‘మామూలే కదా..! | "What I love ..! Gham | Sakshi
Sakshi News home page

‘మామూలే కదా..!

Published Wed, Oct 8 2014 3:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM

‘మామూలే కదా..!

‘మామూలే కదా..!

పంచాయతీరాజ్ శాఖలో అక్రమాల పర్వం
 
 గుర్తింపుకార్డు కావాలంటే రూ.500 కొట్టాల్సిందే..! ఉద్యోగ నియామక ధ్రువీకరణపత్రంపై సంతకం చేస్తే మరో రూ.500 చెల్లించాల్సిందే!.. ట్రెజరీ కార్యాలయంలో మరో రూ.వెయ్యి ముట్టజెప్పాల్సిందే..! ఇదీ ఇటీవల కొత్తగా నియమితులైన పంచాయతీ కార్యదర్శుల నుంచి వసూలుచేస్తున్న తీరు. కాదు.. లేదు! అంటే చిన్నపనికి చెప్పులరిగేలా తిప్పుకుంటున్నారు. ఇటీవల ఓ పంచాయతీ కార్యదర్శికి ట్రెజరీ కార్యాలయంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇదేంది.. సార్! అని ప్రశ్నించిన ఆ ఉద్యోగికి పై అధికారి ఇది ‘మాములే’ కదా..! అని బదులివ్వడం శోచనీయం. సర్కారు కొలువు వచ్చిందనే సంతోషమే లేదని బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
 
 సాక్షి, మహబూబ్‌నగర్:
 దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాలను బలోపేతం చేస్తాం. అందుకోసం ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని పారదర్శంగా ఉండేలా ఈ-కంప్యూటరీకరణ అమలుచేస్తాం. ప్రతి పనిని ఆన్‌లైన్‌లో వీక్షించేలా చర్యలు తీసుకుంటామని ఓ వైపు రాష్ట్రప్రభుత్వం ఊదరగొడుతుంటే.. మరోవైపు ఆశాఖలో పనిచేస్తున్న కొందరు అధికారుల తీరు మరోవిధంగా ఉంది. పంచాయతీరాజ్‌శాఖలో మాముళ్లు లేనిదే పని జరగదని ఖరాకండిగా చెప్పేస్తున్నారు. పైగా ఇదీ ఆనవాయితీ అంటూ కొత్తభాష్యం చెబుతున్నారు. జిల్లాలో ఇటీవల పంచాయతీరాజ్ కార్యదర్శులుగా 330 మంది విధుల్లో చేరారు.

కొత్తవారికి పోస్టింగ్‌లతో మొదలుకుని గుర్తింపుకార్డులు, యాక్టు-2ఫాం తదితర వాటికి విచ్చలవిడిగా డబ్బులు లాగుతున్నారు. కొత్త పంచాయతీ కార్యదర్శులు మొదటినెల జీతం అందుకోవాలంటే ఒక్కొక్కరు రూ.మూడువేలు చెల్లించుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. మరీ మొదటి నెల జీతం రావాలంటే ఈ ఖర్చులు మామూలేనని సర్దిచెబుతున్నారు. ఈ శాఖలో ఇది ‘మామూలే’ కదా..! అని ఓ అధికారి చెప్పడంతో పీఆర్ కార్యదర్శులు విస్తుపోయారు. గ్రామస్థాయిలో జరిగే పనులకు మీకు మున్ముందు పర్సెంటేజీలు తీసుకుంటారు కదా..! అంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. ఎవరికి ఫిర్యాదుచేస్తే ఏమవుతుందోనని ఈ కొత్త ఉద్యోగులు భయపడుతున్నారు.

 వసూళ్ల పర్వం ఇలా...
   పంచాయతీ కార్యదర్శుల నుంచి మొదటగా గుర్తిం పుకార్డు కోసం రూ.500 వసూలు చేస్తున్నారు. ఇందుకోసం ఎంపీడీఓ కార్యాలయంలోని ఓ  సెక్షన్ అధికారి వసూలు చేస్తున్నాడు. వారిని కాకుండా నేరుగా ప్రయత్నిస్తే పనిచేయకుండా తిప్పుకుంటున్నారు.

   ఉద్యోగి నియామకాన్ని అంగీకారం కోసం ఇచ్చే ధ్రువీకరణ పత్రం కోసం(యాక్టు-2) ఒక్కొక్కరి నుంచి రూ.వెయ్యి నుంచి రూ.రెండువేల వరకు లాగుతున్నారు. దీనిని జిల్లా డీపీఓ కార్యాలయంలోని ఓ విభాగం అధికారులు వసూలు చేస్తున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్ కార్యదర్శుల నుంచి నేరుగా కాకుండా కొందరు నేతలుగా చలామణి అవుతున్నవారు, సీనియర్లు మధ్యేమార్గంగా పని కానిచ్చేస్తున్నారు.

   ట్రెజరీ కార్యాలయంలో చేతులు తడపనిదే పనికాదని వారే తెగేసి చెబుతున్నారు. ఇక్కడ ఎస్టీఓ స్థాయి అధికారులకు ఒక్కొక్కరు రూ.500, ఫైలు పూర్తిచేసే వారికి మరో మరో రూ.500 సమర్పించుకోవాల్సి వస్తుందని కొందరు బాధిత  కార్యదర్శులు తెలిపారు.

   జిల్లాలో ఇటీవల విధుల్లో చేరిన ఒక్కో పంచాయతీ కార్యదర్శి నుంచి రూ.2500 నుంచి రూ.3వేల చొప్పున 330 మంది నుండి సుమారు రూ.9లక్షలకు పైగా వసూలుచేసినట్లు సమాచారం. ఇదిలాఉండగా, గతనెల 150 మంది, ఇటీవల మరో 100 మంది, మంగళవారం మిగితావారు కూడా చెల్లింపు పూర్తిచేసినట్లు తెలిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement