రిమ్స్ దంతవైద్య కళాశాలలో బీడీఎస్ విద్యార్థి కృష్ణచైతన్య ఆత్మహత్య సంఘటనపై మంగళవారం త్రిసభ్య కమిటీ విచారణ నిర్వహించింది.
కడప అర్బన్, న్యూస్‌లైన్: రిమ్స్ దంతవైద్య కళాశాలలో బీడీఎస్ విద్యార్థి కృష్ణచైతన్య ఆత్మహత్య సంఘటనపై మంగళవారం త్రిసభ్య కమిటీ విచారణ నిర్వహించింది. దంత వైద్య కళాశాలలో తృతీయ సంవత్సరం పరీక్షలు రాసిన బీడీఎస్ విద్యార్థి కృష్ణ చైతన్య గతనెల 25వ తేదీన ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. విద్యార్థి ఆత్మహత్యకు ప్రొఫెసర్ లావణ్య వేధింపులే కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఈ సంఘటనపై మెజిస్టీరియల్ విచారణ జరిపిస్తామని కలెక్టర్ కోన శశిధర్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రతిరోజు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తూ వచ్చారు. దీంతో దంత వైద్య కళాశాలలో చోటుచేసుకున్న పరిణామాలను కలెక్టర్ ఎప్పటికప్పుడు వైద్యవిద్య డెరైక్టర్ దృష్టికి తీసుకెళ్తూ వచ్చారు. హైదరాబాదులోని వైద్య విద్య డెరైక్టర్ డాక్టర్ వెంకటేశ్ త్రిసభ్య కమిటీని నియమించారు. ఆ కమిటీ మంగళవారం కడప దంత వైద్య కళాశాలకు చేరుకుంది. త్రిసభ్య కమిటీలో చైర్మన్‌గా హైదరాబాదు ప్రభుత్వ దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బాలిరెడ్డి, సభ్యులుగా అక్కడి ప్రొఫెసర్ డాక్టర్ శాంతకుమారి, విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాల డాక్టర్ మురళీమోహన్ ఉన్నారు.
కడప రిమ్స్ ఆవరణంలోని దంత వైద్య కళాశాలకు చేరుకున్న త్రిసభ్య కమిటీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కళాశాల విద్యార్థులతో కాన్ఫరెన్స్ హాలులో సమావేశమయ్యారు. విద్యార్థులతోపాటు హౌస్ సర్జన్లను కూడా విచారించారు. త్రిసభ్యకమిటీ సభ్యులు ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఇక్కడి విషయాలను విద్యార్థుల ద్వారా తెలుసుకుని సమగ్ర నివేదికను డీఎంఈకి అందజేస్తామని చెప్పారు. కళాశాల అధ్యాపకులను కూడా విడిగా విచారిస్తామన్నారు. విద్యార్థులను విచారించే సమయంలో కళాశాల డెరైక్టర్‌నుగానీ, అధ్యాపకులనుగానీ అనుమతించకపోవడం గమనార్హం.