ఇదేమిటి వినాయకా!
- కాణిపాకం లడ్డూ తయారీలో నాణ్యతకు తిలోదకాలు
- 20 నుంచి 30 గ్రాముల బరువు తగ్గిన వైనం
- నెయ్యి నాణ్యతా అంతంతమాత్రమే
- ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సూచనలు గాలికి
కాణిపాకం: కాణిపాకం వినాయకుని లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. గతంలో 70 గ్రాముల బరువుతో స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని రూ.5కు విక్రయించేవారు. రెండేళ్ల క్రితం లడ్డూ బరువును వంద గ్రాములకు పెంచుతూ ధర రూ.10 చేశారు. ఇందుకు తగినట్లు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదన్న విమర్శలున్నాయి.
తయారు చేసిన గంటల వ్యవధిలోనే గట్టిగా మారుతోంది. రుచిలోనూ చాలా మార్పులు ఉన్నాయని భక్తులు వాపోతున్నారు. పైగా లడ్డూ బరువు 75 నుంచి 85 గ్రాములకు మించడం లేదు. లడ్డూ తయారీకి వాడే వస్తువుల నాణ్యత లోపం, కల్తీ నెయ్యి వాడకం, ఎండు ద్రాక్షా, జీడిపప్పు, యాలకులు కనిపించకపోవడం, కల కండ ఎక్కువగా వాడడం తదితర కారణాలతో ప్రసాదంపై భక్తులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.
ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సూచనలు గాలికి..
గతంలో పోటు సిబ్బందికి ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన సూచనలు, సలహాలను గాలికి వదిలేశారు. బూందిని ముద్దగా తయారు చేసే సమయంలో నీళ్లతో చేతులు తడుపుకుంటుంటారు. నెయ్యితోనే చేతులు తడుపుకుని లడ్డు ముద్దను తయారు చేస్తే ప్రసాదం గట్టిగా మారదని వారు సూచించారు. పోటులో పని చేసే సిబ్బంది తలకు టోపీలు, ముఖానికి మాస్క్‌లు, చేతులకు గ్లౌజులు ధరించాలన్న సూచనలు పాటించడం లేదు. లడ్డూ తయారీలో నైపుణ్యం కలి గిన వారికి ప్రాముఖ్యత ఇవ్వడం లేద ని, అందువల్లే ప్రసాదం రంగులో మార్పులు కనిపిస్తున్నాయని పలువురు అంటున్నారు.
వడల తయారీలోనూ నిర్లక్ష్యమే
ఆలయంలో లడ్డూలతోపాటు వడలకూ విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే అవి ఎప్పుడూ అందుబాటులో ఉండ డం లేదు. రోజుకు 500 వడలను మాత్రమే తయారు చేసి విక్రయిస్తారు. ఒక్కొక్క వడను రూ.5కు విక్రయిస్తారు. ఇవి కొందరికి మాత్రమే దక్కుతున్నాయి. దీనికితోడు వడలు తయారైన వెంటనే పైరవీలతో పోటు వద్దనే సగానికి పైగా అదృశ్యమవుతాయి. మిగిలి నవి కనీసం గంట సమయం కూడా కౌంటర్‌లో లభించవు. ఆలయ అధికారులు స్పందించి ప్రసాదాల నాణ్యతపై దృష్టి సారించడమేగాక వడలు భక్తులకు కావాల్సినన్ని అందివ్వాల్సి ఉంది.