సాక్షి, గుంటూరు: సమన్యాయం చేయకుండా రాష్ట్రాన్ని విడగొట్టే అధికారాన్ని, హక్కుల్ని తన చేతుల్లోకి తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరు వేదికగా చేపట్టిన సమరదీక్షకు పశ్చిమగోదావరి జిల్లా పార్టీ నేతలు సంఘీభావం ప్రకటించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు నేతృత్వంలో గుంటూరుకు గురువారం తరలివచ్చి విజయమ్మ దీక్షకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా దీక్షా వేదికపై నుంచి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని సోనియాగాంధీ కాళ్ల వద్ద పరిచిన రెండు కళ్ల సిద్ధాంతిని ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు.
ప్రస్తుతం రాష్ట్రం ఈ దుస్థితికి చేరడానికి కారకులెవరో అందరికీ తెలుసునని చెప్పారు. ఈ విపత్తును ముందుగా పసిగట్టి రాజీనామాలు చేసింది వైఎస్సార్ సీపీ ప్రజాప్రతి నిధులేనని అన్నారు. రాష్ట్రానికి గోడలు కట్టే హక్కు, అధికారం కాంగ్రెస్ పెద్దలకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను యూటీలా కాకుండా ఢిల్లీ తరహా పాలన చేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నేతల్ని ప్రజలు క్షమించరన్నారు. షర్మిల పాదయాత్రకు ‘వస్తున్నాయ్ రథచక్రాలు’ అనే పాట రాయించిన పాలకొల్లుకు చెందిన వైఎస్సార్ సీపీ నేత ఆకెన వీరాస్వామి నాయుడు (అబ్బు)ను పార్టీ ముఖ్య నేత వైవీ సుబ్బారెడ్డి షర్మిలకు పరిచయం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట నియోజకవర్గాల సమన్వయకర్తలు తోట గోపి, చీర్ల రాధయ్య, మల్లుల లక్ష్మీనారాయణ, కండెబోయిన శ్రీను తదితరులు వైఎస్ విజయమ్మ, షర్మిలను కలిసి సంఘీభావం తెలిపారు.
విజయమ్మకు ‘పశ్చిమ’ నేతల సంఘీభావం
Published Fri, Aug 23 2013 3:51 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
Advertisement
Advertisement