స్మైల్‌ ప్లీజ్‌‌.. కరోనాతో క్లోజ్‌..! | Corona Effect On Photo And Video Graphers | Sakshi
Sakshi News home page

స్మైల్‌ ప్లీజ్‌‌.. కరోనాతో క్లోజ్‌..!

Published Mon, Jun 29 2020 12:25 PM | Last Updated on Mon, Jun 29 2020 12:27 PM

Corona Effect On Photo And Video Graphers - Sakshi

ధర్మవరంలో మూతపడిన ఎస్‌ఎంఎస్‌ ఫొటోస్టూడియో - పనిలేక స్టూడియోలో ఖాళీగా కూర్చున్న ఫొటోగ్రాఫర్లు

కరోనా... ప్రపంచాన్నే కకావికలం చేస్తోంది. ఉద్యోగాలను ఊడదీస్తోంది. బతుకులను ఛిద్రం చేస్తోంది. జీవనాన్ని ప్రశ్నార్థకంగా మార్చుతోంది. కారి్మకులు, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, రైతులపై ప్రభావం చూపిన కరోనా.. ఫొటో, వీడియో గ్రాఫర్లకూ పనిలేకుండా చేసింది. మూడు నెలలుగా కెమెరాకు ‘క్లిక్‌’ను దూరం చేసింది. వారి కుటుంబాల్లో ఆకలి కేకలు పుట్టిస్తోంది. స్మైల్‌  ప్లీజ్‌ అంటూ సందడిగా కనిపించే ఫొటో, వీడియో స్టూడియోలను కరోనా క్లోజ్‌ చేయించింది. ఫొటో, వీడియో గ్రాఫర్ల కష్టాలు.. వారి ఆవేదనకు ‘సాక్షి’ అక్షర రూపం.

చీపురుపల్లి/ఎస్‌.కోట రూరల్‌: హలో మాస్టారు... ఏమండీ... ఒక్కసారి ఇటు చూడండి... స్మైల్‌ ప్లీజ్‌ అంటూ క్లిక్‌ మనిపిస్తూ పది కాలాలు పాటు గుర్తుండిపోయే జ్ఞాపకాలు అందించే ఫొటో, వీడియో గ్రాఫర్లకు కరోనా కోలుకోలేని దెబ్బతీసింది. వివాహం, రిసెప్షన్, జన్మదినోత్సవం, రజస్వల కార్యక్రమం, పదవీ విరమణ, పాఠశాల వార్షికోత్సవం, పండగ ఇలా ఏదైనా సరే ప్రస్తుత రోజుల్లో ఫొటోలు, వీడియో తప్పనిసరి. మార్కెట్‌లోకి మొబై ల్స్, చేతి కెమేరాలు అందుబాటులోకి వచ్చినా ఫొటోగ్రాఫర్లు, వీడియోలకు గిరాకీ తగ్గలేదు. అయితే, మార్చి నెలలో ప్రారంభమైన కరోనా మహమ్మారి వారి జీవితాలను దయనీయంగా మార్చింది. నాలుగు నెలలుగా శుభ కార్యాలు లేకపోవడంతో కెమేరాలకు పనికరువైంది. స్టూడియోల్లో పని చేస్తున్న వర్కర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టూడియోల అద్దెలు, మంత్లీ వాయిదాలు, వర్కర్లకు జీతాలు చెల్లించలేక నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఉన్న దాదాపు 7 వేల మంది ఫొటోగ్రాఫర్లు, మరో 5 వేల మంది వర్కర్లు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కరోనాతో కనీస ఆదాయం లేక అవస్థలు పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర ఫొటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు సోమవారం రాష్ట్రంతో బాటు జిల్లా వ్యాప్తంగా శాంతి ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.  

జిల్లాలో 5 వేల స్టూడియోలు...  
జిల్లా కేంద్రమైన విజయనగరంతో పాటు మిగిలిన 33 మండలాల్లో ఫొటో, వీడియో గ్రాఫర్లు సంక్షేమ సంఘం లెక్కలు ప్రకారం 5 వేల స్టూడియోలు ఉన్నాయి. అందులో 7 వేల మంది ఫొటోగ్రాఫర్లు, మరో 5 వేల మంది వర్కర్లు పని చేస్తున్నట్టు సమాచారం. మార్చి 24 నుంచి ఏర్పడిన లాక్‌డౌన్‌ కారణంగా అంతవరకు జరగాల్సిన పెళ్లిల్లు తాత్కాలికంగా నిలిచిపోవడంతో ఉన్న బుకింగ్‌లు అన్నీ రద్దయ్యాయి. దీంతో వేలాది మందికి పని లేకపోవడంతో వారిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. అప్పటికే ఉన్న బుకింగ్‌లు రద్దవ్వడం, కొత్త కార్యక్రమాలు లేకపోవడం, దాదాపు నెలన్నర వరకు లాక్‌డౌన్‌ ఉండడంతో ఫొటో స్టూడియోలు తెరుచుకోని పరిస్థితి ఏర్పడింది.  

 కరోనా కష్టాలు తెచ్చింది..  
కరోనా వైరస్‌ పుణ్యమాని జిల్లాలో ఫొటో, వీడియో గ్రాఫర్లకు తీవ్ర కష్టాలు ఏర్పడ్డాయి. లాక్‌డౌన్‌ కారణంగా మొత్తం వ్యాపారం మూతపడింది. ఎప్పటికి కోలుకుంటుందో తెలియని పరిస్థితి. 
– అరవింద్, కార్యదర్శి, జిల్లా ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్, విజయనగరం

 ప్రభుత్వం సాయమందించాలి... 
ఫొటో, వీడియో గ్రాఫర్లకు పనులు లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. నాలుగు నెలలుగా స్టూడియో తెరుచుకోక, అవుట్‌డోర్‌ బుకింగ్‌లు లేక అవస్థలు ఎదుర్కొంటున్నాం. మాతో పాటు స్టూడియోల్లో పని చేస్తున్న వర్కర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. 
– మల్లెంపూడి నర్శింగరావు, చందు ఫొటో స్టూడియో, చీపురుపలి

కష్టాలు నుంచి గట్టెక్కించాలి.... 
లాక్‌డౌన్‌తో నాలుగు నెలలుగా పని లేదు. ఆర్థికంగా కుదేలయ్యాం. అద్దెలు చెల్లించలేక, వాయిదాలు కట్టలేక, ఇంటి నిర్వహణ భారమై చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితి ఎన్నడూ చూడలేదు. ప్రభుత్వం తమను ఆదుకోవాలి. 
– లాభాన శ్రీను, సీనియర్‌ ఫొటోగ్రాఫర్, గర్భాం, మెరకముడిదాం

రూ.70 కోట్ల వ్యాపారం నష్టం  
సీజన్‌లో జరిగే వివాహాలు, గృహప్రవేశాలు, ప్రారం¿ోత్సవ కార్యక్రమాలకు ఫొటోలు, వీడియోలు, ఆల్బమ్‌ల ద్వారా జిల్లాలో రూ.70 కోట్ల వ్యాపారాన్ని స్టూడియో, ల్యాబ్‌ నిర్వాహకులు కోల్పోయారు. కరోనాతో కేవలం 50 మందితోనే వివాహ వేడుకలను జరుపుకోవాలనే నిబంధనలు విధించడంతో ఫొటోలు తీయించుకునేవారు కరువయ్యారు. విద్యాసంస్థలు పూర్తిగా మూతపడడంతో పాస్‌ఫొటోలు అడిగేవారు కనిపించడం లేదు. ప్రస్తుతం కొద్దిపాటి సడలింపులతో అక్కడక్కడ అతి తక్కువ మందితో వివాహాలు, ఇతర వేడుకలు జరుగుతున్నా ఫొటోగ్రాఫర్లు, హంగూఆర్భాటం లేకుండా తంతును జరిపించేస్తున్నారు. దీంతో స్టూడియోలకు అద్దెలు, కరెంట్‌ బిల్లులు సైతం కట్టలేని దుస్థితిలో ఫోటోగ్రాఫర్లు కాలం వెళ్లదీస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement