జన్మభూమి కమిటీల పెత్తనం ఏమిటి?
అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే కాకాణి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జన్మభూమి కమిటీలు రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి గురువారం ఆరోపించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పింఛన్ల వివరాలు, కేంద్ర ప్రభుత్వ పింఛన్ల సాయంపై ఆయన మాట్లాడారు. జన్మభూమి కమిటీల జోక్యంతో అర్హులకు పింఛన్లు అందడంలేదని, జరుగుతున్న అన్యాయంపై ధ్వజమెత్తారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో అర్హులందరికీ పార్టీలకతీతంగా పింఛన్లను అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు.
అయితే ప్రస్తుత ప్రభుత్వం దీనికి విరుద్ధంగా జన్మభూమి కమిటీలకు ప్రమేయం కల్పించి రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు వెంటనే పింఛన్లు అందజేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో అందజేసిన పింఛన్లు, ప్రస్తుత ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్లను గణాంకాలతో సహా వివరించారు. ఆధార్‌కార్డుల్లో చేతివేళ్లు నమోదు కాలేదని, భూమి కలిగి ఉన్నారని, వయస్సు తక్కువ, తదితర కారణాలతో తమ పార్టీ మద్దతుదారుల పింఛన్లను తొలగించారని ఆరోపించారు.