రోజులు గడిచి.. విచారణ మరిచి!
► నీరుగారుతున్న ఎయిడ్స్ కిట్ల కేసు
► సూత్రధారులను తప్పించే ప్రయత్నం
► అక్రమాలపై నోరు మెదపని అధికారులు
► రెండు వారాలుగా ఇదే తంతు
► ఇప్పటికీ మొదలు కాని విచారణ
అధికారులు తప్పు చేస్తే తప్పించుకోవడం చాలా తేలిక. అదీ సొంత శాఖ వారయితే.. ఇక అడ్డేముంది. విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటిస్తే సరి.. ఆ తర్వాత షరా మామూలే. చేస్తున్నాం.. చూస్తున్నాం.. అనే మాటలతో నెట్టుకురావడం అధికారులకు కొత్తేమీ కాదనేది ఎయిడ్స్ కిట్ల వ్యవ హారంలో మరోసారి రుజువవుతోంది. ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత హెచ్‌ఐవీ కిట్లను తిరిగి ప్రభుత్వాసుపత్రికే విక్రయించిన ఉదంతాన్ని ‘సాక్షి’ రెండు వారాల క్రితం వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పటికీ విచారణ మొదలు కాకపోవడం తోటి అధికారుల సహకారానికి నిదర్శనం.
కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లాలో రెండు వారాల క్రితం హెచ్‌ఐవీ కిట్ల వ్యవహారం తీవ్ర దుమారం రేపిన విషయం విదితమే. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి(నాకో) ద్వారా రాష్ట్రీయ ఎయిడ్స్ నియంత్రణ మండలికి, అక్కడి నుంచి జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి కార్యాలయానికి ఉచితంగా హెచ్‌ఐవీ కిట్లను సరఫరా చేస్తారు. ఇందుకు సంబంధించి వాకిన్ కూలర్‌ను సైతం నాకో సరఫరా చేసింది. అయితే ఈ కూలర్‌ను ఏర్పాటు చేసేందుకు తమ వద్ద స్థలం లేదని చెప్పి, దానిని కర్నూలు మెడికల్ కాలేజీలోని మైక్రోబయాలజి విభాగానికి చేర్చారు.
అక్కడి నుంచే జిల్లాలోని ఐసీటీసీ, పీపీటీసీ, ఏఆర్‌టీ సెంటర్లకు, పీహెచ్‌సీలకు హెచ్‌ఐవీ కిట్లు వెళ్తాయి. ఇలా వచ్చిన కిట్లను వైద్యులు, సిబ్బంది, అధికారులతో కొందరు వ్యాపారస్తులు కుమ్మక్కై పక్కదారి పట్టించారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ఔషధ నియంత్రణ మండలి అధికారులు జిల్లా వ్యాప్తంగా ల్యాబొరేటరీలు, మెడికల్ ఏజెన్సీలు, మెడికల్ దుకాణాలపై దాడులు నిర్వహించారు. కర్నూలులోని రెండు మెడికల్ ఏజెన్సీలలో నాకో సరఫరా చేసిన హెచ్‌ఐవీ కిట్లను గుర్తించారు.
వీటి ఆధారంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని 24 గంటలు పనిచేసే ల్యాబ్‌లో, కర్నూలు మెడికల్ కాలేజీలోని మైక్రోబయాలజి ల్యాబ్‌లో 2వేల దాకా నాకో హెచ్‌ఐవీ కిట్లు లభించాయి. ఇందుకు సంబంధించి ఔషధ నియంత్రణ అధికారులు పంచనామా చేసి, నివేదికను కోర్టుకు సమర్పించారు.
సూత్రధారులు తప్పించుకునేలా విచారణ
నాకో సరఫరా చేసిన ఉచిత హెచ్‌ఐవీ కిట్లు మెడికల్ ఏజెన్సీలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో లభించి రెండు వారాలవుతున్నా విచారణ ప్రారంభం కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ నిధుల నుంచి హెచ్‌ఐవీ కిట్లను కొనుగోలు చేస్తారు. ఇలా వచ్చిన రీకాన్ కంపెనీ హెచ్‌ఐవీ కిట్లను కాదని.. ఎస్‌డీ కంపెనీ కిట్లు కావాలని తెప్పించుకున్నారు. ఈ కిట్లు నాకో సరఫరా చేసినవని ఔషధ నియంత్రణ మండలి అధికారుల తనిఖీలో బయటపడింది. ఈ కిట్లను గత డిసెంబర్‌లో తెప్పించుకున్నా వాడకుండా మైక్రోబయాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఓ మూలన భద్రపరిచారు.
మైక్రోబయాలజి ల్యాబ్‌లో గత మూడు నెలలుగా హెచ్‌ఐవీ పరీక్షలు చేయడం లేదని సమాచారం. ఒకవైపు ఉన్న కిట్లను మూలనపడేసి, మరోవైపు కిట్ల కొరత ఉందని పేర్కొంటూ 2వేల కిట్లకు ఆర్డర్ పెట్టారు. ఈ మేరకు గత జనవరి 21న టెండర్ దారుడైన స్వాతి ఏజెన్సీ నుంచి కాకుండా స్టార్ ఏజెన్సీ నుంచి వెయ్యి కిట్లు తెప్పించారు. వీటిని కూడా ఇప్పటి వరకు వినియోగించకుండా ఆరోగ్యశ్రీ కార్యాలయానికి పరిమితం చేశారు. హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించకుండా కేవలం కమీషన్ల కోసమే కిట్లను కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలకు ఈ పరిణామం బలాన్ని చేకూరుస్తోంది.
పని ఒత్తిడి సాకు..
హెచ్‌ఐవీ కిట్లకు సంబంధించి విచారణ అధికారిగా సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ వై.శ్రీనివాసులును నియమించారు. రెండు రోజుల అనంతరం రేడియాలజిస్ట్ డాక్టర్ జోజిరెడ్డిని సైతం విచారణాధికారిగా నియమించారు. అయితే వీరిని నియమించి పది రోజులైనా ఇప్పటిదాకా విచారణ ప్రారంభించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామిని ‘సాక్షి’ వివరణ కోరగా పని ఒత్తిడి కారణంగా విచారణ ప్రారంభం కాలేదన్నారు. త్వరగా పూర్తి చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.