఒక తీపిగుర్తులుగా జీవితాంతం మిగిలి ఉంటాయి.
♦ కరోనా వైరస్ విజృంభణ కారణంగా లాక్‌డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో ఫొటోగ్రఫీ వృత్తిని నమ్ముకున్న ఫొటో, వీడియో గ్రాఫర్లు, మిక్సింగ్ చేసే వారు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు.
♦ జిల్లా వ్యాప్తంగా ఫొటో, వీడియో, ఎడిటింగ్ యూనిట్ వాళ్లు సుమారు 5 వేల మందికి పైగా ఉన్నారు.
♦ ఒక్క నెల్లూరు నగరంలోనే వెయ్యిమంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు.
♦ లాక్‌డౌన్ తర్వాత పెళ్లిళ్లు, శుభకార్యాలు పెద్దగా జరగడంలేదు. తక్కువ మందితో మాత్రమే కార్యక్రమాలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో అనేకమంది పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటున్నారు.
♦ ఈ నేపథ్యంలో పనుల్లేక ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు జీవనాధారం కోల్పోయి అనేక అవస్థలు పడుతున్నారు.
♦ అనేక కార్యక్రమాలు స్తంభించిపోవడంతో స్టూడియోలు కూడా తెరిచే పరిస్థితి లేదు.
♦ చాలామంది రూ.లక్షలు బ్యాంక్ రుణాలు తెచ్చుకుని పెట్టుబడి పెట్టి కెమెరాలు, కంప్యూటర్లు, ఎల్‌ఈడీలతోపాటు వివిధ రకాలైన సామగ్రి కొన్నారు.
♦ ప్రోగ్రామ్స్ ద్వారా వచ్చే డబ్బుతో రుణాలు చెల్లించుకునే వారు. లాక్‌డౌన్ కారణంగా రుణాలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు.
♦ అంతేకాకుండా వీటికి అనుబంధంగా రోజువారీ ఫొటో, వీడియో తీసే వర్కర్లు, మిక్సింగ్, ఫొటో ఆల్బమ్ తయారుచేసే వారు, వాటి మీద ఆధారపడి పనిచేసే వర్కర్లు అనేక మంది ఉన్నారు. వీళ్ల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
చర్యలు తీసుకోవాలి
ఫొటో, వీడియో గ్రాఫర్లను ఆర్థికంగా ఆదుకోవాలి. ఈ వృత్తిలో ఉన్న వారంతా ప్రస్తుతం కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి లేక అనేక అవస్థలు పడుతున్నారు. అనేకమంది తమ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి కూడా లేదు. అందువల్ల ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.– పి.మోహన్‌రాజ్, నెల్లూరు సిటీ, రూరల్ ఫొటో, వీడియో, మిక్సింగ్ వెల్ఫేర్‌అసోసియేషన్ అధ్యక్షుడు
ఆర్థికసాయం అందించి ఆదుకోవాలి
లాక్‌డౌన్ నేపథ్యంలో పనులు కోల్పోయి పెళ్లిళ్లు, శుభకార్యాల్లేక ఫొటో, వీడియోగ్రాఫర్ల కుటుంబాలకు పూట గడవడం కష్టంగా మారింది. ఫొటో, వీడియోగ్రాఫర్లు, మిక్సింగ్ యూనిట్ నిర్వాహకులకు ఆర్థికంగా సహాయం చేసి ఆదుకోవాలి.– చందూవర్మ, సీనియర్ ఫొటోగ్రాఫర్, నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment