Microbiology
-
నేడు మంగళగిరి ఎయిమ్స్ జాతికి అంకితం
సాక్షి, అమరావతి: మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థాన్(ఎయిమ్స్)ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాజ్‌కోట్ నుంచి వర్చువల్‌గా జాతికి అంకితం చేయనున్నారు. రూ.1618.23 కోట్లతో 183.11 ఎకరాల్లో 960 పడకలతో ఎయిమ్స్ని నిర్మించారు. ఇందులో 125 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఉంది. విశాఖ పెదవాల్తేరు వద్ద స్టేట్ ఫుడ్ ల్యాబ్ క్యాంపస్‌లో రూ.4.76 కోట్లతో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌తో పాటు రూ.2.07 కోట్ల విలువైన మరో 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ప్రధాని ప్రారంభిస్తారు. అలాగే ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌లో భాగంగా రూ.230 కోట్ల విలువైన 9 క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు కూడా ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. వీటిలో ప్రధానంగా వైఎస్సార్, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో రూ.23.75 కోట్ల చొప్పున, తెనాలి జిల్లా ఆస్పత్రిలో రూ.44.50 కోట్లు, హిందూపూర్ జిల్లా ఆస్పత్రిలో రూ.22.25 కోట్లతో చేపట్టనున్న క్రిటికల్ కేర్ బ్లాకుల్ని నిర్మించనున్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయం చేసుకోండి స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాల ఏర్పాట్లపై వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు ఎయిమ్స్ పరిపాలన భవన్లో శనివారం అధికారులతో సమీక్షించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, డాక్టర్ భారతీప్రవీణ్ పవార్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ పాల్గొంటారని, ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు రాకుండా ఆయా శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని కృష్ణబాబు సూచించారు. అనంతరం ఎయిమ్స్ ప్రాంగణంలోని సభా వేదికను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సమీక్షలో ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జె నివాస్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ (ట్రైనింగ్–నేకో) నిధి కేసర్వాని, ఎయిమ్స్ డైరెక్టర్, సీఈవో డాక్టర్ మధబానందకర్ తదితరులు పాల్గొన్నారు. -
శరీరాన్నే ఐడీ కార్డులుగా..!
ఎక్కడికి వెళ్లినా సరే మన గుర్తింపును తెలిపే ఏదో ఒక ఐడీ కార్డు కచ్చితంగా వెంట ఉండాల్సిందే. ఇక ఉద్యోగులకు, విద్యార్థులకైతే ఐడీకార్డు లేనిదే లోపలి ప్రవేశించే అనుమతి ఉండదు. ఇంతలా ప్రాధాన్యం ఉన్న ఐడీ కార్డును తరచుగా మర్చిపోయి ఇబ్బందుల పాలవడం సహజంగా జరిగేదే. మరి ఆ ఇబ్బందులను అధిగమించాలంటే స్వీడిష్ ప్రజలు అనుసరిస్తున్న విధానాన్ని మనమూ ఫాలో అయిపోతే సరిపోతుంది. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ప్రతీచోటా ఐడీ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండా తమ శరీరాన్నే మైక్రోచిప్‌లతో నింపేస్తున్నారు స్వీడిష్ ప్రజలు. బియ్యపు గింజ పరిమాణంలో ఉండే మైక్రోచిప్‌ను చేతిలో లేదా శరీరంలోని ఇతర భాగాల్లో అమర్చుకోవడం ద్వారా జిమ్ కార్డు, ఆఫీసు కీ కార్డులను రీప్లేస్ చేసేస్తున్నారు. 