అధికారులకు అదే భయం! | West Godavari This week roundup | Sakshi
Sakshi News home page

అధికారులకు అదే భయం!

Published Sun, Jan 25 2015 1:24 AM | Last Updated on Sat, Jul 28 2018 4:52 PM

West Godavari This week roundup

ప్రశాంత ‘పశ్చిమ’లో హాయిగా పనిచేసుకోవచ్చన్న మాట ఇప్పుడు అధికారులు మర్చిపోవాల్సిసిందే. టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టడంలో కీలకంగా వ్యవహరించిన పశ్చిమగోదావరి జిల్లాయే తనకు తొలి ప్రాధాన్యమంటూ చీటికీమాటికీ సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చేస్తుం డటం అధికార యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. పైకి చెప్పేందుకు ఎవరూ సాహసించడం లేదు గానీ.. జిల్లా అధికార వర్గాల్లో చాలామంది సీఎం పర్యటన అంటేనే వణికిపోతున్నారు. ఈనెల 1న పోలవరం, ఏలూరు సమీపంలోని చాటపర్రు గ్రామాల్లో పర్యటించిన చంద్రబాబు మూడు వారాలు తిరక్కుండానే పాదయాత్ర పేరిట ఈనెల 18, 19 తేదీల్లో జిల్లాలో రెండు రోజుల పర్యటన చేశారు.
 
 పండగ సెలవులు, సరదాలను పక్కన పెట్టి మరీ అధికారులు, ఉద్యోగులు చేసిన పకడ్బందీ ఏర్పాట్ల మధ్య సీఎం పాదయాత్ర  సాఫీగానే నడిచింది. కానీ.. ఆ పాదయాత్రతో చాలామంది  అధికారుల ఒళ్లు పులిసిపోయింది. చంద్రబాబు 14, 15 కిలోమీటర్లు నడిచినా రూట్ మ్యాప్ సరిగ్గా ఉండేందుకు, బందోబస్తు పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు పోలీస్, రెవెన్యూ అధికారులు అంతకు రెట్టింపు కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. అధికారులు అంత కష్టపడితే.. బాబుకు సంఘీభావంగా నడవాల్సిన టీడీపీ నేతలు మాత్రం లైట్ తీసుకున్నారు.
 
 తన నియోజకవర్గంలోనే సీఎం యాత్ర కాబ ట్టి  నిడదవోలు ఎమ్మెల్యే తప్పించి మిగిలిన ఎమ్మెల్యేలెవరూ కనీసమాత్రం నడవలేదు. పల్లీలు తింటూ ఓ ఎమ్మెల్యే, ఫొటోలకు ఫోజులిస్తూ మరో ఎమ్మెల్యే, కారులో కునుకు తీస్తూ మరొకరు గడిపేశారే గానీ అధినేతతో ఎవరూ పాదం కలపలేదు. అధికారులు మాత్రం సీఎం వెనుక పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఉరుకులు పరుగులు పెట్టిన అధికారులు కాళ్లు బొబ్బలెక్కి రెండు రోజుల పాటు ఇళ్ల నుంచి రాలేకపోయూరు. ఇలా చాలామందికి ఒళ్లు హూనంకాగా, త్వరలోనే సీఎం పర్యటన ఉందన్న సమాచారం అధికారలను కలవరపెడుతోంది. వచ్చే నెలలో జరగనున్న దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కుమారుడి వివాహానికి సీఎం వస్తారని, ఆ సందర్భంగా ప్రభుత్వపరంగా ఏదైనా కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. ‘ఇప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాం.. సీఎం మళ్లీ వస్తారా.. వామ్మో’ అని జిల్లా అధికారులు కంగారు పడిపోతున్నారు.
 
 మాణిక్యం ముచ్చట్ల వెనుక మర్మమేమిటో?
 సీఎం చంద్రబాబును రాష్ట్ర మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అవకాశమొచ్చినప్పుడల్లా తెగ పొగి డేస్తున్నారు. టీడీపీ నేతలకంటే ఎక్కువగా మాణిక్యాలరావు పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు. దీనివెనుక చాలా విషయం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలో జరగనున్న తన కుమారుడి వివాహం నేపథ్యంలో సీఎం రాక కోసం ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకే ఈ పొగడ్తలని కొందరు అం టున్నారు. మరోవైపు రాజకీయ అవసరాల నేపథ్యంలోనూ మాణిక్యాలరావు సీఎంను ప్రసన్నం చేసుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బీజేపీ నేత సోము వీర్రాజుకు త్వరలో ఎమ్మెల్సీ ఇప్పించి మంత్రి వర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన వీర్రాజుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మద్దతు పుష్కలంగా ఉందని, ఎన్నికల సమయంలో నరేంద్రమోడీ వద్దకు పవన్‌ను తీసుకువెళ్లిం ది కూడా ఆయనేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ మార్పుల్లో మాణిక్యాలరావుకు బదులు వీర్రాజుకు అవకాశం కల్పించవచ్చనే ప్రచారం బీజేపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ పరిణామాలతోనే మాణిక్యాలరావు సీఎంకు సన్నిహితంగా ఉంటున్నారనే ప్రచారం సాగుతోంది.
 
 టీడీపీ కండువా సరిచేసిన రెవెన్యూ అధికారి
 అందరూ కాదు కానీ.. కొంతమంది అధికారులు మాత్రం పచ్చచొక్కాలు వేసుకున్న టీడీపీ కార్యకర్తల కంటే ఎక్కువగా హల్‌చల్ చేస్తుంటారు. ఈ బాపతుకే చెందిన ఓ రెవెన్యూ అధికారి ఇటీవల సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ మెడలోని టీడీపీ కండువాను సరి చేశారు. ‘సార్.. అలా కాదు. కండువా సరిగ్గా కనపడేలా వేయండ’ంటూ మడతలు పడిన కండువాను సరి చేసి వెళ్లారు. పోనీలే.. ఆ అధికారి కండువా వేసుకోలేదు కదా అని సర్దుకుంటారా.. అరుుతే ఓకే.
     - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement