
సాక్షి, మొగల్తూరు(పశ్చిమగోదావరి) : జీవనోపాధి కోసం దేశం కాని దేశం వెళ్లిన ఆమె దళారుల వలలో పడింది. కుటుంబానికి ఆసరా కోసమని వెళ్లిన తిండీతిప్పలు లేకుండా గదిలో బంధించి చిత్రహింసలు పెట్టారని బాధితురాలు పులిదిండి నాగలక్ష్మి వాపోయింది. ఈనెల 14న మొగల్తూరుకు చేరుకున్న ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. నాగలక్ష్మిది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. భర్త సురేష్ జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు అమ్మాయిలు, కుమారుడు ఉన్నారు.
రెండు సంవత్సరాల క్రితం మొగల్తూరు మండలం ముత్యాలపల్లికి రాగా రెండు నెలల క్రితం మొగల్తూరుకు మకాం మార్చారు. ఆమెకు గతంలో నర్సుగా పనిచేసిన అనుభవం ఉండటంతో దుబాయ్ వెళ్లే ఆలోచనలో ఉండగా ఇరగవరం మండలం ఓగిడి గ్రామానికి చెందిన దొండి వెంకట సుబ్బారావు, (చినబాబు) పరిచయం అయ్యాడు. దుబాయ్ పంపేందుకు రూ.లక్ష ఖర్చవుతుందనడంతో అంగీకరించి జూలై నెలలో డబ్బులు అందించారు. గత నెల 13న హైదరాబాద్ తీసుకువెళ్లి విమానం ఎక్కించి దిగిన తర్వాత ఆకుమర్తి జ్యోతి అనే ఆమెను కలవమన్నారు. 14న దుబాయ్‌లో దిగిన తరువాత జుల్ఫా అనే ప్రాంతానికి తీసుకువెళ్లారని చెప్పారు.
అక్కడ పాస్‌పోర్టు తీసేసుకుని, తిండి పెట్టకుండా నానాతిప్పలు పెట్టారని నాగలక్ష్మి తెలిపారు. అక్కడికి వెళ్లిన వారిలో వారికి నచ్చితేనే నర్సుగా ఉద్యోగం ఇస్తారని, లేదంటే వ్యభిచార కూపాలకు అమ్మేస్తారని తెలిపారు. వ్యభిచారం చేసేందుకు ఒప్పుకోకపోతే దారుణంగా హింసిస్తారని, తిండి కూడా పెట్టరని తెలిపారు. గత నెల 27న తాను, మరో మహిళ స్థానికంగా ఉన్న వారి సహకారంతో దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నామని నాగలక్ష్మి చెప్పారు. అక్కడ 15 రోజుల పాటు ఉన్నామని, ఈ నెల 10న పాస్‌పోర్టు రావడంతో అధికారులు మన దేశానికి వెనక్కి పంపినట్టు తెలిపారు. 14న మొగల్తూరుకు చేరుకుని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని బాధితురాలు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment