త్యాగానికి ప్రతీక మొహరం | What is the Celebration of Muharram? | Sakshi
Sakshi News home page

త్యాగానికి ప్రతీక మొహరం

Published Tue, Sep 10 2019 8:56 AM | Last Updated on Tue, Sep 10 2019 8:56 AM

What is the Celebration of Muharram? - Sakshi

చిన్నమండెంలో పీర్ల మకాన్‌ వద్ద విద్యుద్దీప కాంతులు

కడప సెవెన్‌రోడ్స్‌/చిన్నమండెం/ కడప కల్చరల్‌ : మొహరం నెలతో ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. శాంతి, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం 14 శతాబ్దాల క్రితం జరిగిన చారిత్రాత్మక పోరాటంలో అసువులు బాసిన అమరుల సంస్మరణే మొహరం. అందుకే దీన్ని ‘షహీద్‌’ మాసంగా పేర్కొంటారు. వాస్తవానికి ఇవి విషాద రోజులైనప్పటికీ తెలుగు నేలలో పీర్ల పండుగగా పిలుస్తారు. మండల కేంద్రమైన చిన్నమండెంలో పీర్ల పండుగ అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తారు. ఇది రాయలసీమలోనే ప్రసిద్ధి గాంచింది. మూడు మకాన్లు ఉన్నప్పటికీ ప్రధానమైనది శ్రీ హజరత్‌ గంధం పీరు  మకాన్‌. అన్ని కార్యక్రమాలకు కేంద్ర బిందువు ఈ మకాన్‌. మొహరం నెలలో మూడవ రోజు శ్రీ హజరత్‌ గంధం పీరు కొలువు తీర్చారు. వివిధ రకాల పుష్పమాలలతో అలంకరించారు. మకాన్‌ వద్ద అలంకరించిన రంగురంగుల విద్యుద్దీపాలు రాత్రి వేళ నక్షత్ర తోరణాల్ని తలపిస్తున్నాయి. మతాలకు అతీతంగా ప్రజలు శ్రీ హజరత్‌ గంధం పీరును దర్శించుకుంటున్నారు. ముజావర్లు చదివింపులు నిర్వహిస్తున్నారు. మకాన్‌ ఎదుట అగ్నిగుండాలు ఏర్పాటు చేశారు.

అనారోగ్య సమస్యలతో బాధపడే పదేళ్లలోపు పిల్లలకు ఆటీలు (తాయత్తులు) కడతారు. ఇందువల్ల అనారోగ్యం బారి నుంచి పిల్లలు బయటపడతారని ఇక్కడి ప్రజల విశ్వాసం. మొహరంలో 9, చివరిదైన పదవరోజు కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవి. బాషికం సమర్పణ, గంధం పీరు మెరవణి తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.

అమీన్‌పీర్‌ దర్గాలో...
కడప నగరంలో రెండు, మూడుచోట్ల మొహరంను ఘనంగా నిర్వహిస్తారు. స్థానిక అమీన్‌పీర్‌ దర్గాలో పీర్ల చావిడి ఉంది. మొహరం నాడు ఈ దర్గాలో హజరత్‌ సయ్యద్‌షా పీరుల్లామాలిక్‌ సాహెబ్‌ ఉరుసుగా నిర్వహిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక ధార్మిక కార్యక్రమాలు, ఫాతెహా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా హజరత్‌ పీరుల్లామాలిక్‌ మజార్‌ ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా ప్రత్యేకంగా తెప్పించే పూలతో అలంకరిస్తారు.

నేడు గంధం పీరు మెరవణి..
మొహరం కార్యక్రమాల్లో చివరిదైన మంగళవారం సాయంత్రం పీర్లను జల్దికి తీసుకు వెళతారు. రాత్రి 10 గంటలకు శ్రీ హజరత్‌ గంధం పీరు మెరవణి ప్రారంభమవుతుంది. ప్రజలు పెద్ద ఎత్తున కొబ్బరి దివిటీలను వెలిగిస్తారు. కాలిన కొబ్బెరను ప్రసాదంగా భావించి ఇళ్లకు తీసుకు వెళతారు. కొబ్బెర ప్రసాదాన్ని తింటే దీర్ఘకాలిక వ్యాధులు నయం కావడంతోపాటు ఇంటిల్లిపాదికి మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం. తెల్లవారుజాము వరకు సాగే ఈ మెరవణి కార్యక్రమం ఆద్యంతం కొబ్బరి దివిటీల వెలుగులోనే కొనసాగుతుంది. ముంబయి, చెన్నై, బెంగుళూరు, హైదరాబాదు వంటి ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఈ కార్యక్రమానికి తరలి వస్తుంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

బాషికంపై నిర్ణయం
మరుసటి సంవత్సరం మొహరంలో గంధం పీరుకు బాషికం ఎవరు సమర్పించాలో ముందే నిర్ణయిస్తారు. ఉత్సవాల్లో పదవ రోజు గంధం పీరు మెరవణి తెల్లవారుజాముకు ముగుస్తుంది. పీరు మకాన్‌లోకి ప్రవేశించే సమయానికి, వచ్చే ఏడు బాషికం సమర్పించుకోవాలని భావించే వారంతా అక్కడ గుమికూడతారు. వచ్చే ఏడు బాషికం ఎవరు సమర్పించాలో గంధం పీరును మోస్తున్న వ్యక్తి నిర్ణయిస్తారు. కడప పెద్దదర్గా పీఠాధిపతులు చిన్నమండెంలో నిర్వహించే మొహరం కార్యక్రమాల్లో ప్రధానమైన బాషిక సమర్పణకు వస్తున్నారని మకాన్‌ కమిటీ సభ్యులు సాక్షికి వివరించారు.  పీఠాధిపతి తన శిష్య బృందంతో కలిసి గంధం పీరుకు చదివింపులు నిర్వహిస్తారు. బాషికం ఊరేగింపు కార్యక్రమాన్ని తిలకించేందుకు రాయలసీమ జిల్లాలతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు.  

కడపలో మట్టి పెద్దపులి..
కడప నగరం రెడ్‌క్రాస్‌ భవనం ఎదురుగా నాలుగు రోడ్ల కూడలిలో గల మట్టిపెద్దపులి విగ్రహానికి ఓ చరిత్ర ఉంది. నగర వాసులు ఈ మట్టి పెద్దపులి విగ్రహాన్ని తరుచూ చూస్తూనే ఉంటారు గానీ దాన్ని అక్కడ ఎందుకు ఏర్పాటు చేస్తారో పెద్దల్లో కొద్దిమందికి మాత్రమే తెలుసు. దీనికి పీర్ల పండుగకు చిన్న సంబంధం ఉంది గనుక ఈ సందర్భంగా  దాని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మట్టి పెద్దపులి విగ్రహం ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు తాలింఖానాలను నిర్వహించేవారు. ఆ చుట్టుపక్కల గల తాలింఖానాలలో ముస్లిం యువకులతోపాటు హిందు యువకులు కూడా వ్యాయామం చేస్తూ కుస్తీలు పట్టడం నేర్చుకునేవారు. వీధులలోగానీ, గ్రామానికి గానీ అరాచక శక్తుల వల్ల ఏదైనా ఆటంకాలు ఎదురైతే తాలింఖానా నిర్వాహకుల సూచనతో యువకులు వెళ్లి అవసరమైతే శారీరక బలం చూపి ఆ సమస్యను పరిష్కరించేవారు.

పులులు లాంటి యువకులు, వారు వ్యాయామం చేసే తాలింఖానాలు ఉండే ప్రదేశం గనుక ఆ రోడ్ల కూడలిలో సాహస యువకులకు గుర్తుగా మట్టితో పెద్ద పులి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అది రోడ్డు విస్తరణలో దెబ్బతినడంతో సిమెంటుతో పులి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల దాన్ని కూడా రోడ్డు విస్తరణలో తొలగించగా, కొద్దిపాటి మరమ్మతులు చేసి గౌస్‌నగర్‌ వద్ద డివైడర్‌లో దాన్ని ఏర్పాటు చేశారు. పాత దాని స్థానంలో కొత్తగా సిమెంటు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాలింఖానాలోని యువకుల ఆధ్వర్యంలో అప్పట్లో పీర్ల పండుగను ఘనంగా నిర్వహించేవారు. మకాన్ల వద్ద నుంచి పీర్లను ఊరేగింపుగా తీసుకెళ్లి తిరిగి వాటిని శుభ్రం చేసి తిరిగి మకాన్లకు చేర్చేవారు. ఊరేగింపులో తాలింఖానాల యువకుల సాహస కృత్యాల ప్రదర్శనలే ప్రధాన ఆకర్శణగా ఉండేవి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement