సంక్షేమంలో వెనుకబాటు!
Published Wed, Jan 8 2014 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM
వారంతా ఆర్థికంగా... సామాజికంగా వెనుకబడిన వారు. చేయూతనందిస్తే తమకాళ్లపై తాము నిలబడి, మరికొందరికి ఉపాధి కల్పించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ కొద్దిపాటి సాయం కూడా వారికి కరువుతోంది. పథకాలను అందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. దరఖాస్తు దారులను యాచకులను చూసినట్టు చూస్తున్నారే తప్పా పథకాల మంజూరు తమ బాధ్యత అని ఇటు అధికారులు, అటు ప్రభుత్వం భావించడం లేదు. దీంతో పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు బీసీలు వాటి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సి వస్తోంది. ఎప్పుడు యూనిట్లు మంజూరవుతాయో, తాము ఎప్పుడు ఉపాధి పొందుతామో తెలియక వారు అస్థలు పడుతున్నారు. బీసీ కార్పొరేషన్ అధికారులు గత ఏడాది దరఖాస్తులనే ఇంకా క్లియర్ చేయలేదంటే, ఈ ఏడాది పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వెనుకబడిన తరగతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని చెప్పే సర్కారు ఆచరణలో మాత్రం నాలుగడుగులు వెనక్కే ఉంటోంది. ఈ వర్గాల అభ్యున్నతి కోసం కోట్ల కొద్దీ నిధులు గుమ్మరిస్తున్నామని చెబుతున్నా అదంతా ప్రకటనలు, కాగితాలకే పరిమితమవుతోంది. జిల్లాలోని బీసీ కార్పొరేషన్ పనితీరును గమనిస్తే ఈ విషయంసులువుగా అవగతమవుతోంది. జిల్లాలో అధిక శాతం మంది బీసీలే ఉన్నారు. దీనికితోడు జిల్లాలో పరిశ్రమలూ తక్కువే. దీంతో పెద్ద ఎత్తున యువత హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలసపోవడం సర్వసాధారణమవుతోంది. దీంతో వారిని ఉద్ధరించేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా పలు పథకాలను అందజేయాలన్నది సర్కారు ఆశయం. అయితే పథకాలు జిల్లాలో అమలుకు నోచుకోవడం లేదు.
2012-13 సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 1,843 మందికి స్వయం ఉపాధి కోసం పలు యూనిట్లను అందజేయాలని సర్కారు లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక్కొక్క యూనిట్ ధర రూ.60 వేలుగా నిర్ణయించారు. ఇందులో సగ భాగం బ్యాంకు రుణం ఇవ్వనుండగా మిగతా సగాన్ని సర్కారు సబ్సిడీగా ఇస్తుంది. ఈ మొత్తంతో సదరు లబ్ధిదారుడు మైక్‌సెట్, కిరాణం, జెకాక్స్ దుకాణం, చిన్నపాటి ఫొటో స్టూడి యో వంటి వ్యాపారాలు చేసుకుని స్వయంఉపాధి పొందవచ్చు. అయితే గత ఏడాది ఇందులో కేవలం 1,111 మందికి మాత్ర మే యూనిట్లు మంజూరు చేశా రు. మిగతా 732 మందికి ఇంతవరకూ ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. దీంతో వీరంతా సర్కారు సాయం కోసం ఎదురు చూసి నిరాశకు లోనవుతున్నా రు. పోనీ ఈ ఏడాదైనా పరిస్థితి చక్కదిద్దుతారా? అంటే అదీ అనుమానంగానే ఉంది.
2013-14సంవత్సరంలో ఎన్నికల దృష్ట్యా సర్కారు యూ నిట్ల సంఖ్యను గణనీయంగా 3,795కు పెంచింది. పట్టణ ప్రాం తాల్లో రాజీవ్ అభ్యుదయ్ యోజన కింద మరో 540 యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. అయితే ఈఏడాదికి సం బంధించి ఆయా యూనిట్లకు ఎంత సబ్సిడీ ఇవ్వాలన్న దానిపై సర్కారు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీంతో జిల్లా అధికారులు ఒక్క యూనిట్ కూడా ఇవ్వలేకపోయారు. వాస్తవానికి ఈ యూ నిట్లను ఆగస్టు 15, జనవరి 26, నవంబర్1 వంటి ప్రత్యేక రోజు ల్లో సర్కారు పంపిణీ చేస్తుంది. ఆయా లక్ష్యాలను ఆ ఆర్థిక సంవత్సరం (మార్చి 31)లోపు పూర్తి చేయాలి. అయితే ఈ ఏడాది ఇప్పటివరకూ యూనిట్లను మంజూరు చేయకపోవడంతో బీసీలకు ఆ ఫలాలు అందకుండా పోయాయి. లబ్ధిదారుల ఎంపిక దాదాపు పూర్తయిన నేపథ్యంలో దరఖాస్తుదారులు బీసీ కార్పొరేషన్ చుట్టూ తిరుగుతున్నా అధికారులు ఏమీ చెప్పలేకపోతున్నారు. మరో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగిసిపోతుండడంతో ఇప్పటికిప్పుడు ఇన్ని యూనిట్లను మంజూరు చేయడమూ సాధ్యం కాదని అధికారులే చెబుతున్నారు.
ఏడాదిగా ఇన్‌చార్జి పాలనే...
ఇదిలా ఉండగా దాదాపు 11 నెలలుగా బీసీ కార్పొరేషన్‌కు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ఈడీ) లేరు. దీంతో ఈ విభాగాన్ని అటవీ సెటిల్మెంట్ అధికారి శోభ.. ఇన్‌చార్జి హోదాలో పర్యవేక్షిస్తున్నారు. గతంలో దుర్గారాజశేఖర్ కార్పొరేషన్ ఈడీగా పని చేశారు. అయితే ఆయన్ను అప్పటి కలెక్టర్ వీరబ్రహ్మయ్య.. సర్కారుకు సరెండర్ చేయడంతో అప్పట్నుంచీ ఈ పోస్టును శోభ చూస్తున్నారు. ఈమెకు ఇది అదనపు బాధ్యత కావడంతో ఆమె పూర్తిస్థాయిలో పనిచేయలేని పరిస్థితి ఎదురవుతోంది.
గత ఏడాది దరఖాస్తులను క్లియర్ చేస్తున్నాం...
గత ఏడాది పూర్తిస్థాయిలో యూనిట్లు మంజూరు చేయలేకపోయాం. వీటిని ఇప్పుడు క్లియర్ చేయాలని భావిస్తున్నాం. సర్కారు నుంచి సబ్సిడీ విషయమై ఓ స్పష్టత వస్తే యూనిట్ల మంజూరు ప్రక్రియ వేగవంతం చేస్తాం.
- శోభ, ఇన్‌చార్జి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్
Advertisement
Advertisement