కలెక్టరేట్, న్యూస్‌లైన్: సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు చేరినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. వివిధ శాఖల పరిధిలోని పథకాల అమలు తీరుపై మంగళవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో అధికారులకు ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పథకాల విజయవంతం కోసం జిల్లా, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రధానంగా విద్య, సన్నిహిత, మార్పు, వ్యక్తిగత మరుగుదొడ్ల కార్యక్రమాల తీరుపై కలెక్టర్, జేసీ శరత్, ఏజేసీ మూర్తి, సంబంధిత శాఖల అధికారులు, ఆయా పథకాల లక్ష్యాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
టెన్త్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలి
జిల్లా వ్యాప్తంగా 556 ఉన్నత పాఠశాలల్లో 277 రెడ్, 243 ఎల్లో గ్రేడింగ్‌లో ఉన్నాయని, ఆయా పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి గత ఏడాది కన్నా మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గణితం, ఇంగ్లిష్, సామాన్య శాస్త్రంలో విద్యార్థులు వెనుకబడి ఉన్నారని, ఆయా పాఠ్యాంశాల్లో మెరుగైన ఫలితాలకు వ్యక్తిగత శ్రద్ధతో కృషి చేయాలని సూచించారు. వసతి గృహాల్లో మెరుగైన వసతులతో పాటు నాణ్యతతో కూడిన మెనూను అమలు చేసేందుకు సన్నిహిత కార్యక్రమం పేరిట దత్తత అధికారులను నియమించామన్నారు. వారంతా ఈనెల 15వ తేదీలోగా ఆయా వసతి గృహాలను సందర్శించి 15లోగా నివేదికను సాంఘిక సంక్షేమాధికారికి అందజేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో బాలల ఆరోగ్య పరీక్షలు ఇంకా పూర్తి కాలేదని, స్థానిక వైద్యాధికారులతో కలిసి విద్యార్థుల ఆరోగ్య సమస్యలను నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సమన్వయంతో ‘మార్పు’ను సాధించాలి
ఐసీడీఎస్, ఐకేపీ, ఆర్‌డబ్ల్యూఎస్, మెప్మా, డీఎంహెచ్‌ఓ శాఖల సమన్వయంతో జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాల సంఖ్యను పెంచడంతో పాటు మాతాశిశు మరణాల రేటును తగ్గించాలని కలెక్టర్ సూచించారు. గర్భిణుల గుర్తింపు, వైద్య పరీక్షలు, హైరిస్కు గర్భిణులను గుర్తించడం, పౌష్టికాహార పంపిణీ తదితర అంశాలపై గ్రామైక్య సంఘాలతో విధిగా చర్చించి, ఆయా సమావేశాలకు ఏఎన్‌ఎంలు హాజరయ్యేలా చూడాలన్నారు. విధిగా పీహెచ్‌సీ కేంద్రాలను తనిఖీ చేసి నిర్దేశించిన జాబితా ప్రకారం ఈనెల 15లోగా నివేదిక అందజేయాలన్నారు. వసతి గృహాల్లో స్కైప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని ఎంపీడీఓలకు సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను కూడా జనవరి చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
బీఆర్‌జీఎఫ్ పనుల జాప్యంపై ఆగ్రహం
డివిజన్ స్థాయిలోన బీఆర్‌జీఎఫ్ పనులపై సమీక్ష నిర్వహించినా సంబంధిత పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈలు పూర్తి స్థాయి సమాచారంతో హాజరుకాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2011-12కు సంబంధించి పనులను జనవరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటరు నమోదులో సిద్దిపేట డివిజన్‌లో 1751 మంది విద్యార్థులు నూతనంగా నమోదయ్యారని, వీరికి వెంటనే కార్డులు జారీ చేస్తామని శరత్ తెలిపారు.
లబ్ధిదారుల వద్దకే పింఛన్లు
సామాజిక భద్రతా పింఛన్లు ఇకపై నిర్దేశిత సమయంలో నేరుగా లబ్దిదారుల వద్దకు వెళ్లి పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఏజెన్సీలను కలెక్టర్‌ఆదేశించారు. 500 మంది లబ్దిదారులకు ఒకరు చొప్పున సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతినెలా 2 నుంచి 7వ తేదీ వరకు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని అన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ పద్మ, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, సీపీఓ గురుమూర్తి, ఆర్డీఓలు ధర్మారావు, వనజాదేవి, ముత్యంరెడ్డి పాల్గొన్నారు.
సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి
Published Wed, Dec 4 2013 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM
Advertisement
Advertisement