photo Graphar
-
‘పుష్ప’ షూటింగ్లో విషాదం : షాక్‌లో అభిమానులు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న తాజా మూవీ 'పుష్ప’ షూటింగ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ స్టిల్ ఫొటోగ్రాఫర్ జీ శ్రీనివాస్ (54) గురువారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం మారేడుమిల్లి అడవుల్లో జరుగుతున్న క్రమంలో మూవీకి స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో యూనిట్ వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మార్గమధ్యలోనే ఆయన ప్రాణాలొదిలారు. పుష్ఫ మూవీ ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన మరుసటి చోటు చేసుకున్న ఈ హఠాత్పరిణామంతో అటు అల్లు అర్జున్ అభిమానులు, ఇటు యూనిట్ అంతా తీరని విషాదంలో మునిగిపోయింది. శ్రీనివాస్ మృతి పట్ల ‘పుష్ప’ టీమ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా దాదాపు 200 పైగా సినిమాలకు పనిచేసిన శ్రీనివాస్ స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కూడా పని చేశారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలున్నారు. డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో, గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. 200 లకు పైగా సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పనిచేసిన ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ జి.శ్రీనివాస్ (54) రాత్రి 1 గం ల కి రాజమండ్రి లో గుండెపోటు తో మరణించారు. ఆయన తెలుగు సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా పని చేశారు. pic.twitter.com/HPHOK4BSak — BARaju (@baraju_SuperHit) January 29, 2021 -
తీపిగుర్తులు.. చేదు బతుకులు
నెల్లూరు(బారకాసు): ఫొటో, వీడియో ఆల్బమ్.. ప్రతిఒక్కరి జీవితంలో వాటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మధురమైన జ్ఞాపకాలుగా భద్రపరుచుకుంటారు. పుట్టినప్పటి నుంచి తనువు చాలించేంత వరకు మనకు ఎన్నో సందర్భాల్లో తీపిగుర్తులుగా మిగిలేవి ఫొటోలు, వీడియోలు. ఫొటోగ్రఫీ రంగాన్ని నమ్ముకుని జీవితాన్ని కొనసాగిస్తున్న వారు కరోనా వైరస్ కారణంగా ఉపాధి లేకఅవస్థలు పడుతున్నారు. ♦ ఫొటోలు ఎన్నో సంఘటనలకు సాక్ష్యాలుగా, ప్రతి వ్యక్తికి ఒక తీపిగుర్తులుగా జీవితాంతం మిగిలి ఉంటాయి. ♦ కరోనా వైరస్ విజృంభణ కారణంగా లాక్డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో ఫొటోగ్రఫీ వృత్తిని నమ్ముకున్న ఫొటో, వీడియో గ్రాఫర్లు, మిక్సింగ్ చేసే వారు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ♦ జిల్లా వ్యాప్తంగా ఫొటో, వీడియో, ఎడిటింగ్ యూనిట్ వాళ్లు సుమారు 5 వేల మందికి పైగా ఉన్నారు. ♦ ఒక్క నెల్లూరు నగరంలోనే వెయ్యిమంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. ♦ లాక్డౌన్ తర్వాత పెళ్లిళ్లు, శుభకార్యాలు పెద్దగా జరగడంలేదు. తక్కువ మందితో మాత్రమే కార్యక్రమాలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో అనేకమంది పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటున్నారు. ♦ ఈ నేపథ్యంలో పనుల్లేక ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు జీవనాధారం కోల్పోయి అనేక అవస్థలు పడుతున్నారు. ♦ అనేక కార్యక్రమాలు స్తంభించిపోవడంతో స్టూడియోలు కూడా తెరిచే పరిస్థితి లేదు. ♦ చాలామంది రూ.లక్షలు బ్యాంక్ రుణాలు తెచ్చుకుని పెట్టుబడి పెట్టి కెమెరాలు, కంప్యూటర్లు, ఎల్ఈడీలతోపాటు వివిధ రకాలైన సామగ్రి కొన్నారు. ♦ ప్రోగ్రామ్స్ ద్వారా వచ్చే డబ్బుతో రుణాలు చెల్లించుకునే వారు. లాక్డౌన్ కారణంగా రుణాలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ♦ అంతేకాకుండా వీటికి అనుబంధంగా రోజువారీ ఫొటో, వీడియో తీసే వర్కర్లు, మిక్సింగ్, ఫొటో ఆల్బమ్ తయారుచేసే వారు, వాటి మీద ఆధారపడి పనిచేసే వర్కర్లు అనేక మంది ఉన్నారు. వీళ్ల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. చర్యలు తీసుకోవాలి ఫొటో, వీడియో గ్రాఫర్లను ఆర్థికంగా ఆదుకోవాలి. ఈ వృత్తిలో ఉన్న వారంతా ప్రస్తుతం కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి లేక అనేక అవస్థలు పడుతున్నారు. అనేకమంది తమ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి కూడా లేదు. అందువల్ల ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.– పి.మోహన్‌రాజ్, నెల్లూరు సిటీ, రూరల్ ఫొటో, వీడియో, మిక్సింగ్ వెల్ఫేర్అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్థికసాయం అందించి ఆదుకోవాలి లాక్డౌన్ నేపథ్యంలో పనులు కోల్పోయి పెళ్లిళ్లు, శుభకార్యాల్లేక ఫొటో, వీడియోగ్రాఫర్ల కుటుంబాలకు పూట గడవడం కష్టంగా మారింది. ఫొటో, వీడియోగ్రాఫర్లు, మిక్సింగ్ యూనిట్ నిర్వాహకులకు ఆర్థికంగా సహాయం చేసి ఆదుకోవాలి.– చందూవర్మ, సీనియర్ ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
స్మైల్ ప్లీజ్.. కరోనాతో క్లోజ్..!
కరోనా... ప్రపంచాన్నే కకావికలం చేస్తోంది. ఉద్యోగాలను ఊడదీస్తోంది. బతుకులను ఛిద్రం చేస్తోంది. జీవనాన్ని ప్రశ్నార్థకంగా మార్చుతోంది. కారి్మకులు, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, రైతులపై ప్రభావం చూపిన కరోనా.. ఫొటో, వీడియో గ్రాఫర్లకూ పనిలేకుండా చేసింది. మూడు నెలలుగా కెమెరాకు ‘క్లిక్’ను దూరం చేసింది. వారి కుటుంబాల్లో ఆకలి కేకలు పుట్టిస్తోంది. స్మైల్ ప్లీజ్ అంటూ సందడిగా కనిపించే ఫొటో, వీడియో స్టూడియోలను కరోనా క్లోజ్ చేయించింది. ఫొటో, వీడియో గ్రాఫర్ల కష్టాలు.. వారి ఆవేదనకు ‘సాక్షి’ అక్షర రూపం. చీపురుపల్లి/ఎస్.కోట రూరల్: హలో మాస్టారు... ఏమండీ... ఒక్కసారి ఇటు చూడండి... స్మైల్ ప్లీజ్ అంటూ క్లిక్ మనిపిస్తూ పది కాలాలు పాటు గుర్తుండిపోయే జ్ఞాపకాలు అందించే ఫొటో, వీడియో గ్రాఫర్లకు కరోనా కోలుకోలేని దెబ్బతీసింది. వివాహం, రిసెప్షన్, జన్మదినోత్సవం, రజస్వల కార్యక్రమం, పదవీ విరమణ, పాఠశాల వార్షికోత్సవం, పండగ ఇలా ఏదైనా సరే ప్రస్తుత రోజుల్లో ఫొటోలు, వీడియో తప్పనిసరి. మార్కెట్లోకి మొబై ల్స్, చేతి కెమేరాలు అందుబాటులోకి వచ్చినా ఫొటోగ్రాఫర్లు, వీడియోలకు గిరాకీ తగ్గలేదు. అయితే, మార్చి నెలలో ప్రారంభమైన కరోనా మహమ్మారి వారి జీవితాలను దయనీయంగా మార్చింది. నాలుగు నెలలుగా శుభ కార్యాలు లేకపోవడంతో కెమేరాలకు పనికరువైంది. స్టూడియోల్లో పని చేస్తున్న వర్కర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టూడియోల అద్దెలు, మంత్లీ వాయిదాలు, వర్కర్లకు జీతాలు చెల్లించలేక నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఉన్న దాదాపు 7 వేల మంది ఫొటోగ్రాఫర్లు, మరో 5 వేల మంది వర్కర్లు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కరోనాతో కనీస ఆదాయం లేక అవస్థలు పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర ఫొటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు సోమవారం రాష్ట్రంతో బాటు జిల్లా వ్యాప్తంగా శాంతి ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 5 వేల స్టూడియోలు... జిల్లా కేంద్రమైన విజయనగరంతో పాటు మిగిలిన 33 మండలాల్లో ఫొటో, వీడియో గ్రాఫర్లు సంక్షేమ సంఘం లెక్కలు ప్రకారం 5 వేల స్టూడియోలు ఉన్నాయి. అందులో 7 వేల మంది ఫొటోగ్రాఫర్లు, మరో 5 వేల మంది వర్కర్లు పని చేస్తున్నట్టు సమాచారం. మార్చి 24 నుంచి ఏర్పడిన లాక్డౌన్ కారణంగా అంతవరకు జరగాల్సిన పెళ్లిల్లు తాత్కాలికంగా నిలిచిపోవడంతో ఉన్న బుకింగ్‌లు అన్నీ రద్దయ్యాయి. దీంతో వేలాది మందికి పని లేకపోవడంతో వారిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. అప్పటికే ఉన్న బుకింగ్‌లు రద్దవ్వడం, కొత్త కార్యక్రమాలు లేకపోవడం, దాదాపు నెలన్నర వరకు లాక్డౌన్ ఉండడంతో ఫొటో స్టూడియోలు తెరుచుకోని పరిస్థితి ఏర్పడింది. కరోనా కష్టాలు తెచ్చింది.. కరోనా వైరస్ పుణ్యమాని జిల్లాలో ఫొటో, వీడియో గ్రాఫర్లకు తీవ్ర కష్టాలు ఏర్పడ్డాయి. లాక్డౌన్ కారణంగా మొత్తం వ్యాపారం మూతపడింది. ఎప్పటికి కోలుకుంటుందో తెలియని పరిస్థితి. – అరవింద్, కార్యదర్శి, జిల్లా ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్, విజయనగరం ప్రభుత్వం సాయమందించాలి... ఫొటో, వీడియో గ్రాఫర్లకు పనులు లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. నాలుగు నెలలుగా స్టూడియో తెరుచుకోక, అవుట్డోర్ బుకింగ్‌లు లేక అవస్థలు ఎదుర్కొంటున్నాం. మాతో పాటు స్టూడియోల్లో పని చేస్తున్న వర్కర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. – మల్లెంపూడి నర్శింగరావు, చందు ఫొటో స్టూడియో, చీపురుపలి కష్టాలు నుంచి గట్టెక్కించాలి.... లాక్‌డౌన్‌తో నాలుగు నెలలుగా పని లేదు. ఆర్థికంగా కుదేలయ్యాం. అద్దెలు చెల్లించలేక, వాయిదాలు కట్టలేక, ఇంటి నిర్వహణ భారమై చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితి ఎన్నడూ చూడలేదు. ప్రభుత్వం తమను ఆదుకోవాలి. – లాభాన శ్రీను, సీనియర్ ఫొటోగ్రాఫర్, గర్భాం, మెరకముడిదాం రూ.70 కోట్ల వ్యాపారం నష్టం సీజన్లో జరిగే వివాహాలు, గృహప్రవేశాలు, ప్రారం¿ోత్సవ కార్యక్రమాలకు ఫొటోలు, వీడియోలు, ఆల్బమ్‌ల ద్వారా జిల్లాలో రూ.70 కోట్ల వ్యాపారాన్ని స్టూడియో, ల్యాబ్ నిర్వాహకులు కోల్పోయారు. కరోనాతో కేవలం 50 మందితోనే వివాహ వేడుకలను జరుపుకోవాలనే నిబంధనలు విధించడంతో ఫొటోలు తీయించుకునేవారు కరువయ్యారు. విద్యాసంస్థలు పూర్తిగా మూతపడడంతో పాస్‌ఫొటోలు అడిగేవారు కనిపించడం లేదు. ప్రస్తుతం కొద్దిపాటి సడలింపులతో అక్కడక్కడ అతి తక్కువ మందితో వివాహాలు, ఇతర వేడుకలు జరుగుతున్నా ఫొటోగ్రాఫర్లు, హంగూఆర్భాటం లేకుండా తంతును జరిపించేస్తున్నారు. దీంతో స్టూడియోలకు అద్దెలు, కరెంట్ బిల్లులు సైతం కట్టలేని దుస్థితిలో ఫోటోగ్రాఫర్లు కాలం వెళ్లదీస్తున్నారు. -
ఓటమి ఒప్పుకోలేదు... ఓరిమి వదులుకోలేదు!
జీవితంలోని ఫెయిల్యూర్స్‌లో పెయిన్ ఎంత ఎక్కువ స్థాయిలో ఉంటే సక్సెస్‌లో అంత మజా ఉంటుంది. ఎదిగిన స్థాయి నుంచి ఎదిగి వచ్చిన స్థాయి వైపు చూసుకొంటే ఎదుగుదల విలువ ఏమిటో అర్థం అవుతుంది. ఢిల్లీ వీధుల చెత్తలోంచి చిత్తు కాగితాలను ఏరుకొంటూ గడిపిన కుర్రాడు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి ఫొటో గ్రాఫర్ అయ్యాడు! అతడు తీసే చిత్రాలు అంతర్జాతీయ స్థాయి అద్భుతాలవుతున్నాయి. అతడి ఫొటోలే కాదు అతడి సక్సెస్ స్టోరీ కూడా ఒక అద్భుతమే... ‘‘నా జీవితం ఎందుకింత దారుణంగా ఉంది, ఎవరైనా డబ్బులిస్తే బావుండు. ఎవరైనా నన్ను పెంచుకొంటే బావుండు, అన్ని సౌకర్యాలూ సమకూరిస్తే బావుండు.. ’’ అని అనుకొనే వాడట విక్కీ ... ఢిల్లీ రోడ్లమీద స్ట్రీట్ చైల్డ్‌గా తిరుగుతున్న రోజుల్లో. అయితే జీవితం అనేది ఒక రాత్రిలో మారిపోదు, ఎవరి జీవితానికీ మ్యాజికల్ టచ్ ఉండదు అని అతి తొందరలోనే అర్థం చేసుకొన్నాడు. ఎవరి జ్ఞానబోధ లేకుండానే ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నాడు. అందులోని కష్టనష్టాలను అర్థం చేసుకొని, ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకొని అహోరాత్రులూ కష్టపడి తను అనుకొన్న లక్ష్యాన్ని సాధించాడు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన విక్కీ తన జీవితంలోని చీకటి గురించి మరిచిపోలేదు. పదిమంది చెప్పుకోదగిన స్థాయికి ఎదిగినా కూడా అహంకారాన్ని, ఆర్భాటాన్ని దరి చేరనివ్వలేదు. అందుకే ఇతడు విజేతగానూ స్ఫూర్తిమంతుడే, వ్యక్తిగానూ స్ఫూర్తిమంతుడే! కోల్‌కతాలోని తాతయ్య ఇంట్లో ఉండేవాడు విక్కీరాయ్. ఆ ఇంట్లో పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉండేవి. ఇంట్లో హింసను తట్టుకోలేక 11 యేళ్ల వయసులో మామయ్య జేబులోని డబ్బును కాజేసి ఢిల్లీ రెలైక్కేశాడు. అక్కడ నుంచి విక్కీ జీవితం కొత్త మలుపు తీసుకొంది. ఢిల్లీలో ఇతడిని రోడ్ల మీద చూసి ఎవరో ‘సలాం బాలక్ ట్రస్ట్’లో చేర్చారు. అయితే అక్కడ పరిస్థితులు ఏ మాత్రం నచ్చలేదు విక్కీకి. అక్కడ నుంచి పారిపోయి మళ్లీ రోడ్ల మీదికి వచ్చిపడ్డాడు. పనిదొరికితే పనిచేయడం... లేకపోతే చెత్త ఏరి నాలుగైదు రూపాయలు సంపాదించుకోవడం. అప్పటికి అదే జీవితం అనుకొన్నాడు. అయితే క్రమంగా తనలో ఒక ఆత్మవిమర్శ. జీవితం ఎటుపోతోందో అర్థం కావడం లేదనే భావన. ఆ భావన నుంచి కొన్ని పగటి