తాను ఢిల్లీ వెళ్లిన మాట వాస్తవమే గానీ... అక్కడ ఎవరినీ కలవలేదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ తెలిపారు. కోదండరామ్తో పాటు జేఏసీకి చెందిన మరో మరో ముఖ్యనేత శ్రీనివాస్గౌడ్ రహస్యంగా ఢిల్లీ వెళ్లి రావడం పలు అనుమానాలకు తావిచ్చింది. వీరిద్దరూ అక్కడ ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో భేటీ అయినట్లు తొలుత కథనాలు వచ్చాయి. ఉద్యమాన్ని పార్టీలకు అతీతంగా ముందుకు తీసుకెళ్లిన జేఏసీ ముఖ్యనేతల్ని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం చేసిన ప్రయత్నాల వల్లే వీరిద్దరూ ఢిల్లీ వెళ్లినట్లు తెలియవచ్చింది.
ఈ నేపథ్యంలో, ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్న కోదండరామ్ తదితరులు అత్యవసరంగా తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీని సమావేశపరిచారు. అనంతరం తమ ఢిల్లీ పర్యటనపై వివరణ ఇచ్చారు. జేఏసీలో ఎలాంటి విభేదాలు లేవని, తాము ఢిల్లీలో ఆంటోనీ, దిగ్విజయ్‌సింగ్‌లను కలిసినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు.
మరోవైపు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో ఉధృతంగా ఉద్యమం సాగుతుండటంతో తెలంగాణ ప్రాంతంలోనూ కదలిక తేవాలని నిర్ణయించారు. ఇందుకోసం ఈ నెల 19 నుంచి వారం రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్కు వేదికగా ఈ సద్భావనా దీక్షలు నిర్వహిస్తారు. తాము ఆంటోనీ కమిటీని కలిసే ప్రసక్తే లేదని, హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణను వెంటనే ఏర్పాటు చేయాలని కోదండరామ్ అన్నారు. తెలంగాణపై క్యాబినెట్‌లో తీర్మానం చేసి, ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఢిల్లీ వెళ్లాను గానీ.. ఎవరినీ కలవలేదు: కోదండరామ్
Published Sat, Aug 17 2013 8:19 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
Advertisement