2015 నుంచే సుమారు 3 వేల మంది స్వీడిష్ ప్రజలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్ తెలిపింది. గతేడాది స్వీడన్ రైల్వే శాఖ బయోమెట్రిక్ చిప్స్ కలిగి ఉన్న తమ ప్రయాణికుల చేతిని స్కాన్ చేయడం ద్వారా ప్రయాణంలోనే టికెట్లు అందించే సరికొత్త విధానానికి తెరలేపింది. మైక్రోచిప్ అమర్చుకోవడం సులువే.. కానీ.. ఇంజక్షన్ చేయించుకున్నంత తేలికగా శరీరంలో మైక్రోచిప్‌ను అమర్చుకోవచ్చు. స్వీడన్‌లోని పని ప్రదేశాల వద్ద ఇలా మైక్రోచిప్‌లను అమర్చే వారు అందుబాటులో ఉంటారు. కానీ ఈ ప్రక్రియ వల్ల ఇన్ఫెక్షన్లతో పాటు, జీవక్రియలపై చెడు ప్రభావం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని మైక్రోబయాలిస్టులు హెచ్చరిస్తున్నారు. హ్యాకింగ్ ప్రమాదం తక్కువే... స్వీడన్‌కు చెందిన బయోహ్యాకింగ్ గ్రూప్ బియానిఫికెన్ ఈ విధానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది. స్వీడన్‌తో పాటు యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికో దేశాల్లో ప్రజలు తమ చేతుల్లో మైక్రోచిప్‌లను అమర్చుకునేందుకు ఆసక్తి కనబరినట్లు తెలిపింది. స్నాక్స్ కొనేందుకు, కంప్యూటర్ లాగిన్, ఫొటోకాపియర్ ఇలా చిన్న చిన్న పనులకు కూడా మైక్రోచిప్‌లు అమర్చుకోవడం చూస్తుంటే టెక్నాలజీ పట్ల యువత ఎంతగా ఆకర్షితులవుతున్నారో అర్థమవుతోందని బయోఫికెన్ పేర్కొంది. శరీరాన్నే ఒక ప్రయోగశాలగా మార్చిన నేటి తరంలో స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్‌లంటూ అనేక రకాల గాడ్జెట్లను వెంట తీసుకెళ్లే బదులు చేతి వేళ్లను ఆడించడం ద్వారా మీ పనులను సులభతరం చేసుకోవచ్చని బయోఫికెన్ స్థాపకుడు హాన్స్ సోబ్లాడ్ సలహా కూడా ఇస్తున్నారు. హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉండటం వల్ల సుమారు 10 మిలియన్ల మంది మైక్రోచిప్‌లను అమర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
అనుకోకుండా కలిశారు స్టార్టప్ అయి విరిశారు!
చెట్టు పచ్చగా ఉంటుంది. పచ్చదనంతో కనువిందు చేసి ఊరుకోదు. మనిషికి జీవితం మీద ప్రేమను కలిగిస్తుంది. రేపటి కోసం ఎదురు చూసేట్టు చేస్తుంది. ఈ రోజు మొక్కకు పాదు చేసి నీరు పోసిన మనిషి రేపు ఆ మొక్కకు చిగురించే కొత్త ఆకు కోసం సూర్యుడికంటే ముందే నిద్రలేచి ఎదురుచూస్తాడు. సరిగ్గా అట్లాంటి ఆసక్తే లక్ష్మిని, గంగను కలిపింది. వాళ్ల ద్వారా ప్రపంచానికి పచ్చ బంగారు లోకాన్ని పరిచయం చేసింది. కేరళ, కొచ్చి నగరంలోని జవహర్‌నగర్‌లో ఉంటారు లక్ష్మి, గంగ. లక్ష్మి మైక్రోబయాలజీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్, గంగ అగ్రికల్చర్ ఇంజనీర్. ఇద్దరిదీ ఒక సినిమా కథను పోలిన వాస్తవం. ఇద్దరూ పుట్టింది ఒకటే హాస్పిటల్, పెరిగిందీ ఒకటే నగరం, చదివింది ఒకటే కాలేజి. కానీ ఇద్దరూ ఏనాడూ ఒకరికి ఒకరు తారసపడింది లేదు. చదువయ్యాక ఒకరు జర్మనీకీ, ఒకరు నెదర్లాండ్స్కీ వెళ్లిపోయారు. పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత కెరీర్లో విరామం వచ్చింది. తల్లి పాత్రలో ఇమిడిపోయారిద్దరూ. ఆ ఇద్దరు తల్లులూ కొచ్చిలోని జవహర్ నగర్ పార్కులో పిల్లలను ఆడించుకుంటూ ఉన్నప్పుడు తొలిసారిగా కలిశారు. మాటల్లో ఇద్దరిలోనూ మొక్కల మీద ఉన్న ప్రేమ కొత్తగా మొగ్గలు తొడిగింది. కాంక్రీట్ జంగిల్లా మారిపోయిన జనారణ్యంలో మొక్కలకు స్థానమేదీ? ఇద్దరిదీ ఒకటే ఆవేదన. అభిరుచికి పాదులు అప్పటికే గంగ ఇంట్లో ఉన్న సీసాలను, పాత షూస్‌ని, పిల్లలు ఆడుకుని చక్రాలు విరగ్గొట్టిన స్కూటర్ బొమ్మలను మొక్కలకు పాదులుగా మార్చింది. గంగ ఇంట్లో వాటిని చూసిన లక్ష్మి... ఇదే ఫార్ములాను తన మైక్రోబయాలజీ కోర్సుతో అనుసంధానం చేసింది. కాలేజీలో గాజు బీకరుల్లో చేసిన ప్రయోగాల రోజుల్లోకి వెళ్లిపోయారిద్దరూ. ఏ మొక్కకు ఎంత పాట్మిక్చర్ (మట్టి, ఎరువు, గులక మిశ్రమం) వేయాలి, ఏ మొక్కకు ఎంత గాలి అవసరం, ఏ రకమైన గాజు పాత్ర ఏ మొక్క పెరగడానికి అనువుగా ఉంటుంది... వంటి ప్రశ్నలు తమకు తామే వేసుకున్నారు. మేధను మదించి ‘బాటిల్ గార్డెన్’ని సృష్టించారు! సీసాల్లో ప్రయోగాలు వీళ్లిద్దరూ మొక్కల మీద ప్రయోగాలు చేస్తున్న రోజుల్లో గంగ ఓ ఫంక్షన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఓ స్నేహితురాలి తల్లికి అరవయ్యవ పుట్టిన రోజు. ఆ పెద్దావిడకు తాను బీరు సీసాలో పెంచిన మొక్కను బహుమతిగా ఇచ్చింది గంగ. సీసా లోపల ఇసుక, గులక రాళ్లకు రంగులు వేసి వరుసలుగా పరిచిన తీరుకు ఫంక్షన్‌కి వచ్చిన వాళ్లు ముగ్ధులయ్యారు. ఆమె దగ్గర ఇంకా అలాంటివి ఉంటే కొనడానికి సిద్ధమయ్యారు ఐదారుగురు అక్కడే. తాను వ్యాపారంగా చేయలేదని అభిరుచిగా మాత్రమే చేశానని చెప్పిందామె. వ్యాపారంగా ప్రారంభించవచ్చు కదా అనే సలహాలు కూడా అప్పుడే అక్కడే వచ్చాయామెకి. అలా ‘గ్రీన్ పీస్ టెర్రారియమ్’ స్టార్టప్ మొదలైంది. అంటే గాజు అద్దాల వనం. రండిరండని ఆహ్వానాలు! ఇప్పుడు గంగ, లక్ష్మి ఇద్దరికీ గార్డెనింగ్ వర్క్‌షాపులకు ఆహ్వానం వస్తోంది. బాటిల్ గార్డెన్లను ఎలా పెంచాలో నేర్పిస్తున్నారు వాళ్లు. ఇందులో సులువు తెలిస్తే పిల్లలు కూడా మొక్కలను పెంచగలుగుతారని చెబుతోంది గంగ. మొక్కను పెంచడంతోపాటు, ఏ మొక్కకు ఎలాంటి గాజు పాత్రను తీసుకోవాలనే ఎంపికలోనూ, బాటిల్లో మొక్క పాదు అందంగా కనిపించేటట్లు ఇసుక, మట్టి ఇతర మెటీరియల్‌ను వేయడం కూడా నైపుణ్యం కనబరచాలంటారామె. పబ్లిసిటీ లేకుండానే నెలకు నలభై వేలు! ‘గృహిణిగా ఖాళీ సమయం అనేదే ఉండదు. అయినప్పటికి మొక్కల కోసం సమయాన్ని సర్దుబాటు చేసుకున్నాం. అదే మమ్మల్ని ఎంట్రప్రెన్యూర్లుగా మార్చింది’ అంటారు గంగ, లక్ష్మి. ఇప్పుడు వీళ్లిద్దరూ బాటిల్ గార్డెనింగ్‌తో నెలకు నలభై వేల రూపాయలు మిగుల్చుకుంటున్నారు. వ్యాపార ప్రచారం కోసం ఒక్క రూపాయి కానీ ఓ గంట సమయాన్ని కానీ ఖర్చు చేసింది లేదు! వీళ్ల దగ్గర ఈ చిట్టి తోటలను కొన్న వాళ్లే వాటిని గర్వంగా నలుగురికీ చూపించుకునే వాళ్లు. తన ప్రేయసికి పుట్టిన రోజు బహుమతిగా టెర్రారియమ్ మొక్కను ఇచ్చిన ప్రియుడు తన అభిరుచికి తానే మురిసిపోతూ గొప్పగా ఆ ఫొటోను ఫ్రెండ్స్‌కి షేర్ చేసేవాడు. అందుకున్న ప్రియురాలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసేది. ఆ ముచ్చట్లే గ్రీన్ పీస్ టెర్రారియమ్కి ప్రచారాలయ్యాయి. – మంజీర -
రోజులు గడిచి.. విచారణ మరిచి!
► నీరుగారుతున్న ఎయిడ్స్ కిట్ల కేసు ► సూత్రధారులను తప్పించే ప్రయత్నం ► అక్రమాలపై నోరు మెదపని అధికారులు ► రెండు వారాలుగా ఇదే తంతు ► ఇప్పటికీ మొదలు కాని విచారణ అధికారులు తప్పు చేస్తే తప్పించుకోవడం చాలా తేలిక. అదీ సొంత శాఖ వారయితే.. ఇక అడ్డేముంది. విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటిస్తే సరి.. ఆ తర్వాత షరా మామూలే. చేస్తున్నాం.. చూస్తున్నాం.. అనే మాటలతో నెట్టుకురావడం అధికారులకు కొత్తేమీ కాదనేది ఎయిడ్స్ కిట్ల వ్యవ హారంలో మరోసారి రుజువవుతోంది. ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత హెచ్ఐవీ కిట్లను తిరిగి ప్రభుత్వాసుపత్రికే విక్రయించిన ఉదంతాన్ని ‘సాక్షి’ రెండు వారాల క్రితం వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పటికీ విచారణ మొదలు కాకపోవడం తోటి అధికారుల సహకారానికి నిదర్శనం. కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లాలో రెండు వారాల క్రితం హెచ్ఐవీ కిట్ల వ్యవహారం తీవ్ర దుమారం రేపిన విషయం విదితమే. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి(నాకో) ద్వారా రాష్ట్రీయ ఎయిడ్స్ నియంత్రణ మండలికి, అక్కడి నుంచి జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి కార్యాలయానికి ఉచితంగా హెచ్ఐవీ కిట్లను సరఫరా చేస్తారు. ఇందుకు సంబంధించి వాకిన్ కూలర్‌ను సైతం నాకో సరఫరా చేసింది. అయితే ఈ కూలర్‌ను ఏర్పాటు చేసేందుకు తమ వద్ద స్థలం లేదని చెప్పి, దానిని కర్నూలు మెడికల్ కాలేజీలోని మైక్రోబయాలజి విభాగానికి చేర్చారు. అక్కడి నుంచే జిల్లాలోని ఐసీటీసీ, పీపీటీసీ, ఏఆర్టీ సెంటర్లకు, పీహెచ్‌సీలకు హెచ్ఐవీ కిట్లు వెళ్తాయి. ఇలా వచ్చిన కిట్లను వైద్యులు, సిబ్బంది, అధికారులతో కొందరు వ్యాపారస్తులు కుమ్మక్కై పక్కదారి పట్టించారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ఔషధ నియంత్రణ మండలి అధికారులు జిల్లా వ్యాప్తంగా ల్యాబొరేటరీలు, మెడికల్ ఏజెన్సీలు, మెడికల్ దుకాణాలపై దాడులు నిర్వహించారు. కర్నూలులోని రెండు మెడికల్ ఏజెన్సీలలో నాకో సరఫరా చేసిన హెచ్ఐవీ కిట్లను గుర్తించారు. వీటి ఆధారంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని 24 గంటలు పనిచేసే ల్యాబ్‌లో, కర్నూలు మెడికల్ కాలేజీలోని మైక్రోబయాలజి ల్యాబ్‌లో 2వేల దాకా నాకో హెచ్ఐవీ కిట్లు లభించాయి. ఇందుకు సంబంధించి ఔషధ నియంత్రణ అధికారులు పంచనామా చేసి, నివేదికను కోర్టుకు సమర్పించారు. సూత్రధారులు తప్పించుకునేలా విచారణ నాకో సరఫరా చేసిన ఉచిత హెచ్ఐవీ కిట్లు మెడికల్ ఏజెన్సీలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో లభించి రెండు వారాలవుతున్నా విచారణ ప్రారంభం కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ నిధుల నుంచి హెచ్ఐవీ కిట్లను కొనుగోలు చేస్తారు. ఇలా వచ్చిన రీకాన్ కంపెనీ హెచ్ఐవీ కిట్లను కాదని.. ఎస్డీ కంపెనీ కిట్లు కావాలని తెప్పించుకున్నారు. ఈ కిట్లు నాకో సరఫరా చేసినవని ఔషధ నియంత్రణ మండలి అధికారుల తనిఖీలో బయటపడింది. ఈ కిట్లను గత డిసెంబర్లో తెప్పించుకున్నా వాడకుండా మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో ఓ మూలన భద్రపరిచారు. మైక్రోబయాలజి ల్యాబ్‌లో గత మూడు నెలలుగా హెచ్ఐవీ పరీక్షలు చేయడం లేదని సమాచారం. ఒకవైపు ఉన్న కిట్లను మూలనపడేసి, మరోవైపు కిట్ల కొరత ఉందని పేర్కొంటూ 2వేల కిట్లకు ఆర్డర్ పెట్టారు. ఈ మేరకు గత జనవరి 21న టెండర్ దారుడైన స్వాతి ఏజెన్సీ నుంచి కాకుండా స్టార్ ఏజెన్సీ నుంచి వెయ్యి కిట్లు తెప్పించారు. వీటిని కూడా ఇప్పటి వరకు వినియోగించకుండా ఆరోగ్యశ్రీ కార్యాలయానికి పరిమితం చేశారు. హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించకుండా కేవలం కమీషన్ల కోసమే కిట్లను కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలకు ఈ పరిణామం బలాన్ని చేకూరుస్తోంది. పని ఒత్తిడి సాకు.. హెచ్ఐవీ కిట్లకు సంబంధించి విచారణ అధికారిగా సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ వై.శ్రీనివాసులును నియమించారు. రెండు రోజుల అనంతరం రేడియాలజిస్ట్ డాక్టర్ జోజిరెడ్డిని సైతం విచారణాధికారిగా నియమించారు. అయితే వీరిని నియమించి పది రోజులైనా ఇప్పటిదాకా విచారణ ప్రారంభించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామిని ‘సాక్షి’ వివరణ కోరగా పని ఒత్తిడి కారణంగా విచారణ ప్రారంభం కాలేదన్నారు. త్వరగా పూర్తి చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
కాంటాక్ట్ లెన్స్‌లు వాడేవారూ... కాస్త జాగ్రత్త!
కొత్త పరిశోధన స్వాభావికంగా కంటిలో ఉండే బ్యాక్టీరియాతో పోలిస్తే... కాంటాక్ట్‌లెన్స్‌లు వాడేవారి కళ్లలో ఉండే బ్యాక్టీరియా కాస్త మారిపోయి వేరుగా ఉంటుందట. అందుకే మిగతావారితో పోలిస్తే కాంటాక్ట్‌లెన్స్‌లు వాడేవారిలో కంటి ఇన్ఫెక్షన్లు ఎక్కువని అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ నిర్వహించిన వార్షిక సదస్సులో పరిశోధకులు వెల్లడించారు. వీరు తమ పరిశోధనల్లో కాంటాక్ట్లెన్స్లను ధరించేవారినీ, వాటిని ధరించని వారితో పోల్చిచూస్తూ తమ అధ్యయనాలను కొనసాగించారు. సాధారణంగా కంటిలో ఇన్ఫెక్షన్లతో పోరాడే బ్యాక్టీరియా ఉంటుంది. కానీ కొంతకాలంపాటు కాంటాక్ట్‌లెన్స్‌లు ధరించేవారిలో ఆ బ్యాక్టీరియా మారిపోయి, కనురెప్పల వద్ద ఉండే బ్యాక్టీరియాతో పోలినదానిలా మారుతుందట. కాంటాక్ట్లెన్స్లను ధరించని వారి కంటిలో ఉండే బ్యాక్టీరియాతో పోల్చినప్పుడు అది కాస్త భిన్నంగానూ ఉంటోందట. అయితే కొన్ని రకాల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలను పెంచడం మినహా, కళ్లకు జరిగే హాని కాంటాక్ట్‌లెన్స్ వంటి ఫారిన్‌బాడీ వల్ల జరుగుతోందా లేక అది అమర్చుకుంటున్నప్పుడు మన వేళ్ల ఒత్తిడి వల్ల జరుగుతందా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదంటున్నారు వారు. అయితే కాంటాక్ట్ లెన్స్‌లు ధరించేవారు తమ చేతులు, కనురెప్పల శుభ్రత విషయంలో మరింత జాగ్రత్త ఉండాలని మాత్రం సూచనలు చేస్తున్నారు ఈ పరిశోధకులు. -
ఫోక్.. ఫీవర్
మైక్రోబయాలజీలో గోల్డ్ మెడలిస్ట్. భరతనాట్యంలో దిట్ట. ఇప్పుడు. ఫోక్ బ్యాండ్ రూపకర్త. ఫోక్ బ్యాండ్‌తో సంచలనాలు సృష్టిస్తున్న రఘుదీక్షిత్ ప్రాజెక్ట్ సమర్పించిన సంగీత సందడిలో నగరవాసులు మునిగితేలారు. తన ఆల్‌టైమ్ హిట్ జగ్ చంగాతో పాటుగా మైసూర్ సే ఆయే ఓ, హే భగవాన్, గుడుగుడియా సేడీ నోడో (కన్నడ) వంటి పాటలతో ఫోక్ ఫీవర్‌ని సృష్టించారు రఘు దీక్షిత్ అండ్ కో. హైడొరైట్ 100డేస్ లాంగెస్ట్ ఫెస్టివల్లో భాగంగా అప్పా జంక్షన్లో నిర్వహించినకార్యక్రమం ఆద్యంతం ఫోక్ లవర్స్‌ను ఆకట్టుకుంది. తనదైన శైలిలో సామాన్యుల భాషలో రఘు రచించిన పాటలు అతిథులకు వీనుల విందు చేశాయి. వేలాదిగా సంగీతాభిమానులు హాజరైన ఈ కార్యక్రమాన్ని హైడొరైట్ నిర్వాహకులు రామకృష్ణ, మనోజ్, ఆనంద్‌లు పర్యవేక్షించారు. -
పూటకో మాట
అనంతపురం అర్బన్ : డెంగీ కేసులకు సంబంధించి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి (డీఎంఅండ్‌హెచ్‌ఓ) రామసుబ్బారావు రోజుకో రీతిలో ప్రకటనలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు. జిల్లాలో అసలు డెంగీ కేసులే లేవని మొన్న ప్రకటించిన ఆయన.. ఇప్పుడు మాత్రం 15 కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వైద్య కళాశాలలోని మైక్రోబయాలజీ విభాగంలో కేసులను నిర్ధారించారని అంటున్నారు. ఇదే విషయాన్ని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.నీరజ వద్ద ప్రస్తావిస్తే.. తమ పరిధిలో ఇప్పటి వరకు 10 కేసులు మాత్రమే పాజిటివ్‌గా గుర్తించామన్నారు. అందుకు సంబంధించిన వివరాలను కూడా లిఖిత పూర్వకంగా అందజేశారు. మలేరియా విభాగం, ఆస్పత్రి నుంచి వచ్చిన 149 రక్తపూతలను పరీక్షించగా.. 10 మందికి డెంగీ సోకినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. కాగా.. డెంగీ కేసులకు సంబంధించి ఎలీసా రీడర్ ద్వారా పరీక్షించిన వాటినే పరిగణనలోకి తీసుకోవాలని వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. గత నెలలో నలుగురు చనిపోతే అవి డెంగీ కేసులుగా నిర్ధారించారు. ఎలీసా రీడర్ ద్వారా పరీక్షించని కేసులను ఏవిధంగా డెంగీగా నిర్ధారించారో అర్థం కావడం లేదు. ఇది వైద్య,ఆరోగ్య శాఖాధికారుల పనితీరును తేటతెల్లం చేస్తోంది. ఎలీసా కిట్స్ కొరత ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎలీసా కిట్స్ కొరత ఉంది. ఒక కిట్ ద్వారా 50 మందికి డెంగీ పరీక్షలు నిర్వహించవచ్చు. ఒక్కో కిట్ విలువ దాదాపు రూ.10 వేలు ఉంటుంది. ఎక్కువ కేసులొస్తే కిట్లు ఎక్కడి నుంచి తెస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీరజ మాత్రం కిట్లను వైద్య ఆరోగ్యశాఖాధికారులే ఇవ్వాలని అంటున్నారు.