కలలు, ఆశలు పుట్టుకొచ్చాయి. ఉన్నట్టుండి తన స్థితిగతులను ఎవరైనా మార్చేస్తే బావుండననే ఆశ కలిగింది. అయితే అది సాధ్యం కాదని చాలా త్వరగా అర్థం చేసుకొన్న విక్కీ తిరిగి ‘బాలక్ ట్రస్’్టలో చేరిపోయాడు. ఈసారి అక్కడ పరిస్థితులు చాలా కొత్తగా కనిపించాయి. ఇష్టంగా మారాయి. ఎందుకంటే ఏదో ఒకటి సాధించాలనే తపన మొదలైందప్పటికే. ఆ బాలక్ట్రస్ట్కు అనేక మంది వ్యక్తులు వచ్చేవారు. అక్కడి పిల్లలకు వివిధ విషయాల గురించి చెప్పేవారు. అలా ఒక విదేశీ ఫొటోగ్రాఫర్ బాలక్ ట్రస్ట్‌కు వచ్చాడు. అతడి చేతిలోని కెమెరాను చూడగానే విక్కీ కళ్లు మెరిశాయి. ఫొటోగ్రఫీ మీద ఆసక్తి పెంచుకొన్నాడు. దాన్నే కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకొన్నాడు. ‘బాలక్ ట్రస్ట్’లో ఉండగానే ఆ ఇంగ్లిష్ ఫొటోగ్రాఫర్‌కు సహాయకుడిగా మారాడు. భాషతో ఎంతో ఇబ్బంది వచ్చింది. అతడు చెప్పే మాటలేవీ విక్కీకి అర్థం అయ్యేవి కాదు. అయితే ఇంగ్లిష్ రాకపోయినా ఫొటోగ్రఫీలో రాణించవచ్చనే విషయాన్ని అర్థం చేసుకొన్నాడు. మెలకువలు నేర్చుకొని బాలక్ట్రస్ట్లోనే లోన్ తీసుకొని సొంతంగా కెమెరాను కొనుగోలు చేశాడు. ఆ కెమెరాతో విక్కీ చేసిన తొలి ప్రయత్నమే ‘స్ట్రీట్ డ్రీమ్స్’ ప్రాజెక్ట్. అనాథ ఆశ్రమంలో ఉండే యువకుల జీవితాన్ని తన ఫొటోలతో కళ్లకు కట్టాడు విక్కీ. అతడి ఫొటోల్లోని ఫీల్, టైమింగ్ అందరినీ ఆకట్టుకొన్నాయి. తాను అనుభవించిన స్ట్రీట్ చిల్డ్రన్ జీవితాన్ని ఫొటోల రూపంలో చూపాడు. ఆ ప్రాజెక్ట్‌కు చాలా మంచి పేరొచ్చింది. విక్కీ నేపథ్యం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా తీసిన ఫొటోలే విక్కీ జీవితానికి, విజయానికి ప్రతిరూపాలయ్యాయి. ‘జీవితంలో మరీ గొప్ప వాడినైపోవాలి’ అనే లక్ష్యమేదీ లేదని అంటున్నాడు విక్కీ. తన జీవితంలో ఇప్పటికే చాలా మార్పు వచ్చిందని, ఇప్పుడు వచ్చిన గుర్తింపుతో లభించిన మధ్యతరగతి జీవితాన్నే తాను ఆస్వాదిస్తున్నానని అంటూ విక్కీ తన సింప్లిసిటీను చాటుకున్నాడు. ఆ కెమెరాతో విక్కీ చేసిన తొలి ప్రయత్నమే ‘స్ట్రీట్ డ్రీమ్స్’ ప్రాజెక్ట్. అనాథాశ్రమంలో ఉండే యువకుల జీవితాన్ని తన ఫొటోలతో కళ్లకు కట్టాడు విక్కీ. అతడి ఫొటోల్లోని ఫీల్, టైమింగ్ అందరినీ ఆకట్టుకొన్నాయి. తాను అనుభవించిన స్ట్రీట్ చిల్డ్రన్ జీవితాన్ని ఫొటోల రూపంలో చూపాడు విక్కీ. ఆ ప్రాజెక్ట్‌కు చాలా మంచి పేరొచ్చింది.