ప్రతీకాత్మక చిత్రం
ఎక్కడికి వెళ్లినా సరే మన గుర్తింపును తెలిపే ఏదో ఒక ఐడీ కార్డు కచ్చితంగా వెంట ఉండాల్సిందే. ఇక ఉద్యోగులకు, విద్యార్థులకైతే ఐడీకార్డు లేనిదే లోపలి ప్రవేశించే అనుమతి ఉండదు. ఇంతలా ప్రాధాన్యం ఉన్న ఐడీ కార్డును తరచుగా మర్చిపోయి ఇబ్బందుల పాలవడం సహజంగా జరిగేదే. మరి ఆ ఇబ్బందులను అధిగమించాలంటే స్వీడిష్ ప్రజలు అనుసరిస్తున్న విధానాన్ని మనమూ ఫాలో అయిపోతే సరిపోతుంది.
రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ప్రతీచోటా ఐడీ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండా తమ శరీరాన్నే మైక్రోచిప్‌లతో నింపేస్తున్నారు స్వీడిష్ ప్రజలు. బియ్యపు గింజ పరిమాణంలో ఉండే మైక్రోచిప్‌ను చేతిలో లేదా శరీరంలోని ఇతర భాగాల్లో అమర్చుకోవడం ద్వారా జిమ్ కార్డు, ఆఫీసు కీ కార్డులను రీప్లేస్ చేసేస్తున్నారు. 2015 నుంచే సుమారు 3 వేల మంది స్వీడిష్ ప్రజలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్ తెలిపింది. గతేడాది స్వీడన్ రైల్వే శాఖ బయోమెట్రిక్ చిప్స్ కలిగి ఉన్న తమ ప్రయాణికుల చేతిని స్కాన్ చేయడం ద్వారా ప్రయాణంలోనే టికెట్లు అందించే సరికొత్త విధానానికి తెరలేపింది.
మైక్రోచిప్ అమర్చుకోవడం సులువే.. కానీ..
ఇంజక్షన్ చేయించుకున్నంత తేలికగా శరీరంలో మైక్రోచిప్‌ను అమర్చుకోవచ్చు. స్వీడన్‌లోని పని ప్రదేశాల వద్ద ఇలా మైక్రోచిప్‌లను అమర్చే వారు అందుబాటులో ఉంటారు. కానీ ఈ ప్రక్రియ వల్ల ఇన్ఫెక్షన్లతో పాటు, జీవక్రియలపై చెడు ప్రభావం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని మైక్రోబయాలిస్టులు హెచ్చరిస్తున్నారు.
హ్యాకింగ్ ప్రమాదం తక్కువే...
స్వీడన్‌కు చెందిన బయోహ్యాకింగ్ గ్రూప్ బియానిఫికెన్ ఈ విధానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది. స్వీడన్‌తో పాటు యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికో దేశాల్లో ప్రజలు తమ చేతుల్లో మైక్రోచిప్‌లను అమర్చుకునేందుకు ఆసక్తి కనబరినట్లు తెలిపింది. స్నాక్స్ కొనేందుకు, కంప్యూటర్ లాగిన్, ఫొటోకాపియర్ ఇలా చిన్న చిన్న పనులకు కూడా మైక్రోచిప్‌లు అమర్చుకోవడం చూస్తుంటే టెక్నాలజీ పట్ల యువత ఎంతగా ఆకర్షితులవుతున్నారో అర్థమవుతోందని బయోఫికెన్ పేర్కొంది. శరీరాన్నే ఒక ప్రయోగశాలగా మార్చిన నేటి తరంలో స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్‌లంటూ అనేక రకాల గాడ్జెట్లను వెంట తీసుకెళ్లే బదులు చేతి వేళ్లను ఆడించడం ద్వారా మీ పనులను సులభతరం చేసుకోవచ్చని బయోఫికెన్ స్థాపకుడు హాన్స్ సోబ్లాడ్ సలహా కూడా ఇస్తున్నారు. హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉండటం వల్ల సుమారు 10 మిలియన్ల మంది మైక్రోచిప్‌లను అమర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment