పది రోజుల్లోనే పింఛన్‌ కార్డు: సీఎం జగన్‌ | Welfare Schemes For Everyone In Saturated Manner: CM Jagan | Sakshi
Sakshi News home page

కొత్త ఒరవడికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం

Published Tue, Jun 9 2020 12:25 PM | Last Updated on Tue, Jun 9 2020 1:54 PM

Welfare Schemes For Everyone In Saturated Manner: CM Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి: సంక్షేమ పథకాల అమల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ సేవలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. సంతృప్థ స్థాయిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం పేర్కొన్నారు. దరఖాస్తు చేసిన పది రోజుల్లోనే బియ్యం కార్డు, పది రోజుల్లో పింఛన్‌ కార్డు, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు అందిస్తామని ఆయన వెల్లడించారు. 44 లక్షల నుంచి 58 లక్షలకుపైగా పెన్షన్లు పెంచామని గుర్తు చేశారు. అర్హులకు రూ.2,250 పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. అవినీతి లేని వ్యవస్థను తీసుకొచ్చామని సీఎం వైఎస్‌ జగన్‌ ఉద్ఘాటించారు. పథకాల అమలుకు సంబంధించి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆయన సూచించారు. అనంతరం స్పందన కార్యక్రమంపై కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.(ఎండిన గొంతులు తడిపేందుకే..)


ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలి. అర్హత వివరాలు, దరఖాస్తు చేసుకునే సమాచారం కూడా అందించాలి. వచ్చిన దరఖాస్తును గడువులోగా వెరిఫికేషన్‌ చేయాలి. లబ్దిదారులకు బియ్యం కార్డులు, పింఛను కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులను డోర్‌ డెలివరీ చేయాలి. బయెమెట్రిక్‌ అక్నాలెడ్జ్‌మెంట్‌ తీసుకోవాలి. నిర్ణీత సమయంలోగా ఆ సేవలు అందించలేకపోతే వారికి పరిహారంకూడా చెల్లిస్తాం. కలెక్టర్లు, జేసీల పనితీరు దీనిపై ఆధారపడి ఉంటుంది’అని పేర్కొన్నారు. కాగా, ఇళ్ల నిర్మాణం కోసం ఎవరైనా మిగిలిపోతే అప్లికేషన్లు పెట్టమని చెప్పామని అధికారులు సీఎంకు తెలిపారు. వాటి పరిశీలన కూడా పూర్తవుతోందని అన్నారు. 

ఇప్పటివరకూ 30.3 లక్షల మందిని లబ్ధిదారులుగా గుర్తించామని అధికారులు చెప్పారు. జూన్‌ 12 కల్లా లబ్దిదారుల తుది జాబితాను ప్రదర్శించాలని సీఎం తెలిపారు. జూన్‌ 15 కల్లా పాత లబ్దిదారులకు సంబంధించి ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు అవసరమైన కార్యక్రమాలు పూర్తిచేయాలని అన్నారు. జూన్‌ 30 కల్లా కొత్త లబ్ధిదారులకు సంబంధించి ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు అవసరమైన కార్యక్రమాలు పూర్తిచేయాలని సీఎం చెప్పారు.

ఏవైనా సమస్యలు ఉంటే కచ్చితంగా ప్లాన్‌ బి ఉండాలని సీఎం సూచించారు. జూన్‌ 15 కల్లా ప్లాన్‌ బి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పారు. జులై 8 నాటికి ఇళ్లపట్టాలు ఇవ్వాలని సీఎం అన్నారు. సంతృప్త స్థాయిలో ఇళ్లపట్టాలు, ఇళ్లు ఇవ్వబోతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రతి కలెక్టర్‌ను ప్రజలు గుర్తుపెట్టుకుంటారని సీఎం వ్యాఖ్యానించారు.. చివరి దశకు వచ్చామని కొత్త అప్లికేషన్లు వచ్చినప్పటికీ అదే ఉత్సాహంతో ఇళ్లపట్టాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేయాలని అన్నారు. ఇళ్లపట్టాల కార్యక్రమం చిరస్మరణీయంగా నిలిచిపోతుందని సీఎం పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement